Bhagavanthudu Teaser: హీరో తిరువీర్ నటించిన ‘భగవంతుడు’ సినిమా టీజర్ తాజాగా విడుదలై మంచి స్పందన తెచ్చుకుంటోంది. సింపుల్‌గా కనిపించినా లోతైన కథ ఉంటుందన్న భావన ఈ టీజర్ చూస్తే స్పష్టంగా అర్థమవుతోంది. ఈ భూమి మీద రెండు రకాల కథలు ఉంటాయి.. ఒకటి ఆ దేవుల్లే ఈ భూమి మీద మనుషులుగా అవతరించే కథలు.. మరొకటి మనుషులే దైవాలుగా అవతరించే కథలు..అనే లైన్‌తో స్టార్ట్ అయిన ఈ టీజర్ మొత్తం కూడా ప్రేక్షకులను..మొదటి క్షణం నుంచే ఆకట్టుకుంటోంది. అంతేకాదు.. హీరో హీరోయిన్ మధ్య కొన్ని సన్నివేశాలు కూడా బోల్డ్ గా ఉన్నాయి.
తిరువీర్ గురించి ప్రత్యేకంగా చెప్పాలంటే, జార్జిరెడ్డి, పలాస, టక్ జగదీష్ లాంటి సినిమాల్లో సహాయ నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత మసూద, పరేషాన్, ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో వంటి సినిమాలతో హీరోగా కూడా ప్రేక్షకులను అలరించాడు. ఎక్కువగా అమాయకమైన పాత్రల్లో కనిపించిన తిరువీర్.. ఈసారి మాత్రం పూర్తిగా బోల్డ్ క్యారెక్టర్‌లో కనిపిస్తున్నాడు. ఇదే ఈ సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతోంది.
‘భగవంతుడు’ సినిమా పల్లెటూరి నేపథ్యంలో రూపొందింది. గ్రామాల్లో ఉండే ఆచారాలు, సంప్రదాయాలు, దేవుడిపై నమ్మకం, భయం, విశ్వాసం వంటి అంశాలను కథలో ప్రధానంగా.. చూపించినట్లు టీజర్ ద్వారా తెలుస్తోంది. టైటిల్‌కు తగ్గట్టుగానే కథనం కూడా గంభీరంగా ఉండబోతుందని అనిపిస్తోంది. పోస్టర్‌లో కనిపించే శూలం, కత్తి, డప్పు వంటి అంశాలు కథలో కీలక పాత్ర పోషించబోతున్నాయనే సంకేతాలు ఇస్తున్నాయి.
ఈ సినిమాలో హీరోయిన్‌గా ఫరియా అబ్దుల్లా నటిస్తోంది. తిరువీర్–ఫరియా మధ్య వచ్చే రొమాంటిక్ సన్నివేశాలు కూడా టీజర్‌లో కొద్దిగా చూపించారు. ప్రేమతో పాటు భావోద్వేగాలు కూడా కథలో బలంగా ఉండబోతున్నాయని అర్థమవుతోంది. విలన్ పాత్రలో రిషి నటిస్తుండగా, రవీందర్ విజయ్, కాలకేయ ప్రభాకర్ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.
ఈ చిత్రానికి జిజి విహారి దర్శకత్వం వహించగా.. రవి కుమార్ పనస నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇది జిజి విహారి తొలి సినిమా అయినప్పటికీ, కథనం చాలా పరిపక్వంగా ఉంటుందనే అభిప్రాయం టీజర్ చూస్తే కలుగుతుంది. ఈ వేసవిలో ‘భగవంతుడు’ సినిమాను థియేటర్లలో విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
ALSO READ: Pawan Kalyan : ప్చ్.. పవన్ కళ్యాణ్ టైమ్ బాగోలేదు, వాళ్లకు ఛాన్స్ దొరికిందిగా!