ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి.ఓవైపు లైంగికవేధింపుల ఆరోపణలు, మరోవైపు తిరుమల లడ్డూ వ్యవహారం రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తున్నాయి. గత వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రసాదాల తయారీలో జంతువుల అవశేషాల నుంచి తయారుచేసిన నెయ్యిని అందులో కలుపుతున్నారని..ఆలయ పవిత్రతను, భక్తుల నమ్మకాలను నాటి వైసీపీ ప్రభుత్వం మంటగలిపిందని అప్పటి జనసేనాని పవన్ కళ్యాణ్ పెద్దఎత్తున ఆరోపించారు. అప్పటి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ నేతలు సైతం తీవ్రఆరోపణలు చేశారు. అప్పట్లో ఆ విషయం జాతీయ స్థాయిలో పెద్దఎత్తున చర్చకు దారితీసింది.
గతంలో వైఎస్సార్ సీపీ పార్టీ ప్రజల్లో నమ్మకం కోల్పోవడానికి కూడా టీటీడీ లడ్డూ వ్యవహారం కారణమని చెప్పవచ్చు. పెద్దఎత్తున ప్రతిపక్షాల నుంచి విమర్శలు, ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత రావడంతో గత ఎన్నికల్లో జగన్ అధికారానికి దూరమయ్యారని కూడా ప్రచారం జరిగింది.వేంకటేశ్వర స్వామితో పెట్టుకున్నవారు ఎవరైనా మట్టి కరవాల్సిందే అని ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టంచేశారు.ఇకపోతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ టీటీడీలో అన్యమతస్తుల నియామకాలను సైతం తీవ్రంగా ఖండించారు.ఆలయ ప్రతిష్టతను జగన్ దెబ్బతీశారని, హిందువుల విశ్వసాలతో ఆడుకుంటున్నారని ఆరోపించారు. ఇక తిరుమల తిరుపతి లడ్డూ వ్యవహారంపై సీబీఐ విచారణ కూడా జరిగింది.
Phone Tapping Case: మరోసారి కేసీఆర్‌కు సిట్ నోటీసులు! విచారణ హైదరాబాద్‌లో, దానిపై కోర్టుకి?
తాజాగా సీబీఐ తన నివేదికలో.. లడ్డూ తయారీలో వాడిన నెయ్యిలో ఎటువంటి జంతు అవశేషాలు కనిపించలేదని స్పష్టంచేసింది. దీంతో వైసీపీ ఈ విషయాన్ని ప్రధాన అస్త్రంగా మలుచుకున్నది. సీబీఐ నివేదికను చూపిస్తూ వారు అధికార కూటమి సర్కార్‌పై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఆ నాడు తప్పుడు ఆరోపణలు చేశారని, ఈ విషయాన్ని సీబీఐ ప్రూవ్ చేసిందని.. మండిపడుతున్నారుు. ఇక జనసేన రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై వచ్చిన లైంగిక ఆరోపణల వ్యవహారాన్ని భూతద్దంలో చూపిస్తూ పెద్దఎత్తున విమర్శలు చేస్తున్నారు.
ఓ మహిళా ఉద్యోగినిని తన పార్టీ ఎమ్మెల్యే లైంగిక వేధింపులకు గురిచేసిన ఘటనలో పవన్ ఎందుకు స్పందించడంలేని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఆయన్ను సస్పెండ్ చేస్తారా? లేక విచారణకు ఆదేశిస్తారా? పార్టీ నుంచి శాశ్వతంగా తొలగిస్తారా? ఏం చేస్తారో చెప్పాలని పవన్ మీద వైసీపీ నేతలు ఒత్తిడి పెంచుతున్నారు. మరోవైపు సీబీఐ రిపోర్టును చూపిస్తూ పవన్ ఆనాడు చేసిన ఆరోపణలకు ఇప్పుడు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేస్తున్నారు.లేదంటే పెద్దఎత్తున నిరసనలు తెలుపుతామని ప్రతిపక్ష వైసీపీ హెచ్చరికలు చేస్తున్నది. ఇదిలాఉండగా, పవన్ కళ్యాణ్‌కు కాలం కలిసి రావడం లేదని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. అయితే, పవన్ ఇప్పటివరకు ఎందుకు స్పందించడం లేదో అని జనసేన లోనూ తీవ్ర చర్చ జరుగుతున్నట్టు సమాచారం. త్వరగా ఈ సమస్యకు ఫుల్ స్టాప్ పెట్టాలని లేదా దీర్ఘకాలంలో పార్టీకి సమస్యగా మారుతుందని భావిస్తున్నట్టు తెలుస్తున్నది.