రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల హడావుడి నెలకొన్నది. నేడు నామినేషన్ దాఖలుకు చివరి తేదీ కావడంతో ప్రధాన పార్టీలు నిర్ణీత గడువులోగా తమ అభర్థుల చేత దగ్గరుండి నామినేషన్స్ వేయిస్తున్నారు. పలు చోట్ల కొందరు పార్టీ టికెట్ దక్కని వారు స్వతంత్రంగా నామినేషన్స్ వేస్తున్నట్టు సమాచారం అందుతోంది. ప్రస్తుతం అధికార పార్టీలో రెబల్స్ బెడద భారీగానే ఉన్నట్టు తెలుస్తున్నది. ఇదే అంశాన్ని తమకు ప్లస్‌గా మార్చుకోవాలని ప్రతిపక్షాలు భావిస్తుండగా.. వారికి చెక్ పెట్టడానికి అధికార పార్టీ పెద్దలు రంగంలోకి దిగినట్టు సమాచారం. ఎక్కడైతే రెబల్స్ బెడద అధికంగా ఉంటుందో వారిని జిల్లా ఇన్‌చార్జి మంత్రులు బుజ్జగిస్తున్నారు. నామినేటెడ్ పోస్టుల్లో తగిన ప్రాధాన్యత కల్పిస్తామని వారికి భరోసా ఇస్తున్నట్టు తెలుస్తున్నది.
ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్నది. దీంతో అధికార, ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులు ఓటర్లను ప్రలోభపెడితే వారి నామినేషన్ సైతం రద్దు అయ్యే అవకాశం ఉన్నది. ప్రచారంలో భాగంగా అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై ఈసీ చర్యలకు ఆదేశించవచ్చును. అందుకే ప్రధాన పార్టీల స్టార్ క్యాంపెయినర్లు అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహించనున్నట్టు తెలుస్తున్నది. ప్రచారం మొదలు గెలుపు వరకు వారే అన్ని బాధ్యతలను నిర్వహించనున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో ఇప్పటికే అభ్యర్థులు వ్యూహాలు రచిస్తున్నట్టు సమాచారం. అభివృద్ధి మంత్రంతో పాటు గిఫ్టులు, డబ్బులు పంచేందుకు కొందరు సిద్ధమవుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఎన్నికలకు ఇంకా పది రోజులే సమయం ఉండటంతో వార్డులు, డివిజన్లలో ప్రధాన పార్టీ అభ్యర్థుల సందడి నెలకొన్నది.
ఈ ఎన్నికల్లో ప్రత్యర్థి పార్టీలకు చుక్కలు చూపించేందుకు అధికార పార్టీ కొత్తవ్యూహాలకు పదును పెడుతున్నది. ముందుగానే జిల్లా ఇన్ చార్జి మంత్రులు, డీసీసీ అధ్యక్షులను క్షేత్రస్థాయికి పంపించింది.వారు వార్డులు, డివిజన్ల వారీగా స్థానిక నేతల నుంచి నివేదికలు తెప్పించుకుంటున్నారు. స్థానికంగా ఏ నేత బలంగా ఉన్నారో వారి పేరును ఫైనల్ చేయించి.. అభివృద్ధికి కావాల్సిన నిధులను మంజూరు చేయిస్తామని మంత్రులు ఓటర్లకు చెబుతున్నట్టు తెలుస్తున్నది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓటు వేస్తే ప్రభుత్వం నుంచి నిధులు త్వరగా వస్తాయని.. రోడ్లు, డ్రెయినేజీలు, స్కూల్స్, నీటి వసతులు కల్పిస్తామని అభ్యర్థులు, స్టార్ క్యాంపెయినర్ల ద్వారా ప్రచారం చేయిస్తున్నట్టు సమాచారం.
Pawan Kalyan : ప్చ్.. పవన్ కళ్యాణ్ టైమ్ బాగోలేదు, వాళ్లకు ఛాన్స్ దొరికిందిగా!
దీనికి తోడు అధికార పార్టీ మరో అంశాన్ని సైతం తెరమీదకు తెస్తున్నది. ప్రతిపక్షాల అభ్యర్థులకు ఓటు వేస్తే వారు ఎలాగైనా అధికారం కోసం పార్టీలు మారే అవకాశం ఉంటుందని.. మరల స్థానిక ఎమ్మెల్యేలతో వారు సహకరించకపోతే మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు నిధులు సమయానికి విడుదల అవ్వగా.. ఇబ్బంది పడాల్సి వస్తుందని కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రచారం చేస్తున్నట్టు సమాచారం. దీంతో ఓటర్లు సైతం ఆలోచనలో పడినట్టు తెలుస్తున్నది.అధికారంలో లేని పార్టీకి ఓటు వేసినా నిధులు తీసుకురావడంలో ఇబ్బందులు తలెత్తుతాయని, అందుకే అధికార పార్టీ అభ్యర్థులకే ఓటు వేయాలని ఆలోచనలో ఓటర్లు ఉన్నట్టు రాష్ట్ర రాజకీయాల్లో చర్చ జరుగుతున్నది. ఈసారి ఎలాగైనా మెజార్టీ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లపై కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని సీఎం రేవంత్ ఆదేశాలను జిల్లా ఇన్ చార్జి మంత్రులు, డీసీసీ అధ్యక్షులు తూచ పాటిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.