Tollywood Boxoffice:వస్తామన్న పెద్ద సినిమాలు సైలెంట్ గా సైడ్ అవ్వడంతో చిన్న, మీడియం రేంజ్ సినిమాలు బాక్సాఫీస్ పై ఎటాక్ చేస్తున్నాయ్. అయితే వీటిలో దాదాపుగా అన్ని సినిమాలు వసూళ్లు కొల్లగొట్టలేక చతికిలపడ్డవే. ఒకరకంగా ఈ ఇయర్లో టాలీవుడ్ లో వచ్చిన సాలిడ్ హిట్స్ ఏవంటే సంక్రాంతికి వచ్చిన సినిమాలనే రివైండ్ చేయాల్సిన పరిస్థితి.ఇక ఈ నెలలో వచ్చిన బ్యాండ్ మేళం, రాకాసా, ‘బైకర్’, ‘డెకాయిట్’ ఇలా ఏ సినిమా చూసినా బాక్సాఫీస్ వద్ద బోలా కొడుతున్నవే. అయితే వీటిలో కొన్ని సినిమాలకి బాగుంది అన్న టాక్ వచ్చినా కాసులు కురవకపోవడం గమనార్హం.ఇక వాటి సంగతి అలా ఉంటే ఈ వారం వచ్చే సినిమాలు అయినా మేకర్స్ మొహంలో నవ్వులు నింపుతాయనుకుంటే వాటి పరిస్థితి మరీ దారుణం.
నాగ శౌర్య కెరీర్ లోనే ఇది భారీ డిజాస్టర్
ఈవారం బాక్సాఫీస్ బరిలో దిగిన సినిమాల్లో అంతో ఇంతో అంచనాలు ఉన్న సినిమా బ్యాడ్ బోయ్ కార్తీక్. ఊహలు గుసగుసలాడే, ఛలో వంటి సినిమాలతో ప్రామిసింగ్ హీరో అనిపించుకున్న శౌర్య నుండి ఫుల్ యాక్షన్ జానర్ లో సినిమా వస్తుందని అనగానే ఏదైనా కొత్తగా ట్రై చేశాడా అనుకున్నారంతా. కానీ అబ్బే అంత సీన్ లేదంటూ మొదటి ఆటకే టపా కట్టేసింది ఈ సినిమా.చూస్తుంటే నాగ శౌర్య కెరీర్ లోనే ఇది భారీ డిజాస్టర్ అయినా ఆశ్చర్యం లేదు. కథలో పస లేదు, కథనంలో దమ్ము లేదు. “ఏం తీస్తున్నారో మాకైనా అర్థమవుతుందా?” సోషల్ మీడియాలో ఎకి పారేస్తున్నారు నెటిజన్లు.
ఆడియన్స్ ని లాక్కురాలేకపోతున్న తిమ్మరాజుపల్లి టీవీ.
ఇక హీరోగా సక్సెస్ ట్రాక్ లో నడుస్తున్న కిరణ్ అబ్బవరం కాస్త ట్రాక్ మార్చి ప్రొడ్యూస్ చేసిన సినిమా తిమ్మరాజుపల్లి టీవీ. నిర్మాతగా తనవంతు ప్రయత్నం చేసినా, సినిమా కంటెంట్ పరంగా అత్తెసరు మార్కులనే మూట గట్టుకుంది. ప్రమోషన్స్ పరంగా మేకర్స్ ఎదో ట్రై చేసినా అవి థియేటర్ల వద్దకు ఆడియన్స్ ని మాత్రం లాక్కు రాలేకపోయాయి.మంచి వసూల్లు చూస్తామనుకుంటే కనీసం ఓపెనింగ్స్ కూడా రాబట్టుకోలేక చతికిల పడిపోయింది ఈ సినిమా. లోపం ఎక్కడ జరిగిందో అబ్బవరం వారే పోస్ట్ మార్టం చేసుకోవాలి.
పాపం ప్రతాప్.. పత్తాలేని పల్లి చట్టంబి!
ఇక మంచి నటుడిగా పేరు తెచ్చుకున్న తిరువీర్ ఈ సారి పాపం ప్రతాప్ అంటూ ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఈటీవీ విన్ బ్యానర్ పై వచ్చిన ఈ ‘పాపం ప్రతాప్’ మాత్రం నిజంగానే ప్రేక్షకులను “పాపం” అనేలా చేసిందంటే సినిమా ఏ మాత్రం కనెక్ట్ అయ్యిందో అర్థం అవుతుంది.దర్శకుడు దుర్గా నరేష్ తీసుకున్న పాయింట్ పేపర్ మీద బాగున్నా, స్క్రీన్‌పైకి వచ్చేసరికి పూర్తిగా తేలిపోయిందనే చెప్పాలి. లాజిక్ లేని సీన్లు, బోరుకొట్టించే కామెడీతో ప్రేక్షకుల ఓపికని పరీక్షించారు.మొన్నామధ్య ఈటీవీ విన్ బ్యానర్ పై వచ్చిన సుప్పిని సుద్దపూసని కూడా ఇలాగే బోల్తా కొట్టింది. ఈ సారైనా వీళ్ళు సరైన కంటెంట్ పట్టుకుంటారో లేదో చూడాలి.ఇక ఇక డబ్బింగ్ సినిమా ‘పల్లి చట్టంబి’ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అసలు ఈ సినిమా రిలీజ్ అయిందన్న సంగతి కూడా చాలా మందికి తెలియదంటే ప్రమోషన్స్ ఎంత వీక్ గా ఉన్నాయో అర్థమవుతుంది.OTT మూవీస్ తో దగ్గరైన టోవినో థామస్ సిల్వర్ స్క్రీన్ తో మాత్రం దగ్గరకాలేకపోయాడు.
ఒకవైపు మండిపోతున్న ఎండలు, మరోవైపు ఐపీఎల్ ఫీవర్
అయితే ప్రస్తుతం టాలీవుడ్ బాక్సాఫీస్ ఇంత డ్రైగా ఉండడానికి కారణం ఒకవైపు మండిపోతున్న ఎండలు, మరోవైపు ఐపీఎల్ ఫీవర్ తో సాయంత్రం జనం టీవీలకు, మొబైళ్లకు అతుక్కుపోతున్నారు అంటూ విశ్లేషించే పనిలో పడ్డారు ట్రేడ్ పండితులు.అయితే వీటన్నింటినీ మించి థియేటర్ కి రప్పించేంత క్రేజీ కంటెంట్ ఏ సినిమాలోనూ లేడన్నది వాస్తవం. ఏది ఏమైనా ప్రస్తుతం సినిమా హళ్ళ వద్ద ఈగలు తోలుకుంటున్నారన్నది నిజం.మరి ఇది ఇలాగే వచ్చే వారాల్లో కంటిన్యూ అవుతుందా లేక ఏదైనా సినిమా సాలిడ్ సర్ప్రైజ్ ఇస్తుందా చూడాలి.