Vanda Devullu : విజయ్ ఆంటోని..కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ తనదైన నటన, డిఫరెంట్ స్టోరీస్ తో గుర్తింపు తెచ్చుకున్న మల్టీ టాలెంటెడ్ స్టార్ . ముఖ్యంగా 2016లో వచ్చిన ‘బిచ్చగాడు’ (పిచ్చైకారన్) సినిమా సౌత్ ఇండియాలోనే ఎంత పెద్ద సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. మదర్ సెంటిమెంట్‌తో కమర్షియల్ ఎలిమెంట్స్‌ను జోడించి దర్శకుడు శశి తెరకెక్కించిన ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఆ తర్వాత విజయ్ ఆంటోని నటించిన ‘బిచ్చగాడు 2’ కూడా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇప్పుడు మళ్లీ ఇన్నాళ్లకి ‘బిచ్చగాడు’ వంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన క్రేజీ కాంబినేషన్ రిపీట్ అవుతుంది.అదే దర్శకుడు శశి, విజయ్ ఆంటోని కలయికలో వస్తున్న సరికొత్త ఎమోషనల్ అండ్ సోషల్ డ్రామా ‘వంద దేవుళ్లు’.
తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు మేకర్స్. ఈ ట్రైలర్ ప్రేక్షకులలో అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది. ఈ లోకంలో ప్రాణాలతో పుట్టిన అందరికీ కనీస అవసరాలుంటాయి.. తినడం, నిద్రపోవడం, తోడు వెతుక్కోవడం అనే ఒక ఇంటెన్సిటీ డైలాగ్‌తో ట్రైలర్ మొదలవడం చూస్తె సినిమా ఎలా ఉండబోతుందో అర్థం అవుతుంది. విజయ్ ఆంటోని గత చిత్రాలైన ‘నకిలీ’, ‘డాక్టర్ సలీమ్’, ‘ఇంద్రసేన’, ‘కొలై’ తరహాలోనే ఈ సినిమా కూడా సమాజంలో జరిగే కొన్ని సున్నితమైన అంశాల చుట్టూ తిరగనుందని అర్థమవుతోంది.
కేవలం యాక్షన్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ మాత్రమే కాకుండా.. హీరో హీరోయిన్ల మధ్య సాగే క్యూట్ లవ్ స్టోరీ, భార్యాభర్తల అనుబంధం, అమ్మ-కొడుకుల సెంటిమెంట్ వంటి అన్ని రకాల ఎమోషన్స్ ఈ చిత్రంలో ఉండబోతున్నాయి. ఫ్యామిలీ ఆడియన్స్‌కు కనెక్ట్ అయ్యే ప్రతీ ఎలిమెంట్‌ను దర్శకుడు శశి ఇందులో అద్భుతంగా జోడించినట్లు ట్రైలర్ చూస్తే స్పష్టమవుతోంది.
ఈ చిత్రంలో విజయ్ ఆంటోని సరికొత్త లుక్‌లో కనిపిస్తుండగా, కథ ప్రధానంగా రైతుల సమస్యలు, గ్రామీణ నేపథ్యం చుట్టూ తిరగనుందని తెలుస్తోంది. గతంలో తమిళంలో వ్యవసాయం, సామాజిక ఇబ్బందులపై వచ్చిన చిత్రాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు, ఇప్పుడు ‘వంద దేవుళ్లు’ కూడా అదే బాటలో సాగుతూ సరికొత్త సందేశాన్ని ఇవ్వబోతోంది. ఈ సినిమాలో స్వాసిక, అజయ్, కావ్య, శక్తి, పదిని, కర్నాస్, బాలాజీ శక్తివేల్, దివాకర్, అరుళ్ దాస్, బక్స్, వినోదిని, మునిష్ కాంత్, కొడంగి వడివేలు వంటి భారీ తారాగణం కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పొరేషన్, ఫాతిమా విజయ్ ఆంటోని సమర్పణలో సర్వంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్‌పై రామంజనేయులు జవ్వాజి ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఎమోషనల్ కంటెంట్‌తో పాటు కమర్షియల్ వాల్యూస్ ఉన్న సినిమాలను ఆదరించడంలో తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ముందుంటారు.
ఆ నమ్మకంతోనే మేకర్స్ ఈ చిత్రాన్ని భారీ ఎత్తున విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతోంది. ‘బిచ్చగాడు’ కాంబినేషన్ మ్యాజిక్ బాక్సాఫీస్ వద్ద మరోసారి రిపీట్ కావడం ఖాయమని,ఈ సమ్మర్ ఎండింగ్ కి ఇది సాలిడ్ సక్సెస్ ఇస్తుందని ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు మేకర్స్.చూడాలి జూన్ 19న విజయ్ ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో !
also read :‘పెద్ది’ తర్వాత మెగా పవర్ స్టార్‌కు సర్జరీ.. సుకుమార్ సినిమా ఇప్పట్లో లేనట్టేనా?