Vijay vs Sangeetha Net Worth: తమిళ సినీ పరిశ్రమలో దళపతిగా పేరు తెచ్చుకున్న విజయ్ ప్రస్తుతం వ్యక్తిగత జీవితంలో కఠినమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. దాదాపు 27 ఏళ్ల వైవాహిక జీవితానికి అనంతరం, ఆయన భార్య సంగీత స్వర్ణలింగం విడాకులు కోరడం సినీ వర్గాల్లోనే కాదు.. రాజకీయ వర్గాల్లో కూడా పెద్ద వివాదంగా.. మారింది. విజయ్ తాజాగా ప్రారంభించిన రాజకీయ పార్టీ భవిష్యత్తుపైనా ఈ పరిణామం ప్రభావం చూపుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
సంగీత సాధారణ నేపథ్యం నుంచి వచ్చిన వ్యక్తి కాదు. ఆమె శ్రీలంకకు చెందిన సంపన్నమైన తమిళ కుటుంబంలో జన్మించారు. ఆమె తండ్రి లండన్‌లో భారీ స్థాయిలో ఎగుమతి–దిగుమతి వ్యాపారాలు నిర్వహిస్తూ పెద్ద వ్యాపారవేత్తగా గుర్తింపు పొందారు. విజయ్ సినిమాలకు పెద్ద అభిమాని అయిన సంగీత, 1996లో కేవలం ఆయన్ని కలవాలనే ఉద్దేశంతో లండన్ నుంచి చెన్నైకి వచ్చారు. ఆ పరిచయం క్రమంగా ప్రేమగా మారి, 1999లో ఇద్దరూ వివాహం చేసుకున్నారు.
వివాహం సమయంలో విజయ్ ఒక ఎదుగుతున్న నటుడే. కానీ సంగీత అప్పటికే కోట్ల రూపాయల ఆస్తులు కలిగిన ధనవంతురాలు. కాలక్రమంలో విజయ్ స్టార్ హీరోగా ఎదిగి..ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ.200 కోట్ల నుంచి రూ.275 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నారని సమాచారం. ఆయన మొత్తం ఆస్తుల విలువ సుమారు రూ.600 కోట్ల వరకు ఉంటుందని అంచనా. మరోవైపు సంగీత కూడా తన కుటుంబ వ్యాపారాలు, స్వంత పెట్టుబడుల ద్వారా సుమారు రూ.400 కోట్లకు పైగా ఆస్తులు కలిగి ఉన్నారని చెబుతున్నారు. ఆర్థికంగా ఆమె ఎప్పుడూ విజయ్‌పై ఆధారపడలేదని సన్నిహితులు అంటున్నారు.
ఇంతటి సంపద, స్థిరమైన జీవితం ఉన్నప్పటికీ వారి మధ్య విభేదాలు తలెత్తడం అభిమానులను బాధకు గురిచేస్తోంది. సంగీత తన విడాకుల పిటిషన్‌లో విజయ్‌పై కొన్ని తీవ్రమైన ఆరోపణలు చేసినట్టు సమాచారం. గత కొన్నేళ్లుగా తనకు మానసిక వేదన కలిగిందని, ఇద్దరూ విడివిడిగా జీవిస్తున్నామని ఆమె పేర్కొన్నారని తెలుస్తోంది. ఈ కేసు త్వరలో కోర్టులో విచారణకు రానుంది.
ఈ వివాదం 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలను లక్ష్యంగా పెట్టుకున్న విజయ్ రాజకీయ ప్రయాణానికి పెద్ద సవాలుగా మారిందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఒకప్పుడు ఆదర్శ దంపతులుగా పేరొందిన ఈ జంట ఇలా కోర్టు మెట్లు ఎక్కడం సినీ అభిమానులకు తీవ్ర ఆవేదనను కలిగిస్తోంది. ప్రస్తుతం ఈ విషయం తమిళనాడు అంతటా విస్తృతంగా చర్చకు దారి తీస్తోంది.