Vishal Vijay: తమిళనాడు రాజకీయాల్లోనూ, అటు సినీ రంగంలోనూ ప్రస్తుతం ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయం సాధించి, ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ప్రముఖ నటుడు జోసెఫ్ విజయ్ (దళపతి విజయ్) తన మంత్రివర్గానికి శాఖలను కేటాయించారు. అయితే, చిత్ర పరిశ్రమకు అత్యంత కీలకమైన ‘ఫిల్మ్ టెక్నాలజీ అండ్ సినిమాటోగ్రాఫ్ యాక్ట్’ (సినీ సాంకేతికత, సినిమాటోగ్రాఫ్ చట్టం) శాఖను మంత్రి రాజ్‌మోహన్‌కు కేటాయించడంపై ప్రముఖ నటుడు, నిర్మాత విశాల్ స్పందించారు. ఈ విషయంపై ఆయన ముఖ్యమంత్రి విజయ్‌కు సుదీర్ఘమైన విజ్ఞప్తిని చేస్తూ తన సోషల్ మీడియా (X/ట్విట్టర్) వేదికగా ఒక పోస్ట్‌ను పంచుకున్నారు.
Read also-కాపీ వివాదంలో ఊర్వశి రౌతేలా.. ‘జిగి హడిద్ చీర ఫస్ట్ కాపీ’ అంటూ నెటిజన్ల ట్రోలింగ్!
విశాల్ తన పోస్ట్‌లో… కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు మంత్రిత్వ శాఖలను కేటాయించినందుకు సీఎం విజయ్‌కు అభినందనలు తెలుపుతూనే, సినీ రంగానికి సంబంధించిన శాఖను రాజ్‌మోహన్‌కు ఇవ్వడం పట్ల కొంత అసంతృప్తిని, ఆందోళనను వ్యక్తం చేశారు. ప్రస్తుతం చిత్ర పరిశ్రమ తీవ్రమైన నష్టాల్లో కూరుకుపోయిందని, ఎన్నో సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి విజయ్ స్వయంగా గత 30 ఏళ్లుగా ఈ పరిశ్రమలో ఉంటూ, క్షేత్రస్థాయి నుంచి అన్ని విషయాలనూ పరిశీలించిన వ్యక్తి అని విశాల్ గుర్తుచేశారు. పరిశ్రమ కష్టసుఖాలు తెలిసిన సీఎం ఉండగా… సినిమా రంగానికి సంబంధించిన లోతైన అవగాహన లేదా అనుభవం లేని వ్యక్తికి ఈ శాఖను కేటాయిస్తే, నిర్మాతలు, నిర్మాణ సంస్థలు తమ సమస్యలను, వినతులను ఎవరికి చెప్పుకోవాలని ఆయన ప్రశ్నించారు. మంత్రి రాజ్‌మోహన్‌ను తక్కువ చేయడం తన ఉద్దేశం కాదని, కేవలం పరిశ్రమ బాగు కోసమే తన అభిప్రాయాన్ని చెబుతున్నానని విశాల్ స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా చిత్ర పరిశ్రమను, నిర్మాతలను ఆదుకోవడానికి ముఖ్యమంత్రి విజయ్ వెంటనే మూడు కీలకమైన చర్యలు తీసుకోవాలని విశాల్ డిమాండ్ చేశారు:
ప్రభుత్వ టికెటింగ్ విండో: ప్రభుత్వం ఆధ్వర్యంలోనే అధికారిక ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ విధానాన్ని తీసుకురావాలి. దీనివల్ల ప్రభుత్వానికి ఆదాయం రావడమే కాకుండా, ప్రస్తుతం టికెట్‌కు అదనంగా ₹30 వరకు సర్వీస్ ఛార్జీలు చెల్లిస్తూ నష్టపోతున్న ప్రేక్షకులకు పెద్ద ఉపశమనం లభిస్తుంది.
స్థానిక సంస్థల పన్ను రద్దు: దేశవ్యాప్తంగా ‘ఒకే దేశం – ఒకే పన్ను’ (GST) విధానం అమల్లో ఉన్నప్పటికీ, మన రాష్ట్రంలోనే సినిమా టికెట్లపై అదనంగా స్థానిక సంస్థల పన్ను (LBT) విధిస్తున్నారు. ఈ రెండు పద్ధతుల పన్నుల విధానాన్ని వెంటనే రద్దు చేయాలి.
చిన్న సినిమాలకు సబ్సిడీ పెంపు: ప్రస్తుతం చిన్న సినిమాలకు ఇస్తున్న సబ్సిడీ మొత్తం చాలా తక్కువగా ఉంది. కాబట్టి ప్రతి ఏటా చిన్న చిత్రాలకు ఇచ్చే సబ్సిడీ మొత్తాన్ని భారీగా పెంచి, వారిని ప్రోత్సహించాలి.
Read also-శాటిలైట్ సిగ్నల్స్‌తో సర్వే.. అంగుళం పొరపాటు లేకుండా భూముల లెక్కింపు!
గత 9 ఏళ్లుగా ఈ డిమాండ్లను ప్రభుత్వాలకు వినతులుగా ఇస్తూనే ఉన్నామని, కానీ ఎలాంటి మార్పు రాలేదని విశాల్ ఆవేదన వ్యక్తం చేశారు. పరిశ్రమ నుంచి వచ్చిన వ్యక్తిగా సీఎం విజయ్ మాత్రమే తమకు తగిన న్యాయం చేయగలరని, ఈ విషయాలను పరిశీలించి తగిన నిర్ణయం తీసుకోవాలని విశాల్ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో మరియు అటు కోలీవుడ్, ఇటు పొలిటికల్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీనిపై కొత్త ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.
Happy to see #CMJosephVijay allocating ministries to respective elected MLAs but it's disheartening to see honorable minister #Rajmohan to be in charge as minister of Film Technology and Cinematograph Act. How would I or we as a body or as an association render our requests or…
— Vishal (@VishalKOfficial) May 17, 2026