Shocking Incident: ఏ క్షణాన ఏం జరుగుతుందో ఎవరికీ తెలీదు. ఇప్పుడు చూసిన వ్యక్తులు కాసేపట్లో ఈ లోకాన్ని విడిచి పెడుతున్న సందర్భాలు ఈ మధ్యకాలంలో చాలా కనిపిస్తున్నాయి. సరిగ్గా అలాంటి ఘటన ఒకటి మధ్యప్రదేశ్‌లో వెలుగు చూసింది. బాల్కనీలో నుంచి గుట్కా ఉమ్మతూ ప్రాణాలు కోల్పోయాడు ఓ వ్యక్తి. అసలు బాల్కనీలో ఏం జరిగింది?
మధ్యప్రదేశ్‌లోని విదిశా జిల్లా గురించి చాలామందికి తెలుసు. గంజ్ బసోడా ప్రాంతంలో శుక్రవారం మధ్యాహ్నం ఊహించని ఘటన జరిగింది. అపార్టుమెంటులోని మూడో అంతస్తులోవున్న బాల్కనీ నుండి గుట్కా ఉమ్మి కింద వేశాడు ఓ పెద్దాయన. ఆ గుట్టా ఉమ్మి కాస్త 11 కెవీ హై-టెన్షన్ విద్యుత్ తీగను తాకింది. ఫలితంగా మంటలు వచ్చిన అందులో ఆయన కాలిపోయి ప్రాణాలు పొగొట్టుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి వయస్సు 65 ఏళ్లు.
శుక్రవారం మధ్యాహ్నం సుమారు ఒంటి గంట సమయంలో తన అద్దె ఇంటి బాల్కనీలో 65 ఏళ్ల ప్రభులాల్ గుప్తా నిలబడి ఉన్నాడు. అతడు గుట్కా నములుతూ కింద వేసిన ఉమ్మి కిందనున్న విద్యుత్ తీగలకు తగిలింది. వెంటనే భారీగా మంటలు వచ్చి అతడు తీవ్రంగా కాలిపోయాడు. మృతుడు సొంతూరు ఛతర్‌పూర్‌కు చెందినవాడు. వృత్తి రీత్యా తాపీ మేస్త్రి అయిన గుప్తా, పదేళ్లుగా ఆ అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నాడు. సకాలంలో ఆసుపత్రికి తీసుకెళ్లినప్పటికీ పెద్దాయన మృతి చెందాడు.
ఈ సంఘటన నివాసితుల్లో ఆగ్రహాన్ని రేకెత్తించింది. ఇళ్లకు దగ్గరగా వెళ్తున్న హై-టెన్షన్ విద్యుత్ వైర్లు తొలగించాలని పదే పదే చేసిన ఫిర్యాదులను విద్యుత్ శాఖ అధికారులు పట్టించుకోలేదని ఆరోపించారు. ఆ ప్రాంతంలో విద్యుత్ స్తంభాల తీగలు, ట్రాన్స్‌ఫార్మర్లు అధ్వాన స్థితిలో ఉన్నాయని అతడి కుటుంబ సభ్యుల సభ్యుల్లో ఒకరు చెప్పారు. ఇళ్లకు సమీపంలో 11 kV విద్యుత్ లైన్‌పై పదే పదే ప్రజలు ఫిర్యాదు చేసినప్పటికీ ఏ మాత్రం పట్టించుకోలేదని చెబుతున్నారు.
ALSO READ: ఘోరమైన యాక్సిడెంట్.. లోయలోపడిన బస్సులో 30 మంది, వీడియోలో కాపాడాలంటూ ఆర్తనాదాలు
ఈ ఘటనపై విద్యుత్ శాఖ నిపుణులు నోరు విప్పారు. లాలాజలంలో తేమ, కరిగిన లవణాలు ఉంటాయని, వాటిని విద్యుత్ వాహకంగా మారుస్తాయని అంటున్నారు. ఒకవేళ ఉమ్ము నిరంతరాయంగా ప్రవహిస్తూ విద్యుత్ ప్రవహిస్తున్న వాహకాన్ని చేరితే అదొక మార్గాన్ని ఏర్పరచగలదని అంటున్నారు. తగిన పరిస్థితులలో 11 kV లైన్ విద్యుత్ ఆర్క్‌ను ఉత్పత్తి చేయగలదని అంటున్నారు. బాల్కనీకి ఆ తరహా ట్రాన్స్‌ఫార్మర్ దగ్గరగా ఉంటే విద్యుత్ గాలిలో ప్రయాణించే అవకాశం ఉందని అంటున్నారు. శరీరం గుండా విద్యుత్ మార్గం ఏర్పడితే దాని ఫలితంగా వచ్చే షాక్ మనిషి కాలిపోయి మరణానికి దారి తీయవచ్చని చెబుతున్నారు.