Househusband cruelty judgment| పెళ్లి తర్వాత భార్యాభర్తలు ఎక్కడ నివసించాలనే విషయంలో భిన్నాభిప్రాయాలు రావడం సహజం. అయితే, భర్త తన వృద్ధావస్థలో ఉన్న తల్లిదండ్రులను వదిలి రావాలని, తన తల్లిదండ్రుల ఇంట్లో ‘ఇంటల్లుడు’గా ఉండాలని భార్య కోరితే అది విడాకులకు కారణమయ్యే క్రూరత్వమేనా? ఈ ప్రశ్నపై జార్ఖండ్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
ఈ దంపతులకు 2008 నవంబర్‌లో బిహార్‌లోని పాట్నాలో హిందూ సంప్రదాయాల ప్రకారం వివాహం జరిగింది. 2011 జూలైలో వారికి ఒక కుమార్తె జన్మించింది. మొదట్లో తమ వైవాహిక జీవితం సంతోషంగా సాగిందని భర్త తెలిపాడు.
అయితే, కొంతకాలం తర్వాత భార్య తరచుగా పాట్నాకు వెళ్లడం ప్రారంభించిందని అతను ఆరోపించాడు. తన తల్లిదండ్రులను వదిలి, భార్య తల్లిదండ్రులతో కలిసి ఉండాలని ఆమె కోరినట్లు చెప్పాడు. తన తల్లిదండ్రులు వృద్ధులు, అనారోగ్యంతో బాధపడుతున్నందున ఆ ప్రతిపాదనను అంగీకరించలేదని వివరించాడు.
2013లో భార్య అత్తింటిని విడిచివెళ్లి తిరిగి రాలేదని భర్త పేర్కొన్నాడు. దీంతో అతను భార్య తనను మానసికంగా వేధిస్తోందంటూ కారణం చెప్పి విడాకులు కావాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. 2022లో ఫ్యామిలీ కోర్టు అతని పిటిషన్‌ను తిరస్కరించింది. అనంతరం అతను హైకోర్టును ఆశ్రయించాడు.
Also Read: పిల్లలకు పుట్టినరోజు బహుమతులు ఇవ్వడమే కాదు.. జీవితాంతం గుర్తుండిపోయేలా ఈ 7 అలవాట్లు నేర్పండి
భార్య తనను మానసికంగా వేధించిందని, వైవాహిక జీవితాన్ని తిరిగి ప్రారంభించేందుకు అంగీకరించలేదని భర్త వాదించాడు. ఇంటల్లుడుగా ఉండమని కోరడం క్రూరత్వం అని చెప్పాడు. మరోవైపు, భర్త, మామ తనను వేధించారని భార్య ఆరోపించింది. కుమార్తె పుట్టిన తర్వాత శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా ఇబ్బందులు పెట్టారని తెలిపింది. భర్త రెండో పెళ్లికి ప్రయత్నిస్తున్నాడని కూడా ఆరోపించింది.
Also Read: పెళ్లిలో లభించిన బహుమతులుపై ట్యాక్స్ కట్టాలా? ఆదాయపు పన్ను నిబంధనలు ఇవే..
ఇద్దరు న్యాయమూర్తల హై కోర్టు ధర్మాసనం ఈ కేసును పరిశీలించింది. సాధారణ దాంపత్య విభేదాలు, అభిప్రాయ భేదాలు మాత్రమే చట్టపరమైన క్రూరత్వంగా పరిగణించలేమని పేర్కొంది. వైవాహిక జీవితం కొనసాగించడం అసాధ్యంగా మారేంత తీవ్రమైన ప్రవర్తన ఉన్నప్పుడే క్రూరత్వం నిరూపితమవుతుందని వివరించింది.
భార్య తన భర్తను ఇంటల్లుడుగా ఉండమని కోరినప్పటికీ, బలవంతం చేసినట్లు ఆధారాలు లేవని కోర్టు గుర్తించింది. అందువల్ల ఆ ఒక్క కారణంతో క్రూరత్వం నిరూపితం కాదని స్పష్టం చేసింది. కుటుంబ న్యాయస్థానం ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ భర్త అప్పీల్‌ను కొట్టివేసింది.
చట్టపరమైన అర్హతలు ఉంటే పరస్పర అంగీకారంతో విడాకులు కోరవచ్చు. హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 13B ఇందుకు సంబంధించిన నిబంధనలను వివరిస్తుంది. అలాగే, నిరంతరంగా కనీసం రెండేళ్లపాటు విడిచిపెట్టిన పరిస్థితుల్లో సెక్షన్ 13(1)(ib) కింద విడాకులు కోరే అవకాశం ఉంటుంది. అయితే, ప్రతి కేసులోనూ పరిస్థితులు, ఆధారాలు, చట్టపరమైన అర్హతలను కోర్టు విడిగా పరిశీలిస్తుంది. ఈ కేసులో భార్య చాలా కాలంగా భర్తకు దూరంగా ఉండడం కారణంగా భర్త విడాకులకు పిటీషన్ వేయవచ్చు.
గమనిక: ఈ తీర్పు ఒక నిర్దిష్ట కేసులోని వాస్తవాలు, ఆధారాల ఆధారంగా వెలువడింది. ఇలాంటి ప్రతి వివాదానికీ ఇదే ఫలితం వస్తుందని భావించకూడదు.