LK Advani: బీజేపీ సీనియర్ నేత, దేశ మాజీ ఉప ప్రధాని ఎల్.కే అద్వానీ ఛాతి సంబంధిత ఇన్ఫెక్షన్తో ఢిల్లీలోని ఇంద్రప్రస్థ అపోలో ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. శుక్రవారం రాత్రి 7:30 గంటల ప్రాంతంలో 98 ఏళ్ల అద్వానీని ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన పల్మనాలజీ విభాగంలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. వైద్యులు ఆయనకు అవసరమైన పరీక్షలు నిర్వహిస్తూ చికిత్స అందిస్తున్నారు.
వయసురీత్యా వస్తున్న అనారోగ్య సమస్యలతో అద్వానీ ఆసుపత్రిలో చేరడం ఇది మొదటిసారి కాదు. గత మే నెలలో కూడా ఆయన అపోలో ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకున్నారు. కొన్ని రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉన్న తర్వాత ఆయన డిశ్చార్జ్ అయ్యారు. అంతకుముందు 2024 డిసెంబర్లో కూడా ఆయన అనారోగ్యంతో ఆసుపత్రిలోని ఐసీయూలో చేరాల్సి వచ్చింది. ఆ సమయంలో ప్రముఖ నూరాలజిస్ట్ పర్యవేక్షణలో ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత ఆయన క్రమంగా కోలుకున్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.
1927 నవంబర్ 8న కరాచీలో (ప్రస్తుత పాకిస్తాన్) జన్మించిన ఎల్.కే. అద్వానీ భారతీయ జనతా పార్టీ చరిత్రలో అత్యంత కీలకమైన నాయకులలో ఒకరు. ఒక చిన్న రాజకీయ పార్గీగా ఉన్న బీజేపీని దేశంలో ప్రధాన రాజకీయ శక్తిగా తీర్చిదిద్దడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా వివిధ సందర్భాలలో పనిచేసిన ఆయన.. దేశవ్యాప్తంగా పార్టీ సంస్థాగత బలాన్ని పెంచడంలో విశేషంగా కృషి చేశారు. 1990లో ఆయన చేపట్టిన ‘రామ్ రథయాత్ర’ భారత రాజకీయాలను కీలక మలుపు తిప్పింది. ఈ యాత్ర ద్వారానే బీజేపీ ప్రజల్లోకి మరింతగా చేరుకోగలిగింది.
Also Read: భారత్కు బిగ్ రిలీఫ్.. 100% టారిఫ్ల చట్టాన్ని నిలిపివేసిన డొనాల్డ్ ట్రంప్!
అటల్ బిహారీ వాజ్పేయి నేతృత్వంలోని ప్రభుత్వంలో 2002 నుండి 2004 వరకు అద్వానీ దేశ ఉప ప్రధానిగా సేవలందించారు. అంతేకాకుండా ఆయన కేంద్ర హోంమంత్రిత్వ శాఖతో పాటు పలు కీలక శాఖల బాధ్యతలను కూడా సమర్థవంతంగా నిర్వహించారు. దేశ ప్రజలకు ఆయన అందించిన సేవలను గుర్తించి.. కేంద్ర ప్రభుత్వం 2024లో దేశ అత్యున్నత పౌర పురస్కారమైన ‘భారత రత్న’తో ఆయన్ను సత్కరించింది. అంతకుముందు 2015లో ఆయనకు ‘పద్మ విభూషణ్’ పురస్కారం కూడా లభించింది. ప్రస్తుతం ఆయన బీజేపీలో అత్యంత గౌరవనీయులైన సీనియర్ నేతగా కొనసాగుతున్నారు.
Also Read: అనిరుధ్ – కావ్యా మారన్ పెళ్లి రిసెప్షన్.. సీఎం రేవంత్, కేటీఆర్కు ఆహ్వానం!