Fake Kidnapping: ఆన్‌లైన్ గేమింగ్ వ్యసనం, విలాసవంతమైన జీవితానికి అలవాటుపడిన ఓ యువకుడు చేసిన తప్పుడు నిర్ణయం అతడిని కటకటాల వెనక్కి నెట్టింది. అప్పుల ఊబి నుంచి బయటపడటంతో పాటు గర్ల్‌ఫ్రెండ్‌తో విహారయాత్రకు వెళ్లేందుకు ఏకంగా తననే ఎవరో కిడ్నాప్ చేసినట్లు సొంత తండ్రిని నమ్మించి పోలీసులకు ముచ్చెమటలు పట్టించాడు.
ఆన్‌లైన్ గేమింగ్ వ్యసనం.. భారీగా అప్పులు
దిల్లీకి చెందిన 17 ఏళ్ల మైనర్ విద్యార్థి లఖ్‌నవూలోని అలంబాగ్‌లో ఉంటూ నీట్ పరీక్షలకు సిద్ధమవుతున్నాడు. ఈ క్రమంలో ఆన్‌లైన్ గేమింగ్‌కు బానిసైన అతడు, ఆ వ్యసనం కారణంగా రూ.50 వేల వరకు అప్పులపాలయ్యాడు. ఆ అప్పులు తీర్చడంతో పాటు తన ప్రియురాలితో కలిసి సరదాగా ట్రిప్ వెళ్లాలని ప్లాన్ చేశాడు. దీనికోసం ఏకంగా తన తండ్రినే బెదిరించి డబ్బులు వసూలు చేయాలని పథకం పన్నాడు.
కిడ్నాప్ డ్రామాకు తెర
అక్టోబర్ 20 నుంచి ఆ యువకుడి ఫోన్ పనిచేయకపోవడంతో కుటుంబసభ్యులు ఆందోళన చెందారు. అదే సమయంలో అతడి తల్లిదండ్రులు, సోదరుడికి వాట్సప్ ద్వారా బెదిరింపు సందేశాలు వచ్చాయి. తమ కొడుకు కిడ్నాప్ అయ్యాడని, రూ.5 లక్షలు ఇవ్వాలని, డబ్బులు ఇవ్వకపోతే చంపేస్తామని దుండగులు అందులో హెచ్చరించారు. దీంతో భయపడిన కుటుంబసభ్యులు వెంటనే పోలీసులను ఆశ్రయించారు.
టెక్నాలజీతో బయటపడిన నిజం
ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో సదరు విద్యార్థి తన అత్త కూతురికి ఆన్‌లైన్ ద్వారా మెసేజ్ చేసి డబ్బు పంపాలని కోరగా.. ఆమె క్యూఆర్ కోడ్‌కు రూ.2,000 బదిలీ చేసింది. ఈ డిజిటల్ లావాదేవీ ఆధారాలను ట్రేస్ చేసిన పోలీసులు లొకేషన్‌ను కనుగొన్నారు.
ప్రియురాలితో కలిసి ఎంజాయ్ చేస్తున్న విద్యార్థి
చివరకు ప్రియురాలితో కలిసి ఎంజాయ్ చేస్తున్న విద్యార్థిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో అసలు విషయం బయటపడింది. కిడ్నాప్ డ్రామా అంతా తనే ఆడినట్లు యువకుడు అంగీకరించడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. కేవలం సరదాల కోసం కన్నవార్లను భయభ్రాంతులకు గురిచేసిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
Also Read: ప్రకాశం జిల్లాలో దారుణం.. ఆరేళ్ల బాలికపై అత్యాచారం చేసి..