పంజాబ్ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. మే 1 కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక అసెంబ్లీ సమావేశం రసాభాసగా మారింది. ముఖ్యమంత్రి భగవంత్ మాన్ మద్యం సేవించి సభకు వచ్చారంటూ ప్రతిపక్ష కాంగ్రెస్ సభ్యులు చేసిన ఆరోపణలు సభలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. ఒక పక్క పవిత్రమైన కార్మిక దినోత్సవం జరుపుకుంటుంటే.. మరోపక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఇలా బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం సిగ్గుచేటని విపక్షాలు మండిపడ్డాయి.
సమావేశం ప్రారంభం కాగానే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఒక్కసారిగా ముఖ్యమంత్రి వైఖరిని తప్పుబట్టారు. భగవంత్ మాన్ మద్యం మత్తులో ఉన్నారని.. ఆయనకు వెంటనే డోప్ పరీక్షతో పాటు బ్రీత్ అనలైజర్ పరీక్ష నిర్వహించాలని డిమాండ్ చేశారు. సభలో ఉన్న ఎమ్మెల్యేలందరికీ పరీక్షలు నిర్వహించడం ద్వారా వాస్తవాలు బయటకు వస్తాయని వారు పట్టుబట్టారు. ముఖ్యమంత్రి బహిరంగంగా ప్రజల సమక్షంలోనే ఈ పరీక్షలు చేయించుకుని తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని ప్రతిపక్ష నేతలు నినదించారు. ఈ ఆరోపణలతో సభలో గందరగోళం నెలకొంది.
ప్రతిపక్షాల డిమాండ్‌ను స్పీకర్ కుల్తార్ సింగ్ సంధ్వన్ నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. ముఖ్యమంత్రితో పాటు ఎమ్మెల్యేలకు డోప్ పరీక్షలు నిర్వహించాలన్న ప్రతిపాదనను ఆయన తోసిపుచ్చారు. సభా మర్యాదలను అతిక్రమించవద్దని సభ్యులను కోరారు. స్పీకర్ నిర్ణయంతో అసంతృప్తి చెందిన విపక్ష సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లి నిరసన తెలిపారు. పంజాబ్ సంస్కృతిని.. అసెంబ్లీ గౌరవాన్ని సీఎం మంటగలుపుతున్నారని ఆరోపిస్తూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు.
ఈ గందరగోళంపై ముఖ్యమంత్రి భగవంత్ మాన్ స్పందించారు. ప్రతిపక్షాలు చేస్తున్నవన్నీ నిరాధారమైన ఆరోపణలని కొట్టిపారేశారు. రాజకీయంగా ఎదుర్కోలేక తన వ్యక్తిత్వాన్ని హననం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సభా మర్యాదను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని.. అర్థం లేని విమర్శలతో సమయాన్ని వృథా చేయవద్దని విజ్ఞప్తి చేశారు. కార్మిక దినోత్సవం నాడు కార్మికుల సంక్షేమం గురించి చర్చించాల్సింది పోయి.. ఇలాంటి చిల్లర రాజకీయాలు చేయడం తగదని హితవు పలికారు.
సీఎం మద్యం తాగి సభకు వచ్చారు.. ప్రతిపక్షాల ఆరోపణ
పంజాబ్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో తీవ్ర ఉద్రిక్తత
సీఎం భగవంత్ మాన్ మద్యం సేవించి సభకు వచ్చారని కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఆరోపణ
కార్మిక దినోత్సవం నాడు సీఎం ఇలా ప్రవర్తించడం "అత్యంత సిగ్గుచేటని" నిరసన
ఆయన ప్రజల సమక్షంలో డోప్… pic.twitter.com/cgWCANgxy2
— BIG TV Breaking News (@bigtvtelugu) May 1, 2026
అయినప్పటికీ ప్రతిపక్షాలు శాంతించలేదు. గతంలో కూడా భగవంత్ మాన్‌పై ఇలాంటి ఆరోపణలు వచ్చాయని.. ఇప్పుడు ఏకంగా అసెంబ్లీ సాక్షిగా ఆయన ప్రవర్తన అనుమానాస్పదంగా ఉందని వారు ఆరోపించారు. రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించే శాసనసభకు ఒక ముఖ్యమంత్రి మద్యం సేవించి రావడం ప్రజాస్వామ్యానికే గొడ్డలి పెట్టు వంటిదని పేర్కొన్నారు. అధికార ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యులు ప్రతిపక్షాల తీరును తీవ్రంగా ఖండించడంతో సభలో ఇరువర్గాల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. తీవ్ర ఉద్రిక్తతల మధ్యే ప్రత్యేక సమావేశం గందరగోళంగా ముగిసింది.
ALSO READ: ఎన్నికలు ముగిసినా బెంగాల్‌లో కొనసాగుతున్న ఉద్రిక్తత.. ఈసీపై టీఎంసీ తీవ్ర ఆరోపణలు