Putin’s Aurus vs Xi Jinping’s Hongqi L5: బ్రిక్స్ సదస్సు కోసం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ భారత్‌కు వచ్చారు. నేతల పర్యటనలపై ఎంత ఆసక్తి ఉంటుందో.. వారు ఉపయోగించే ప్రత్యేక కార్లపైనా అంతే చర్చ జరుగుతోంది. ముఖ్యంగా పుతిన్ ఉపయోగించే ఆరస్ సెనాట్, షీ జిన్‌పింగ్ ప్రయాణించే హాంగ్‌కీ L5/కస్టమైజ్డ్ N701 ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఈ రెండు కార్లు సాధారణ లగ్జరీ వాహనాలు కావు. తమ దేశాధినేతలకు అత్యున్నత స్థాయి భద్రత, సౌకర్యం అందించేలా వీటిని ప్రత్యేకంగా రూపొందించారు.
చైనాకు చెందిన హాంగ్‌కీ బ్రాండ్‌కు దేశ రాజకీయ చరిత్రతో ప్రత్యేక అనుబంధం ఉంది. మాండరిన్‌లో హాంగ్ కీ అంటే ‘ఎర్ర జెండా’. ఈ బ్రాండ్ 1958లో ప్రారంభమైంది. అప్పటి నుంచి చైనా ప్రభుత్వానికి చెందిన ప్రముఖుల అధికారిక వాహనాల్లో దీనికి ప్రత్యేక స్థానం ఉంది. హాంగ్‌కీ L5 దాదాపు 5.5 మీటర్ల పొడవు, సుమారు 3,150 కిలోల బరువుతో ఉండే భారీ లగ్జరీ లిమోజిన్ గా పిలుస్తారు. దీని ధర సుమారు రూ.7 కోట్లుగా కొన్ని నివేదికలు చెబుతున్నాయి. అయితే, అధ్యక్షుడి కోసం ఉపయోగించే ప్రత్యేక వెర్షన్ వివరాలు పూర్తిగా బహిరంగంగా అందుబాటులో లేవు. ఈ కారులో ప్రొటెక్షన్ లేయర్ గా మందపాటి బుల్లెట్‌ప్రూఫ్ గ్లాస్, ప్రత్యేక భద్రతా వ్యవస్థలు ఉన్నాయి. బయో కెమికల్ ప్రమాదాల నుంచి ప్రెసిడెంట్ ను రక్షించేందుకు ప్రత్యేక ఎయిర్ ఫిల్టర్ వ్యవస్థ కూడా టుంది. 360-డిగ్రీ కెమెరాలు, ఆల్ వీల్ డ్రైవ్ లాంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.
రష్యా అధ్యక్షుడు పుతిన్ కోసం ప్రత్యేకంగా తయారు చేసిన ఆరస్ సెనాట్ మరో భారీ, అత్యంత రక్షిత లిమోజిన్. ఇది సుమారు ఆరు టన్నుల బరువు ఉంటుంది. అంతేకాదు, BR5 స్థాయి బాలిస్టిక్ రక్షణ వ్యవస్థను కలిగి ఉంటుంది. ఈ స్థాయి రక్షణ కారణంగా బుల్లెట్లతో పాటు కొన్ని రకాల పేలుళ్లను తట్టుకునే సామర్థ్యం ఉంటుంది. కారులో సుమారు 80 మిల్లీమీటర్ల మందం కలిగిన బుల్లెట్‌ప్రూఫ్ గ్లాస్ ఉంటుంది. టైర్లు దెబ్బతిన్నా కొంత దూరం వాహనం ముందుకు వెళ్లేలా రూపొందించారు. పవర్ విషయంలో ఆరస్ ముందుంది. ఇందులో 598 హెచ్‌పీ ఇంజన్ ఉన్నట్లు సమాచారం. ఇది 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని సుమారు ఆరు సెకన్లలో అందుకుంటుంది.
ఆరస్ లో బాలిస్టిక్ రక్షణతో పాటు ఎలక్ట్రానిక్ కౌంటర్ మెజర్స్, యాంటీ డ్రోన్ టెక్నాలజీ, అత్యవసర ఆక్సిజన్ వ్యవస్థ లాంటి ఫీచర్లు ఉన్నాయి. పుతిన్ కాన్వాయ్‌లో ఒకే మోడల్‌కు చెందిన పలు కార్లను ఉపయోగించడం కూడా భద్రతా వ్యూహంలో భాగంగా పేర్కొంటారు. దీంతో అధ్యక్షుడు ఏ కారులో ప్రయాణిస్తున్నారో బయటివారికి సులభంగా గుర్తించడం కష్టమవుతుంది. మరోవైపు, హాంగ్‌కీ L5 ప్రత్యేక కవచం, బుల్లెట్‌ప్రూఫ్ గ్లాస్‌తో పాటు బయో కెమికల్ ముప్పుల నుంచి రక్షణ కల్పించే వ్యవస్థలపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.
ఓవరాల్ గా పవర్, వేగం, బాలిస్టిక్ స్పెసిఫికేషన్ల విషయంలో ఆరస్ సెనాట్ ముందున్నట్లు కనిపిస్తుంది. అయితే, హాంగ్ కీ L5, ముఖ్యంగా షీ కోసం ఉపయోగించే ప్రత్యేక వెర్షన్‌కి సంబంధించిన చాలా వివరాలు అధికారికంగా వెల్లడించలేదు. అందువల్ల దాని పూర్తి భద్రతా సామర్థ్యాలను ఆరస్ తో కచ్చితంగా పోల్చడం కష్టం.
Read Also: కారు కాదు.. కదిలే కోట.. జిన్‌పింగ్ హాంగ్‌కీ N701 ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!