Khairatabad Election: తెలంగాణలో దానం నాగేందర్ అనర్హత అంశం.. ఇప్పుడు గరం గరం న్యూస్‌గా మారింది. హైకోర్టు తీర్పు తర్వాత ఉప ఎన్నికకు సిద్దమని ప్రకటించిన దానం కొద్ది గంటల్లోనే రూటు మార్చి..హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. అయితే ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే…దానం పిటిషన్‌పై బీఆర్ఎస్, బీజేపీలు..కేవియట్ పిటిషన్ దాఖలు చేశాయి. పిటీషన్ స్వీకరిస్తే తమ వాదనలు వినాలని కోర్టును కోరాయి. దీంతో ఈ పిటిషన్‌పై నెక్ట్స్ ఏం జరగబోతుందనే టెన్షన్..రాజకీయ వర్గాల్లో నెలకొంది.
మరోవైపు ఉప ఎన్నిక తప్పదన్న ఆలోచనకు వచ్చిన పార్టీలు అప్పుడే..అభ్యర్థుల ఎంపిక కసరత్తును స్టార్ట్ చేశాయి. ఖైరతాబాద్‌పై బీఆర్ఎస్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఖైరతాబాద్ బరిలో ఎవరిని నిలబెట్టాలన్న అంశంపై సీక్రెట్ సర్వే నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఖైరతాబాద్ రేసులో తలసాని సాయికిరణ్ యాదవ్, విష్ణువర్థన్‌రెడ్డి, మన్నె గోవర్థన్‌రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి.
ఖైరతాబాద్ ఉపఎన్నికలో గెలిచేందుకు కాషాయ పార్టీ వ్యూహాలు రచిస్తోంది. ఆ పార్టీ నుంచి మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి రేసులో ఉన్నారు. వీరితో పాటు.. దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మి , బద్ధం బాల్‌రెడ్డి కొడుకు బద్ధం మహిపాల్‌రెడ్డి పేర్ల పైన చర్చ జరుగుతోంది. ముగ్గురు నేతలపై సర్వేకు బీజేపీ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.
Also read: జూరాల డ్యామ్ వద్ద ఉత్కంఠ.. రైతుల ధర్నాతో పోలీసులు పహారా!
ఖైరతాబాద్‌లో ఉప ఎన్నికలు వస్తే బీజేపీ జెండా ఎగురవేస్తామని కేంద్రమంత్రి బండి సంజయ్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అక్కడ BRSకు అసలు అభ్యర్థే లేరని కామెంట్ చేశారు. ఖైరతాబాద్‌లో కాంగ్రెస్ మైనార్టీ ఓట్లతో గెలవాలని చూస్తోందని విమర్శించారు. కాంగ్రెస్ అభివృద్ధి పేరుతో కాకుండా మతం పేరుతో ఓట్లు అడగాలని చూస్తోందని కామెంట్ చేశారు.
అటు కాంగ్రెస్ నుంచి ఎవరు పోటీ చేయాల్సి వస్తే..ఎవరు బరిలో నిలుస్తారనేది సస్పెన్స్‌గా మారింది. అయితే..ఖైరతాబాద్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ఎవరు పోటీ చేయాలనేది హై కమాండ్ నిర్ణయిస్తుందన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఈ వ్యాఖ్యలతో…దానంకు టికెట్ ఇవ్వడం డౌట్‌గా మారింది. ఇదిలా ఉంటే..దానం నాగేందర్‌పై అనర్హత తీర్పుతో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల్లో కొత్త టెన్షన్ మొదలైంది. హైకోర్టు వ్యాఖ్యలతో …పార్టీ మార్పుకు సంబంధించిన ఫొటోలు, ప్రకటనలు, బహిరంగ కార్యక్రమాల్లో చేసిన కామెంట్స్ ..తమ పదవికి ఎసరు తెస్తాయా అని ఆందోళన చెందుతున్నారట.
Also read: పిఠాపురంలో ఉపాసన రాంచరణ్ సామాజిక సేవ.. రూ. 2 కోట్ల వ్యయంతో!