Eco-friendly Animals: పర్యావరణ పరిరక్షణ అనగానే మనకు ముందుగా మనుషులు, వారి ప్రయత్నాలే గుర్తుకొస్తాయి. కానీ మనకు తెలియకుండానే ఈ భూగోళాన్ని పచ్చగా ఉంచడంలో, వాతావరణ మార్పులతో పోరాడటంలో కొన్ని మూగజీవులు అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నాయి. చెట్లకు ప్రాణం పోస్తూ కర్బన ఉద్గారాలను తగ్గిస్తూ జీవవైవిధ్యాన్ని కాపాడుతున్న ఆ ఆరుగురు సహజసిద్ధ పర్యావరణ ఇంజనీర్ల గురించి ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.
చాలామంది గబ్బిలాలను చూసి భయపడతారు. కానీ, అడవుల పునరుత్పత్తిలో ఇవే ప్రధాన పాత్ర వహిస్తాయి. ఇవి రాత్రిపూట దూరప్రాంతాలకు ప్రయాణిస్తూ రకరకాల విత్తనాలను వేర్వేరు ప్రాంతాల్లో వెదజల్లుతాయి. అంతేకాకుండా వేలాది కీటకాలను తింటూ సహజసిద్ధమైన చీడపీడల నివారిణిగా పనిచేసి, పంటలను కాపాడతాయి.
నీటి ప్రవాహాలకు అడ్డుగా ఆనకట్టలు కట్టడంలో బీవర్లు దిట్ట. ఇవి కట్టే చిన్న చిన్న డ్యామ్‌ల వల్ల ఆయా ప్రాంతాల్లో చిత్తడి నేలలు (Wetlands) ఏర్పడతాయి. ఇవి వరదల తీవ్రతను తగ్గించడమే కాకుండా, నీటి నాణ్యతను పెంచుతాయి. అంతేకాకుండా ఈ చిత్తడి నేలలు భూమిలో అధిక మొత్తంలో కార్బన్‌ను నిల్వ చేయడానికి దోహదపడతాయి.
ప్రపంచంలోనే అత్యంత ముఖ్యమైన పరాగ సంపర్క జీవుల్లో తేనెటీగలు మొదటి వరుసలో ఉంటాయి. మొక్కలు, చెట్లు పునరుత్పత్తి చెందడానికి ఇవి ఎంతగానో తోడ్పడతాయి. మనం తినే ప్రతి మూడు ముద్దల్లో ఒక ముద్ద తేనెటీగల వల్లే సాధ్యమవుతోందని నిపుణులు చెబుతుంటారు. పంటల దిగుబడి పెరగడానికి, జీవవైవిధ్యం నిలబడటానికి ఇవే మూలస్తంభాలు.
ఏనుగులను అడవికి ‘పరిశోధకులు’ అని పిలుస్తారు. ఇవి రోజూ మైళ్ల కొద్దీ ప్రయాణిస్తూ మలం ద్వారా విత్తనాలను దూర ప్రాంతాలకు వ్యాప్తి చేస్తాయి. దట్టమైన అడవుల్లో కొత్త చెట్లు పెరగడానికి, దారి ఏర్పడటానికి ఏనుగులు చేసే సాయం సాటిలేనిది. ఈ దట్టమైన అడవులే భూమిపై కార్బన్‌ను పీల్చుకునే ప్రధాన కేంద్రాలుగా పనిచేస్తాయి.
సముద్ర గర్భంలో ఉండే ‘కెల్ప్’ (సముద్ర నాచు) అడవులను కాపాడటంలో సీ ఆటర్లు కీలక పాత్ర పోషిస్తాయి. కేల్ప్ నాచును నాశనం చేసే ‘సీ అర్చిన్’ అనే జీవులను ఇవి ఆహారంగా తీసుకుంటాయి. తద్వారా వేలాది సముద్ర జీవులకు ఆవాసం లభించడానికి ఇవి దోహదపడతాయి.
Also Read: కుక్క పెట్టిన చిచ్చు.. లిఫ్ట్‌లో పొట్టు పొట్టు కొట్టుకున్న మహిళలు.. వీడియో వైరల్!
తిమింగలాలు నుంచి విడుదలయ్యే పోషకాలతో కూడిన విసర్జకాలు.. ‘ఫైటోప్లాంక్టన్’ అనే సూక్ష్మజీవుల పెరుగుదలకు తోడ్పడతాయి. ఈ సూక్ష్మజీవులు భూమికి కావలసిన ఆక్సిజన్ అందించడంలో వాతావరణంలోని కార్బన్ డై ఆక్సైడ్‌ను పీల్చుకోవడంలో చెట్ల కంటే వేగంగా పనిచేస్తాయి.
Also Read: అంతరిక్షంలో ‘ఫుట్‌బాల్’.. బంతితో చెడుగుడు ఆడిన వ్యోమగాములు.. అదరగొట్టారు భయ్యా!