Railway Jobs| ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు రైల్వే శాఖ మంచి అవకాశాన్ని అందిస్తోంది. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) NTPC అండర్గ్రాడ్యుయేట్ రిక్రూట్మెంట్ 2026 కింద మొత్తం 1,688 పోస్టుల భర్తీకి దరఖాస్తులు స్వీకరిస్తోంది. అర్హులైన అభ్యర్థులు అక్టోబర్ 15 నుంచి నవంబర్ 13, 2026 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ నియామక ప్రక్రియ ద్వారా నాలుగు రకాల ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్: 700 పోస్టులు
అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్: 200 పోస్టులు
జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్: 600 పోస్టులు
ట్రైన్స్ క్లర్క్: 188 పోస్టులు
మొత్తం 1,688 ఖాళీలు ఉన్నాయి. వీటిలో కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ పోస్టులు అత్యధికంగా ఉన్నాయి.
RRB NTPC అండర్గ్రాడ్యుయేట్ ఉద్యోగుల జీతాలు 7వ పే కమిషన్ (CPC) ప్రకారం ఉంటాయి. కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్కు ప్రారంభ బేసిక్ జీతం నెలకు రూ.21,700. ఈ పోస్టులో ఇన్ హ్యాండ్ సుమారు రూ.32,000–35,000 అందవచ్చు. జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్, ట్రైన్స్ క్లర్క్ పోస్టులకు ప్రారంభ బేసిక్ జీతం రూ.19,900. ఈ ఉద్యోగులకు ఇన్ హ్యాండ్ సుమారు రూ.28,000–30,000 అందవచ్చు.
నగరాన్ని బట్టి జీతంలో మార్పులు ఉంటాయి. బేసిక్ జీతంతో పాటు ఉద్యోగులకు డీఏ, హెచ్ఆర్ఏ, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ వంటి ప్రయోజనాలు లభిస్తాయి. నిబంధనల ప్రకారం వైద్య సదుపాయాలు, రైల్వే ప్రయాణ పాసుల సౌలభ్యం కూడా ఉంటుంది.
RRB విడుదల చేసిన CEN నంబర్ 07/2026 నోటిఫికేషన్ ప్రకారం.. అభ్యర్థులు ఈ తేదీలను గుర్తుంచుకోవాలి.
దరఖాస్తుల ప్రారంభం: అక్టోబర్ 15, 2026
దరఖాస్తులకు చివరి తేదీ: నవంబర్ 13, 2026, రాత్రి 11:59 గంటల వరకు
దరఖాస్తుల సవరణ గడువు: నవంబర్ 16 నుంచి 25, 2026 వరకు
చివరి తేదీ వరకు వేచి ఉండకుండా ముందుగానే దరఖాస్తు చేసుకోవడం మంచిది.
2027 జనవరి 1 నాటికి అభ్యర్థుల వయస్సు 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం అర్హులైన వర్గాలకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
జనరల్, EWS అభ్యర్థులు: జనవరి 2, 1997 నుంచి జనవరి 1, 2009 మధ్య పుట్టినవారై ఉండాలి.
OBC-NCL అభ్యర్థులు: జనవరి 2, 1994 నుంచి జనవరి 1, 2009 మధ్య పుట్టినతేదీ ఉండాలి.
SC, ST అభ్యర్థులు: జనవరి 2, 1992 నుంచి జనవరి 1, 2009 మధ్య జన్మించి ఉండాలి.
అభ్యర్థులు నోటిఫికేషన్లో పేర్కొన్న విద్యార్హతలను దరఖాస్తు గడువు ముగిసేలోపు పూర్తి చేసి ఉండాలి. ఫలితాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు కారు.
అభ్యర్థుల ఎంపిక రెండు కంప్యూటర్ ఆధారిత పరీక్షల (CBT) ద్వారా జరుగుతుంది.
మొదటి దశ CBT: మొత్తం 100 ప్రశ్నలు ఉంటాయి. జనరల్ అవేర్నెస్ నుంచి 40, మ్యాథమెటిక్స్ నుంచి 30, రీజనింగ్ నుంచి 30 ప్రశ్నలు వస్తాయి. పరీక్ష సమయం 90 నిమిషాలు.
రెండో దశ CBT: మొత్తం 120 ప్రశ్నలు ఉంటాయి. జనరల్ అవేర్నెస్ నుంచి 50, మ్యాథమెటిక్స్ నుంచి 35, రీజనింగ్ నుంచి 35 ప్రశ్నలు వస్తాయి. పరీక్ష సమయం 90 నిమిషాలు.
రెండు పరీక్షల్లోనూ ప్రతి తప్పు సమాధానానికి మూడో వంతు మార్కు కోత విధిస్తారు. అర్హులైన దివ్యాంగ అభ్యర్థులకు స్క్రైబ్ అనుమతి ఉంటే 120 నిమిషాల సమయం లభిస్తుంది. మొదటి పరీక్షలో సాధించిన నార్మలైజ్డ్ స్కోర్ల ఆధారంగా రెండో పరీక్షకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
Also Read: నెల చివరికి జేబు ఖాళీ.. జీతం సరిపోవడం లేదా? ఈ స్మార్ట్ ఫైనాన్సియల్ టిప్స్ మీ కోసమే
అభ్యర్థులు అధికారిక RRB వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఒక అభ్యర్థి ఒకే RRBను ఎంచుకోవచ్చు. అలాగే అందుబాటులో ఉన్న రైల్వే జోన్లు, పోస్టులకు ప్రాధాన్యతలు ఇవ్వాలి. దరఖాస్తు చేసే ముందు పూర్తి నోటిఫికేషన్ను జాగ్రత్తగా చదవాలి. తాజా సమాచారం, మార్పులు, నియామక ప్రక్రియ వివరాల కోసం అధికారిక RRB వెబ్సైట్ను క్రమం తప్పకుండా పరిశీలించాలి.
Also Read: వయసు 21 ఏళ్లు.. ఒక్క నెలలో రూ.2.6 కోట్లు సంపాదన.. యువకుడి బిజినెస్ ఐడియా అదుర్స్