New Tesla Roadster Revealed: ఎలక్ట్రిక్ కార్ల ప్రపంచంలో టెస్లా మరో సంచలనం సృష్టించే ప్రయత్నం చేస్తోంది. గాల్లో విన్యాసాలు చేసే ఎయిర్ థ్రస్టర్లతో కూడిన కొత్త రోడ్‌స్టర్ ప్రీ ప్రొడక్షన్ మోడల్ ను పరిచయం చేసింది. స్పేస్ఎక్స్ టెక్నాలజీ ఆధారంగా రూపొందించిన ఈ కారులో ప్రత్యేకమైన ఫ్లయింగ్ ఫీచర్లు, సరికొత్త డిజైన్, హై పెర్ఫార్మెన్స్తో ఆకట్టుకుంటుంది. 2028లో ఉత్పత్తి ప్రారంభించే లక్ష్యంతో ఉన్న ఈ మోడల్‌కు సంబంధించిన కీలక వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
టెస్లా కొత్త రోడ్‌స్టర్‌లో స్పేస్ఎక్స్ అభివృద్ధి చేసిన కోల్డ్ ఎయిర్ థ్రస్టర్ టెక్నాలజీని ఉపయోగించారు. ఈ సిస్టమ్‌లో హై ప్రెషర్ తో స్టోర్ చేసిన చల్లని గాలిని ప్రత్యేక నాజిల్‌ల ద్వారా బయటకు పంపి థ్రస్ట్ ను ఉత్పత్తి చేస్తారు. దీనివల్ల కారు కొద్దిసేపు నేల నుంచి పైకి లేవడం, గాలిలో కదలికలను నియంత్రించడం లాంటి విన్యాసాలు చేస్తుందని కంపెనీ వివరిస్తోంది. సాధారణ రాకెట్ ఇంజిన్ లా ఇంధనాన్ని మండించే విధానం కాకుండా, పీడనంతో కూడిన గాలిని ఉపయోగించడం ఈ టెక్నాలజీ ప్రత్యేకత.
కొత్త టెస్లా రోడ్‌స్టర్‌ను మూడు కాన్ఫిగరేషన్లలో అందించనున్నట్లు తెలుస్తోంది.
పెర్ఫార్మెన్స్: రెండు సీట్లతో వచ్చే బేస్ వెర్షన్. ఇందులో 2G గ్రిప్‌ను అందించే అండర్ బాడీ సక్షన్ ఫ్యాన్ ఉంటుంది.
థ్రస్ట్ ఆగ్మెంట్: పెర్ఫార్మెన్స్ వెర్షన్‌కు అదనంగా వెనుకవైపు ఎయిర్ థ్రస్టర్లను యాడ్ చేస్తారు.
రాకెట్ ఆగ్మెంట్: మొత్తం 10 థ్రస్టర్లతో రూపొందించే ఈ వెర్షన్లో అదనపు ఫ్లయింగ్ హార్డ్ వేర్ కోసం రెండో సీటును తొలగిస్తారు.
ఈ కారు 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని ఒక్క సెకను కంటే తక్కువ సమయంలో అందుకుంటుందని టెస్లా చెబుతోంది. అయితే, బ్యాటరీ సామర్థ్యం, మోటార్ పవర్, డ్రైవింగ్ రేంజ్ లాంటి పూర్తి స్పెసిఫికేషన్లను ఇంకా వెల్లడించలేదు.
2017లో చూపించిన రోడ్ స్టర్ కాన్సెప్ట్ తో పోలిస్తే కొత్త మోడల్ డిజైన్ లో భారీ మార్పులు కనిపిస్తున్నాయి. సైబర్‌ట్రక్‌ను గుర్తుచేసే బాడీ, వెడ్జ్ ఆకారపు సిల్హౌట్, ఆకట్టుకునే హెడ్లైట్లు, వెనుకవైపు పూర్తి వెడల్పుతో ఉండే LED టెయిల్‌లైట్ ఆకట్టుకుంటుంది. యాక్టివ్ రియర్ వింగ్, సన్నని స్పోక్ వీల్స్, గోల్డ్ కలర్ మిర్రర్లు, టైటానియం యాక్సెంట్లతో స్పోర్టీ లుక్‌ను అందించారు. ఏరోడైనమిక్స్‌ను మెరుగుపరచడానికి రియర్ వింగ్ ను సర్దుబాటు అయ్యేలా రూపొందించారు.
కారు ఇంటీరియర్ లో యోక్ స్టైల్ స్టీరింగ్, సెంట్రల్ టచ్ స్క్రీన్, కార్బన్ ఫైబర్, మెగ్నీషియం, టైటానియం లాంటి లైట్ మెటీరియల్స్ ను ఉపయోగించారు. పెర్ఫార్మెన్స్, థ్రస్ట్ వెర్షన్లలో రెండు సీట్లు ఉండగా, రాకెట్ వెర్షన్లో మాత్రం ఒకే సీటు ఉంటుంది. అయితే, ఈ మోడల్ లోని ఫ్లయింగ్ ఫీచర్లు, ముఖ్యంగా రాకెట్ వెర్షన్, పబ్లిక్ రోడ్లపై వినియోగానికి అనుమతి పొందుతాయా? లేదా? అన్నది చూడాలి.
Read Also: మహీంద్రా XUV 3XO సరికొత్త రికార్డు.. 5 లక్షలు దాటిన సేల్స్!