Bihar New CM: బిహార్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆ రాష్ట్ర నూతన సీఎంగా బీజేపీ నేత, ప్రస్తుత ఉపముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి బాధ్యతలు చేపట్టబోతున్నారు. సీఎంగా నితీశ్ కుమార్ రాజీనామా చేసిన కొద్దిసేపటికే.. బీజేపీ శాసనసభా పక్ష నేతగా సామ్రాట్ చౌదరి ఎన్నికయ్యారు. రేపు రాష్ట్ర గవర్నర్ సమక్షంలో ఆయన సీఎంగా ప్రమాణం చేయనున్నారు. బిహార్ లో ముఖ్యమంత్రి పీఠం అధిరోహించబోతున్న తొలి బీజేపీ నేతగా సామ్రాట్ చౌదరి ఘనత సాధించనుండటం విశేషం. కాబట్టి సామ్రాట్ చౌదరి రాజకీయ నేపథ్యం ఏంటో ఇప్పుడు పరిశీలిద్దాం.
సామ్రాట్ చౌదరి.. అసలు పేరు రాకేష్ కుమార్. 1968 నవంబర్ 16వ తేదీన బిహార్ లోని ముంగేర్ జిల్లా లఖన్ పూర్ గ్రామంలో ఆయన జన్మించారు. ఆయన బలమైన రాజకీయ కుటుంబం నుంచి వచ్చారు. ఆయన తండ్రి శకుని చౌదరి 6-7 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎంపీగా పనిచేశారు. సమతా పార్టీ సహ వ్యవస్థాపకుల్లో ఆయనా ఒకరు. అటు తల్లి పార్వతీ దేవి తారాపూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పనిచేశారు.
సామ్రాట్ చౌదరి.. 1990లో తన రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించారు. మొదట ఆర్జేడీ (RJD)లో చేరి.. 2000లో పర్బత్తా నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. అనంతరం రబ్రీ దేవి మంత్రివర్గంలో వ్యవసాయ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2014లో జితన్ రామ్ మాంఝీ ప్రభుత్వంలో పట్టణాభివృద్ధి & గృహనిర్మాణ మంత్రిగా పనిచేశారు. 2018లో కమలం పార్టీలో చేరి.. బీజేపీ ఉపాధ్యక్షుడుగా, 2023లో బీహార్ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు.
2024 జనవరి 28న నితీశ్ కుమార్ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా తొలిసారి సామ్రాట్ చౌదరి బాధ్యతలు చేపట్టారు. హోం, ఫైనాన్స్, హెల్త్, పంచాయతీ రాజ్ వంటి ముఖ్యమైన శాఖలు చూశారు. గతేడాది జరిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తారాపూర్ నియోజకవర్గం నుంచి గెలిచి.. 2025 నవంబర్‌లో మరోమారు డిప్యూటీ సీఎం అయ్యారు. తాజాగా సీఎం నితీశ్ కుమార్ రాజీనామా నేపథ్యంలో ఆయన స్థానంలో సీఎంగా ప్రమాణం చేసేందుకు సామ్రాట్ చౌదరి సిద్ధమయ్యారు.
Also Read: నితీష్ కుమార్ సంచలన నిర్ణయం.. బీహార్ సీఎం పదవికి రాజీనామా!
ఇదిలా ఉంటే సామ్రాట్ చౌదరిపై రెండు క్రిమినల్ కేసులు సైతం నమోదై ఉన్నాయి. 1995లో జరిగిన ఓ కాంగ్రెస్ నేత హత్య కేసులో తండ్రితో పాటు సామ్రాట్ చౌదరి పేరు కూడా బయటకు వచ్చింది. ఇదిలాఉంటే బిహార్ రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక ముద్రను సామ్రాట్ చౌదరి వేశారు. ఓబీసీల్లో మంచి పట్టు ఉన్న నేతగా ఆయన ఎదిగారు. సీఎంగా బిహార్ లో తన మార్క్ చూపించేందుకు సామ్రాట్ చౌదరి సిద్దమవుతున్నారు.
Also Read: TCS Nashik Case: మహిళా ఉద్యోగులపై వేధింపులు.. మత మార్పిడికై ఒత్తిడి.. వెలుగులోకి నమ్మలేని నిజాలు!