కొండ చిలువను చూస్తే.. సగం ప్రాణం పోతుంది. తేడా కొడితే.. అది మనుషులను చుట్టేసి.. ఎముకులు విరిచేసి అమాంతంగా మింగేస్తుంది. అలాంటి ప్రమాదకరమైన కొండ చిలువులతో ఆ ఆకతాయిలు వెకిలి చేష్టాలకు పాల్పడ్డారు. నడి రోడ్డుపై వాటి తోకలు పట్టుకుని డ్యాన్సులు చేస్తూ వీడియోలు తీసుకున్నారు. ఈ వీడియో చూసిన వన్య ప్రాణుల ప్రేమికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ ఆకతాయిల తగిన శిక్ష వేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ఉత్తరప్రదేశ్ లోని బులంద్‌షహర్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కొంతమంది యువకులు భారీ కొండచిలువలతో ప్రమాదకరమైన రీతిలో విన్యాసాలు చేస్తూ సోషల్ మీడియా కోసం వీడియోలు తీయడం తీవ్ర కలకలం రేపింది. ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఆ కుర్రాళ్లు.. ఆ కొండ చిలువను మెడలో వేసుకోడానికి కూడా ప్రయత్నించారు. తాము ఏదో ఘనకార్యం చేస్తున్నా అన్నట్లుగా నవ్వుతూ.. హీరోల్లా పోజులిస్తూ నానా హంగామా చేశారు. ఆ కొండచిలువలు తప్పించుకుని వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ, యువకులు వాటిని వెనక్కి లాగుతూ ఈ ప్రమాదకరమైన విన్యాసాలు చేశారు. అయితే, వారు ఆ కొండ చిలువలను తామే రక్షించామని, అడవిలో వదిలి పెట్టే ముందు ఇలా వీడియోలు తీసుకున్నామని చెబుతున్నారు.
ఈ వీడియో వైరల్ కావడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. బులంద్‌షహర్ జిల్లా అటవీశాఖ అధికారి డాక్టర్ హరేంద్ర సింగ్ స్పందిస్తూ.. కొండచిలువలు వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద రక్షించబడిన జీవులని, వాటిని పట్టుకోవడం, బహిరంగ ప్రదేశాల్లో ప్రదర్శించడం తీవ్రమైన నేరమని స్పష్టం చేశారు. ఆ వీడియోలో ఉన్న యువకులపై కేసు నమోదు చేశామని, త్వరలోనే వారిని అదుపులోకి తీసుకుంటామని సీటీ సీఓ ప్రఖర్ పాండే వెల్లడించారు. వన్యప్రాణులు కనిపించినప్పుడు వెంటనే అటవీశాఖకు సమాచారం అందించాలే తప్ప, ఇలా ప్రదర్శనలు ఇవ్వడం చట్టవిరుద్ధమని తెలిపారు.
Also Read: ఆస్ట్రేలియాలో రాక్షస సాలీడు.. శాటిలైట్ ఫోటోతో అసలు సంగతి చెప్పేసి నాసా