గూగుల్ మ్యాప్స్ చూస్తున్నప్పుడు భూమిపై ఎన్నో వింతలు కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా కొండలు, లోయలు.. పర్వతాలు విచిత్ర ఆకారాల్లో కనిపిస్తాయి. ఆస్ట్రేలియాలోని ఓ ప్రాంతం కూడా అలాగే కనిపించింది. పెద్ద సాలీడు.. కాళ్లు చాపుకుని కూర్చున్నట్లుగా ఒక వింత ఆకారం కనిపించింది. పర్వతమంత సైజులో చాలా పెద్దగా కనిపిస్తుండటంతో అంతా దానికి రాక్షస సాలీడు అని పేరు పెట్టారు. ఈ ఫొటో సోషల్ మీడియాలో బాగా వైరల్ కావడంతో NASA రంగంలోకి దిగక తప్పలేదు. ఇంతకీ నాసా ఏం తేల్చిందంటే..
ఈ వింత ఆకారం గురించి తెలుసుకోడానికి నాసా, యూఎస్ జియోలాజికల్ సర్వే ఉమ్మడిగా రంగంలోకి దిగాయి. ల్యాండ్‌శాట్ 9 అనే ఉపగ్రహం సహాయంతో.. ఆస్ట్రేలియా అంతరిక్ష చిత్రం ఒకదాన్ని చిత్రీకరించింది. పశ్చిమ ఆస్ట్రేలియాలోని మైదాన ప్రాంతంలో తీసిన ఈ ఫోటోను అంతరిక్షం నుంచి చూస్తే ఒక రాక్షస సాలీడు కాళ్ళు చాపుకుని కూర్చున్నట్లుగా కనిపించింది. మొదట్లో దాన్ని చూసి ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత దాన్ని మరింత లోతుగా పరిశీలించి అసలు విషయం చెప్పారు. అంతా అనుకుంటున్నట్లుగా ఇది రాక్షస సాలీడో, గ్రహాంతరవాసుల గుర్తో కాదని.. మిలియన్ల ఏళ్ల కిందట ఏర్పడిన ఒక పురాతన గ్రహశకల గుంత అని నాసా శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు.
పశ్చిమ ఆస్ట్రేలియాలోని అతి పురాతనమైన కింబలో ఈ ఆకారం ఉంది. అంతరిక్షం నుంచి లేదా డ్రోన్ సాయంతో చూస్తేనే ఈ రాక్షస సాలీడు ఆకారం కనిపిస్తుంది. అక్కడ సాలీడు రూపం ఉన్న ప్రాంతం మాత్రమే లోతుగా ఉంటుంది. దాని చుట్టూ ఉన్న ప్రాంతం మాత్రం సమాంతర మైదానంలా కనిపిస్తుంది. అందుకే దానికి ‘స్పైడర్ క్రేటర్’ అని పేరు పెట్టారు. ఈ గుంత ఆకారంలో 13 x 11 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. అయితే దీని మధ్యలో సాలీడు ఆకారంలో కనిపిస్తున్న ప్రధాన భాగం దాదాపు 4 కిలోమీటర్ల వైశాల్యంలో వ్యాపించి ఉంది.
దాదాపు 600 మిలియన్ల నుంచి 900 మిలియన్ సంవత్సరాల క్రితం ఒక భారీ గ్రహశకలం లేదా తోకచుక్క అత్యంత వేగంతో వచ్చి ఇక్కడ భూమిని బలంగా ఢీకొట్టి ఉండవచ్చని, అప్పుడే ఈ ఆకారం ఏర్పడి ఉంటుందని నాసా తెలిపింది. గ్రహశకలం ఢీకొట్టినప్పుడు ఏర్పడిన తీవ్రమైన ఒత్తిడికి భూమి లోపలి పొరలు ఒక్కసారిగా పైకి లేచాయి. కోట్లాది సంవత్సరాల పాటు సంభవించిన వర్షాలు, ఈదురుగాలుల వల్ల మెత్తటి రాతి పొరలు కొట్టుకుపోయాయి. దృఢమైన ఇసుకరాతి పొరలు మాత్రం నాశనం కాకుండా మిగిలిపోయాయి. ఇవే అంతరిక్షం నుంచి చూసినప్పుడు సాలీడు కాళ్ళలా వంకర్లు తిరిగి కనిపిస్తున్నాయి.
ఈ వింత రూపాన్ని 1950లలో మొదటిసారి గుర్తించారు. ఇది అగ్నిపర్వతం వల్ల ఏర్పడి ఉంటుందని భావించారు. కానీ 1970లలో భౌగోళిక శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేసి అసలు నిజాన్ని కనుగొన్నారు. అత్యంత వేగంతో గ్రహశకలాలు ఢీకొట్టినప్పుడు మాత్రమే ఏర్పడే గీతల వంటి ప్రత్యేక రాతి అమరికలను ఇక్కడ కనుగొన్నారు. తీవ్రమైన ఉష్ణోగ్రత, ఒత్తిడికి గురైన క్వార్ట్జ్, జిర్కాన్ స్పటికాలను ఇక్కడ గుర్తించారు. ఈ ప్రాంతంలో మానవ సంచారం అస్సలు ఉండదు. టూరిస్టు ప్రాంతం అస్సలు కాదు.
Also Read: ఒకప్పుడు భూమిపై అసలు ఆక్సిజనే ఉండేది కాదట, దీని పుట్టక భలే విచిత్రం