Tamailnadu: తమిళనాడులో రాజకీయాలు క్రమంగా మారుతున్నాయి. కనీసం రెండు రోజులకు ఒకసారి అధికార టీవీకే వర్సెస్ డీఎంకె మధ్య ఏదో విధంగా మాటల యుద్ధం జరుగుతోంది. అసెంబ్లీలో మాజీ సీఎం ఎంకే స్టాలిన్‌ను అనుకరిస్తూ సీఎం విజయ్ చేసిన సైగలపై డీఎంకే నుంచి విమర్శలు తీవ్రమయ్యాయి. ఈ క్రమంలో సీఎం విజయ్‌కు కౌంటర్ ఇచ్చారు స్టాలిన్. తమ్ముడు విజయ్ అంటూ ఎక్స్ వేదికగా ఓ వీడియో షేర్ చేశారు మాజీ సీఎం. అసలు ఏం జరిగింది?
బాడీ షేమింగ్ గురించి అసెంబ్లీ వేదికగా తమిళనాడు సీఎం విజయ్ చేసిన సైగలపై కౌంటర్ ఇచ్చిన మాజీ సీఎం స్టాలిన్. బాడీ షేమింగ్ చేసినా భయపడనని, ఎవరెంత అవమానించినా చరిత్ర మారదన్నారు. ఆ సమయంలో నా దవడ పగిలిందని, శరీరం అంతా గాయాలు అయ్యాయని చెప్పారు. నన్ను అవమానిస్తే పర్వాలేదు, ముందు ప్రజలను పట్టించుకోవాలని తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. రీల్స్, ఫొటోషూట్లు ఆపి రైతు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమయంలో ఎమర్జెనీలో జరిగిన ఘటనను ఒక్కసారి గుర్తు చేశారు.
ఎమర్జెన్సీ సమయంలో అంటే 1975-77 మధ్యకాలంలో కరుణానిధి నేతృత్వంలోని డీఎంకే ప్రభుత్వం రద్దయింది. ఆ సమయంలో డీఎంకే పార్టీ యువజన విభాగానికి స్టాలిన్ నాయకత్వం తీసుకున్నారు. ప్రభుత్వం రద్దయిన తర్వాత స్టాలిన్ అరెస్టయ్యారు. ఆ సమయంలో తాను జైలులో చిత్రహింసలు అనుభవించానని, కుష్టు వ్యాధిగ్రస్తులతో కలిసి తమను ఉంచారని గుర్తు చేశారు. మేము ఉన్న గదిలో ఒక్క బాత్రూమ్ ఉండేదని, దుర్వాసన వచ్చినా, అక్కడే నిద్రించాల్సి వచ్చిందన్నారు. పోలీసులు రాత్రి వేళ తమను నిద్ర పోనిచ్చేవారు కాదని, లాఠీలు, బూట్లతో కొట్టేవారని వివరించారు. మమ్మల్ని కొట్టడానికి జీవిత ఖైదీలను నియమించారని, ఆనాడు నాతోపాటు ఒకరు జైల్లో చనిపోయారని ఈ సందర్బంగా ప్రస్తావించారు.
ఆనాడు జరిగిన ఘటనలో నా దవడ ఎముక విరిగిపోయిందని, నాకు తగిలిన దెబ్బలు ఈనాటికీ ఉన్నాయని తెలియజేశారు మాజీ సీఎం. ప్రజా జీవితంలో ఉన్న చాలామందికి తమిళనాడు కోసం పోరాడిన విషయాలు ఎవరీ తెలీవన్నారు. ఇలాంటి అణచివేత ఎదురైందని, ఆనాటి అనుభవాల నుంచి బయటపడ్డామని తెలిపారు. పోరాటాలను ఎదుర్కోవడం కొత్తేమీ కాదని, అందులో భాగమైనందుకు గర్వంగా ఉందన్నారు. నా జీవితం గురించి మీకు నిజాలు తెలియవని వీడియో సందేశంలో పేర్కొన్నారు స్టాలిన్.
ALSO READ: జంతర్ మంతర్ కేసులను రద్దు చేసినా నోటీసులా.. సుప్రీం కోర్టు ఫైర్!
అసెంబ్లీలో ఏం జరిగింది? సెప్టెంబర్ 7న సీఎం విజయ్ మాట్లాడుతూ డీఎంకే హయాంలో జరిగిన అవినీతిపై ఆరోపణలు గుప్పించారు. ఆ సమయంలో విజయ్ తన దవడను పైకెత్తుతున్నట్టుగా ఒక సైగలు చేయడంతో డీఎంకే నేతల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. చివరకు సీఎం విజయ్ ఓ మెట్టు వెనక్కి దిగి అదంతా అనుకోకుండా జరిగిందని, ఉద్దేశపూర్వకంగా చేసింది కాదని వివరణ ఇచ్చారు.