Supreme Court: స్వేచ్ఛ బ్యూరో: గ్రేటర్ నోయిడా ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ పై సుప్రీం కోర్టు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళనల్లో పాల్గొన్న ఏ విద్యార్థిపై కఠిన చర్యలు తీసుకోవద్దని సుప్రీం కోర్టు గతంలో స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే, నిరసనల్లో పాల్గొన్నందుకు 5లక్షలు పర్సనల్ బాండ్ సమర్పించాలని గ్రేటర్ నోయిడా ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ నోటీసులు జారీ చెయ్యటంపై సుప్రీం కోర్టు తీవ్రంగా స్పందించింది. స్పష్టమైన ఆదేశాలు ఉన్నా గ్రేటర్ నోయిడా ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ నోటీసు ఎలా ఇస్తారని నిలదీసింది. “సర్వోన్నత న్యాయస్థాన ఆదేశాలను ధిక్కరిస్తూ ఒక మేజిస్ట్రేట్‌కు అంత ధైర్యం ఎక్కడిది?” అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ప్రశ్నించారు.
గౌతమ్ బుద్ధ యూనివర్సిటీకి చెందిన అక్షత్ త్రిపాఠి అనే విద్యార్థి జంతర్ మంతర్ నిరసనల్లో పాల్గొనడమే కాకుండా, ఇతర విద్యార్థులను కూడా ప్రోత్సహించాడంటూ పోలీసులు ఆరోపించారు. ఈ క్రమంలోనే సెప్టెంబర్ 4న సదరు ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ విద్యార్థికి రూ. 5 లక్షల బాండ్ నోటీసు జారీ చేశారు. అయితే, విద్యార్థులపై గతంలో నమోదైన కేసులను తాము ఇప్పటికే రద్దు చేశామని, వారిపై ఎలాంటి చట్టపరమైన లేదా శిక్షార్హమైన చర్యలు తీసుకోకూడదని తేల్చిచెప్పిన తర్వాత కూడా నోటీసులు ఇవ్వడంపై సుప్రీంకోర్టు దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఈ విషయాన్ని సీనియర్ అడ్వకేట్ బిశ్వజిత్ భట్టాచార్య కోర్టు దృష్టికి తీసుకురాగా గౌతమ్ బుద్ధ నగర్ డిస్ట్రిక్ట్, ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్లను సమగ్ర వివరణ కోరతామని సీజేఐ స్పష్టం చేశారు. మరోవైపు, అంతకుముందు రోజు అలహాబాద్ హైకోర్టు సైతం గౌతమ్ బుద్ధ నగర్ జిల్లా మేజిస్ట్రేట్ మేధా రూపమ్‌పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది.
Also read: పెళ్లి తర్వాత కూడా మహిళల సమ్మతి ముఖ్యమే.. సుప్రీం కోర్టుకు తెలిపిన కేంద్రం!
ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థిని, కార్యకర్త ఆకృతి చౌదరిపై ఏకంగా జాతీయ భద్రతా చట్టం ప్రయోగించడంపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. అధికారులు తమకు ఉన్న పరిమితులను దాటి ప్రవర్తిస్తే అది ప్రజాస్వామ్య వ్యవస్థకే ప్రమాదకరమని వ్యాఖ్యానించింది. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు తమకు ఉన్న బాధ్యతలను విస్మరించకూడదని హెచ్చరించింది. అధికారుల విధేయత కేవలం రాజ్యాంగానికి మాత్రమే పరిమితమై ఉండాలని, రాజకీయ నాయకులకు కాదని స్పష్టం చేసింది. పౌరుల రాజ్యాంగ హక్కులు, ఆత్మగౌరవాన్ని కాపాడేందుకే అధికారులకు చట్టబద్ధమైన అధికారాలు కట్టబెట్టారని, వాటిని ప్రజా సంక్షేమం కోసమే ఉపయోగించాలని వ్యాఖ్యానించింది. సుప్రీంకోర్టు, హైకోర్టుల వరుస హెచ్చరికలతో, నిరసన తెలిపే పౌరులపై అక్రమ కేసులు బనాయించే అధికారులకు గట్టి సందేశం వెళ్లినట్టయ్యింది. నోటీసు వెనక్కి తీసుకున్నామని పోలీసులు చెబుతున్నా ఈ ధిక్కరణపై మేజిస్ట్రేట్ ఇచ్చిన వివరణ ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
Also read: ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో అలాంటి వీడియోలు.. 63 మందిపై కేసు నమోదు!