Vijay CM Oath: తమిళ రాజకీయాలు.. ప్రస్తుతం యావత్ దేశం దృష్టిని ఆకర్షిస్తున్నాయి. టీవీకే పార్టీ అధినేత విజయ్.. సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారా? లేదా? అన్నదానిపై రోజు రోజుకు ఉత్కంఠ పెరుగుతోంది. అయితే శనివారం ఉదయం 11 గంటలకు విజయ్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని.. గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ ఇందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని శుక్రవారం రాత్రి పెద్ద ఎత్తున జాతీయ మీడియాల్లో కథనాలు వచ్చాయి. ఆ వార్తలు వచ్చిన కొద్ది నిమిషాలకే.. విజయ్ కు మద్దతు ఇచ్చినట్లుగా ప్రచారం జరిగిన IUML, AMMK పార్టీలు టీవీకేకు మద్దతు ఇవ్వబోమంటూ ప్రకటించాయి. దీంతో విజయ్ ప్రమాణ స్వీకారం వాయిదా పడినట్లు సమాచారం.
తమిళనాడులోని మెుత్తం 234 అసెంబ్లీ స్థానాలు ఉండగా 118 మంది (మ్యాజిక్ ఫిగర్) ఎమ్మెల్యేలు మద్దతు ఉంటేనే ప్రభుత్వ ఏర్పాటుకు వీలు కలుగుతుంది. అయితే విజయ్ పార్టీకి 108 సీట్లే ఎన్నికల్లో రాగా.. ఇతర పార్టీల మద్దతు కోసం ఆయన ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే 118 మంది ఎమ్మెల్యేల లిఖితపూర్వక మద్దతును తనకు సమర్పిస్తేనే.. ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి ఇస్తాని గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్.. విజయ్ కు షరతు విధించినట్లు సమాచారం. దీంతో టీవీకేకు మద్దతుగా నిలవాలని వీసీకే, ఏఎంఎంకే, ఐయూఎంఎల్ ఎమ్మెల్యేలను ఒప్పించేందుకు విజయ్ తీవ్రంగా ప్రయత్నించలేదని తెలుస్తోంది.
ప్రస్తుతం కాంగ్రెస్, వామపక్ష పార్టీల మద్దతుతో విజయ్ పార్టీకి 116 మంది ఎమ్మెల్యేల మద్దతు మాత్రమే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో గవర్నర్ విధించిన షరతుకు ఫుల్ ఫిల్ చేయడంతో విజయ్ విఫలం కావడంతో.. ఇవాళ ఆయన ప్రమాణ స్వీకారం ఉండదని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. మరోవైపు ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన ఎమ్మెల్యేల మద్దతు కోసం విజయ్ తన ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు సమాచారం. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ.. విజయ్ కు మద్దతు ప్రకటించడంతో పాటు తన ఐదుగురు ఎమ్మెల్యేలు ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా హైదరాబాద్ కు తరలించింది.
మరోవైపు తమిళనాడు ముఖ్యమంత్రిగా ఇవాళ విజయ్ ప్రమాణ స్వీకారం చేస్తారని టీవీకే పార్టీ ఎమ్మెల్యే మేరి విల్సన్ మాత్రం ఆశాభావం వ్యక్తం చేశారు. విజయ్ ఈ ఐదేళ్లకే కాకుండా.. భవిష్యత్తులోనూ ముఖ్యమంత్రిగా కొనసాగుతారని పేర్కొన్నారు. తమకు మద్దతు ప్రకటించిన కాంగ్రెస్, వామపక్ష పార్టీలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కాగా, ఎన్నికల ఫలితాల అనంతరం ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని విజయ్.. ఇప్పటివరకూ 3 సార్లు గవర్నర్ ను కలిశారు. అయినప్పటికీ గవర్నర్ నుంచి ఆ దిశగా చర్యలు లేకపోవడం పట్ల.. టీవీకే పార్టీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కేంద్రంలోని బీజేపీ గవర్నర్ ను అడ్డుపెట్టుకొని విజయ్ ప్రమాణ స్వీకారాన్ని అడ్డుకుంటోందని మండిపడుతున్నారు. మెుత్తం మీద విజయ్ సీఎంగా ప్రమాణం చేస్తారా? లేదా? అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.
Also Read: ఇథియోపియా మహిళ అరుదైన రికార్డు.. ఒక బిడ్డ కోసం వేడుకుంటే.. ఐదుగురు బిడ్డలతో మురిపించిన అదృష్టం!