Amazon Prime Video : ఓటీటీలలో టాప్ 10 ట్రెండింగ్ లిస్ట్ లో ఉన్న సినిమాలు ఎప్పుడూ అందరి దృష్టిని ఆకర్షిస్తాయి. కానీ ఆ ట్రెండింగ్ లిస్ట్ లోకి ఏ సినిమా, ఎప్పుడు వస్తుంది ? అన్నది మాత్రం సస్పెన్స్ అనే చెప్పాలి. చాలా వరకు కొత్త సినిమాలు, ఎక్కువ మంది చూస్తారు కాబట్టి ట్రెండింగ్ లో ఉంటాయి. కానీ కొన్ని పాత సినిమాలు కూడా అప్పుడప్పుడూ ట్రెండ్ అవుతూ ఉంటాయి. తాజాగా టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ నటించిన ఒక పాత మూవీ కూడా అలాగే ట్రెండ్ అవుతోంది. మరి ఆ మూవీ పేరేంటి ? ఇప్పుడు ట్రెండింగ్ లోకి రావడానికి గల కారణం ఏంటి ? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.
నిఖిల్ సిద్ధార్థ ప్రధాన పాత్రలో నటించిన తెలుగు పీరియడ్ వార్ యాక్షన్ డ్రామా ‘స్వయంభు’ టీజర్ తాజాగా విడుదలైంది. సంయుక్త, నిధి అగర్వాల్ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం భారీ స్థాయిలో తెరకెక్కుతోంది. టీజర్ విడుదలైన వెంటనే సోషల్ మీడియాలో భారీ బజ్ సృష్టించింది. నిఖిల్ యాక్షన్ లుక్, పీరియడ్ వార్ సీక్వెన్సెస్, భారీ విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకులను అబ్బురపరిచాయి. ఈ టీజర్ ను చూశాక చాలా మంది “నిఖిల్ కెరీర్ బెస్ట్” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు #SwayambhuTeaser అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్‌లోకి వచ్చింది. ఈ చిత్రం త్వరలోనే థియేటర్లలో విడుదల కానుంది.
Also Read : ఏడుగురు పిల్లల బాధ్యత ఒక్కడిపైనే… ఫ్యామిలీ అంతా కలిసి చూడాల్సిన కథ
నిఖిల్ మునుపటి చిత్రం ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ (Appudo Ippudo Eppudo – 2024) ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో ట్రెండింగ్ జాబితాలోకి ఎంట్రీ ఇచ్చింది. ఓటీటీలో ఇప్పుడు డ్రామా కేటగిరీలో 8వ స్థానంలో ఉంది. థియేటర్లలో విడుదలైన సమయంలో పేలవ ప్రదర్శన కనబరిచిన ఈ చిత్రం ఓటీటీలో కూడా మొదట్లో పెద్దగా ప్రభావం చూపలేదు. కానీ ‘స్వయంభు’ టీజర్ విడుదల తర్వాత నిఖిల్ పాత చిత్రాల పట్ల ఆడియన్స్ కు ఆసక్తి పెరిగింది.
సుధీర్ వర్మ దర్శకత్వం వహించిన ఈ రొమాంటిక్ డ్రామాలో నిఖిల్ సిద్ధార్థ ప్రధాన పాత్రలో నటించాడు. రుక్మిణి వసంత్ టాలీవుడ్ లో అరంగేట్రం చేసింది. కథ ఒక యువకుడి జీవితంలో జరిగే భావోద్వేగ మలుపుల చుట్టూ తిరుగుతుంది. అతని ప్రేమ, కలలు, కుటుంబ బాధ్యతలు, సమస్యలు… ఇవన్నీ సహజంగా, ఎమోషనల్‌గా చూపించారు. సినిమాలో నిఖిల్ నటన, రుక్మిణి సౌమ్యత, సుధీర్ వర్మ డైరెక్షన్ కు మంచి మార్కులు పడ్డాయి. కానీ రొటీన్ కథ కావడం, ప్రమోషన్లు సరిగ్గా చేయకపోవడంతో అసలు ఈ మూవీ ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు పోయిందో కూడా ఎవ్వరికీ తెలియకుండా పోయింది. ఇక విడుదలైన ఇన్ని రోజుల తరువాత ఈ మూవీ ట్రెండ్ కావడం చూస్తుంటే, ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ మూవీకి ఇన్నాళ్ళకి మంచి రోజులు వచ్చినట్టు కన్పిస్తోంది. మరి ఈ మూవీ వ్యూస్ పరంగా ఏమైనా రికార్డులు క్రియేట్ చేస్తుందా ? అన్నది ఆసక్తికరంగా మారింది.