Tamil Social Drama: చదువుకోవాలనే ఓ చిన్నారి కోరిక… ఆమెను ఏకంగా జిల్లా కలెక్టర్ దగ్గరకు తీసుకెళ్తే ? అడవుల్లో నివసించే ఓ గిరిజన సమాజానికి విద్య అందించాలనే ఆ చిన్నారి కల కోసం ఓ అధికారి మొత్తం వ్యవస్థతోనే పోరాడితే ? దారిద్య్రం, అణచివేత, రాజకీయ ఒత్తిళ్ల మధ్య ఓ పాఠశాలను నిర్మించేందుకు జరిగే పోరాటమే ‘అరుళ్వాన్’ (Arulvaan). 1990ల నేపథ్యంతో నిజ జీవిత సంఘటనల స్ఫూర్తితో తెరకెక్కిన ఈ తమిళ సామాజిక డ్రామా భావోద్వేగంగా సాగుతుంది. మరి ఈ ఇంట్రెస్టింగ్ స్టోరీని ఏ ఓటీటీలో చూడవచ్చు ? స్టోరీ ఏంటి ? అనేది స్టోరీలో తెలుసుకుందాం పదండి.
తేని జిల్లా పరిధిలోని ఓ మారుమూల అటవీ ప్రాంతంలో ‘కాడర్’ అనే చిన్న గిరిజన తెగ జీవిస్తుంటుంది. అక్కడ కనీస సౌకర్యాలు కూడా ఉండవు. ముఖ్యంగా పిల్లలు చదువుకోవడానికి పాఠశాల ఉండదు. విద్య లేకపోవడంతో తమ సమాజంలోని ప్రజలు ఎదుర్కొంటున్న దోపిడీ, అణచివేతను చిన్నతనం నుంచే చూస్తుంటుంది కురింజి. చదువు ఉంటేనే తమ జీవితాలు మారతాయని నమ్మిన ఆ చిన్నారి ఎలాగైనా చదువుకోవాలని నిర్ణయించుకుంటుంది. కానీ తన ఊరిలో ఆ అవకాశం లేకపోవడంతో అడవిని దాటి బయట ప్రపంచంలోకి అడుగు పెడుతుంది.
అక్కడ ఆమెకు ఎదురయ్యేది మరో ప్రపంచం. భాష తెలియదు. చేతిలో డబ్బు లేదు. తోడుగా ఎవరూ లేరు. అయినా వెనక్కి తగ్గకుండా తన సమస్యను పరిష్కరించగల వ్యక్తి కోసం వెతుకుతూ తేని జిల్లా కలెక్టర్ ముత్తువేల్ ను చేరుకోవాలని ప్రయత్నిస్తుంది. చివరకు కురింజి కలెక్టర్ ముత్తువేల్ ను కలుస్తుంది. ఆ చిన్నారి పట్టుదల, ఆమె చెప్పిన కష్టాలు ఆయనను కదిలిస్తాయి. మొదట కురింజికి మాత్రమే చదువు చెప్పించే ఆలోచన వచ్చినా… ఆమె మాత్రం తన ఒక్కరి కోసం కాదు, అడవిలో ఉన్న పిల్లలందరికీ చదువు కావాలని కోరుకుంటుంది. దీంతో ముత్తువేల్ అక్కడే పాఠశాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుంటాడు.
అయితే నిర్ణయం తీసుకోవడం సులభమే, కానీ దాన్ని అమలు చేయడం అంత ఈజీ కాదు. గిరిజన ప్రాంతాన్ని ఆక్రమించుకోవాలని చూసే స్వార్థపరులు, రాజకీయ నాయకులు, అవినీతి వ్యవస్థ నుంచి కలెక్టర్ కు తీవ్ర ప్రతిఘటన ఎదురవుతుంది. ఒకవైపు అధికారిక అడ్డంకులు… మరోవైపు స్థానిక శక్తుల ఒత్తిళ్లు. అయినా పిల్లలకు విద్య అందించాలనే లక్ష్యంతో ముత్తువేల్ వెనక్కి తగ్గడు. చివరకు ఈ పోరాటంలో ఎవరు గెలిచారు ? కురింజి కల నిజమైందా ? ఆ అడవిలోని పిల్లలకు నిజంగానే పాఠశాల దొరికిందా ? ఇదే ‘అరుళ్వాన్’ కథలోని ప్రధాన భావోద్వేగం.
గణేష్ వినాయకన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అరుళ్‌నిధి కీలక పాత్రలో నటించారు. జి.వి. ప్రకాష్ కుమార్ అందించిన సంగీతం సినిమాకు మరో బలం. గిరిజనుల జీవన పరిస్థితులు, విద్య ప్రాధాన్యత, వ్యవస్థతో పోరాటం వంటి అంశాలను ఈ చిత్రంలో ప్రధానంగా చూపించారు. ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’ (Amazon Prime Video)లో ప్రేక్షకులు ఈ సినిమాను చూడవచ్చు. విదేశాల్లో ఉన్న ప్రేక్షకులకు ‘సింప్లీ సౌత్’ (Simply South)లో అందుబాటులో ఉంది. అయితే ప్రస్తుతం తెలుగు డబ్బింగ్ ఆడియో లేదు. ఒరిజినల్ తమిళ భాషలోనే చూడాల్సి ఉంటుంది. సామాజిక సమస్యలతో పాటు ఎమోషన్, హ్యూమన్ డ్రామా ఇష్టపడేవారికి ‘అరుళ్వాన్’ సినిమా మంచి ఛాయిస్ గా నిలుస్తుంది.
Read Also: 80ల నాటి తిరుగుబాటు, నెత్తురోడిన వీధులు… హిస్టరీని షేక్ చేసిన రియల్ ఇన్సిడెంట్స్