Family Drama OTT : పిల్లలను పెద్దలను ఎంతగానో అలరించిన సినిమా ‘ది మాస్క్’. 1994లో వచ్చిన ఈ సినిమాకు 2005లో సీక్వెల్ కూడా వచ్చింది. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వైఫల్యాన్ని చవిచూసింది. ఇందులో ఫస్ట్ పార్ట్ లో నటించిన జిమ్ క్యారీ లేకపోవడం, కథ బలహీనంగా ఉండటంతో విమర్శకులు దీనిని తీవ్రంగా విమర్శించారు. ఇది అత్యంత చెత్త సినిమాలకు ఇచ్చే ‘గోల్డెన్ రాస్ప్‌బెర్రీ అవార్డ్స్’ లో “Worst Remake or Sequel” అవార్డును కూడా పొందింది. అయితే ఇందులోని కార్టూన్ తరహా కామెడీ చిన్న పిల్లలను కొంతవరకు ఆకట్టుకుంది. మరి ఈ సినిమా ఎక్కడ ఉంది ? దీని కథ ఏమిటి ? అనే వివరాలపై ఓ లుక్ వేద్దాం పదండి.
2005లో వచ్చిన ఈ అమెరికన్ ఫాంటసీ ఫ్యామిలీ కామెడీ సినిమా పేరు ‘సన్ ఆఫ్ ది మాస్క్’ (Son of the Mask). ఇది 1994 నాటి సూపర్ హిట్ సినిమా ‘ది మాస్క్’కు సీక్వెల్. లారెన్స్ గూటర్‌మాన్ దర్శకత్వంలో ఇది తెరకెక్కింది. ఇందులో జేమీ కెన్నెడీ, అలాన్ కమింగ్, ట్రేలర్ హోవార్డ్, బాబ్ హోస్కిన్స్ లీడ్ రోల్స్ లో నటించారు. ప్రస్తుతం ఈ సినిమా యూట్యూబ్ లో అందుబాటులో ఉంది.
ఫ్రింజ్ సిటీలో టిమ్ ఏవరీ (జేమీ కెన్నెడీ) అనే వ్యక్తి ఒక యానిమేషన్ స్టూడియోలో పనిచేస్తుంటాడు. అతనికి తండ్రి కావాలని అస్సలు ఉండదు. ఒకరోజు అతని పెంపుడు కుక్కకి, ఒక వింతైన పచ్చటి మాస్క్ దొరుకుతుంది. అది మామూలు మాస్క్ కాదు. అల్లరి దేవుడు లోకీకి చెందిన మాయా మాస్క్. ఒక హాలోవీన్ పార్టీ కోసం టిమ్ ఆ మాస్క్ ధరిస్తాడు. ఆ మాస్క్ ప్రభావంతో అతను సూపర్ పవర్స్ ఉన్న ‘మాస్క్ మ్యాన్ ‘గా మారి పార్టీలో అందరినీ అలరిస్తాడు. అదే రాత్రి టిమ్ తన భార్య టన్యాతో కలిసున్నప్పుడు, ఆ మాస్క్ శక్తులు అతనిలోకి ప్రవేశిస్తాయి. దీనివల్ల వారికి పుట్టబోయే బిడ్డ అల్వీ, మాస్క్ శక్తులతోనే జన్మిస్తాడు.
ఇక చిన్నారి అల్వీ పుట్టుకతోనే అద్భుతమైన శక్తులు కలిగి ఉంటాడు. తండ్రి టిమ్ ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు అల్వీ చేసే అల్లరి పనులు అతన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. మరోవైపు తన ముసుగు పోయిందని లోకీ తండ్రి ఓడిన్ ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. ఎలాగైనా ఆ మాస్క్ వెనక్కి తీసుకురావాలని లోకీ భూమిపైకి వస్తాడు. మరి ఆ మాస్క్ ను లోకి తిరిగి పొందుతాడా ? ఈ క్లైమాక్స్ ఏంటి ? అనేది ఈ సినిమాని చూసి తెలుసుకోవాల్సిందే.