Feel Good Web Series: బాల్యాన్ని కళ్ళకు కట్టే సినిమాలు, సిరీస్ లు చాలా అరుదుగా వస్తూ ఉంటాయి. అందులోనే మనసుకు హత్తుకునే కథ ఉన్న కంటెంట్ ఉందంటే ఎవరైనా చూడకుండా ఎందుకు పక్కన పెడతారు చెప్పండి. కొన్ని రోజుల కిందట వచ్చిన ప్రతీ ఒక్కరి హృదయాన్ని టచ్ చేసి వెళ్ళిన ’90s ఎ మిడిల్ క్లాస్ బయోపిక్’ సిరీస్ అందరికీ గుర్తుండే ఉంటుంది. అచ్చం అలాంటి కామెడీ అండ్ ఫ్యామిలీ డ్రామానే ఈరోజు మన మూవీ సజెషన్. ఈ సిరీస్ పేరు ‘ఆదర్శ్ బాల్ విద్యాలయ’ (Adarsh Baal Vidyalaya)’.
ఢిల్లీ శివార్లలోని ‘తింకి తోలి’ అనే ప్రాంతంలో సరిగ్గా నడవని ఒక చెత్త ప్రభుత్వ పాఠశాల ఉంటుంది. దాని పేరే ఆదర్శ్ బాల్ విద్యాలయ. ఈ స్కూల్ నేపథ్యంతో సాగుతుంది. స్కూల్ హెడ్‌మాస్టర్ జ్ఞానేశ్వర్ త్రిపాఠి. ఎప్పుడూ చాలా రిలాక్స్‌గా, బాధ్యత లేకుండా కాలం వెళ్లదీస్తుంటాడు. అయితే, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి వెళ్లేందుకు ప్రభుత్వం ఒక ఉచిత శిక్షణా కార్యక్రమాన్ని ప్రకటిస్తుంది.
ఇంకేముంది కేవలం ఆ కేంబ్రిడ్జ్ ట్రిప్ కొట్టాలనే స్వార్థంతో, నగరంలోనే అత్యంత అధ్వాన్నమైన ప్రదర్శన కనబరుస్తున్న తన స్కూల్‌ను ఎలాగైనా బాగు చేయాలని అతను డిసైడ్ అవుతాడు. కానీ ఆ స్కూల్లో ఉన్న టీచర్లు ఎవరికి వారు యమునా తీరు అన్నట్లు ఉంటారు. విద్యార్థులకు చదువుపై శ్రద్ధ ఉండదు, టీచర్లకు పాఠాలు చెప్పాలనే ఉత్సాహం ఉండదు. ఇలాంటి పరిస్థితుల్లో ఆదర్శ భావాలున్న కాంచన్ అనే కొత్త టీచర్ స్కూల్లో జాయిన్ అవుతాడు. అతను వచ్చిన తర్వాత స్కూల్‌లో హంగామా మొదలవుతుంది.
పాఠశాలలో ఉన్న చెత్త సమస్యలు, విద్యార్థుల అల్లరి, టీచర్ల బాధ్యతారాహిత్యం… ఇవన్నీ జ్ఞానేశ్వర్ త్రిపాఠి జీవితాన్ని నరకంగా మారుస్తాయి. కానీ ఆ కేంబ్రిడ్జ్ ట్రిప్ కోసం మొదలైన అతని ప్రయత్నం నెమ్మదిగా నిజమైన బాధ్యతగా మారుతుంది. స్కూల్‌ను బాగు చేయడానికి అతను వాడిన పద్ధతులు, విద్యార్థులను మార్చడానికి చేసిన ప్రయత్నాలు చాలా కామెడిగా ఉంటాయి. ఈ క్రమంలోనే స్కూల్‌లోని విద్యార్థులతో పాటు టీచర్లు, తల్లిదండ్రులలోనూ మార్పులు వస్తాయి. మరి ఆ మార్పులు ఏంటి ? చివరకు హెడ్ మాస్టర్ కేంబ్రిడ్గ్ ట్రిప్ కు వెళ్లాడా ? చివరకు ఆ స్కూల్, అందులో చదువుతున్న విద్యార్థుల పరిస్థితి ఏంటి ? అన్నది తెలియాలంటే తాజాగా ఓటీటీలోకి వచ్చిన ఈ సిరీస్ పై ఒక లుక్కేయండి.
ఒక చెత్త ప్రభుత్వ పాఠశాలను బాగు చేయాలని ప్రయత్నించిన హెడ్‌మాస్టర్ కామెడీ కథే ఈ సిరీస్. ప్రభుత్వ పాఠశాలల స్థితిగతులు ఎంత దారుణంగా ఉంటాయో, వాటిని మార్చాలని ఒక వ్యక్తి చేసిన ప్రయత్నాలను ఎమోషనల్‌గా చూపించిన సోషల్ కామెడీ-డ్రామా వెబ్ సిరీస్ ‘ఆదర్శ్ బాల్ విద్యాలయ’. ‘పంచాయత్’, ‘కోటా ఫ్యాక్టరీ’ వంటి కల్ట్ సిరీస్‌లను అందించిన సమీర్ సక్సేనా, బిశ్వపతి సర్కార్ ఈ సిరీస్ ను క్రియేట్ చేశారు. హిమాంక్ గౌర్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ జూలై 24 నుండి Amazon Prime Videoలో తెలుగు ఆడియోతో స్ట్రీమింగ్ అవుతోంది.
Read Also: చిన్న పొరపాటుతో హెవెన్ లో ఎర్రర్… దేవుడితోనే డీల్ చేసుకునే క్రేజీ లాయర్