Horror Thriller movie on OTT : ఓటీటీలో ఒక లో బడ్జెట్ మూవీ తెగ భయపెడుతోంది. దీనిని The Haunting of Hill House, Oculus ఫేమ్ మైక్ ఫ్లానగన్ తెరకెక్కించారు. ఇది మామూలు దెయ్యం సినిమాల్లాగా టపా టపా మనుషులు చచ్చిపోవడం, గాల్లో ఎగరడం లాంటి హడావుడి ఉండే సినిమా కాదు. ఇది ఒక రకమైన సైకలాజికల్ థ్రిల్లర్. అంటే మన కళ్లముందు రక్తం ఏమీ పారదు, అయితే ఆ సినిమాలో చూపించే పాత సొరంగం చూస్తుంటేనే మనకు లోపల వణుకు పుడుతుంది. అసలు ఆ సొరంగం వెనుక ఏముంది? మనుషులు ఎందుకు మాయమైపోతున్నారు? అనే టెన్షన్ గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తుంది. అలాంటి గిలి పుట్టించే సినిమా ఇది.
మైక్ ఫ్లానగన్ దర్శకత్వం వహించిన ఈ అమెరికన్ సూపర్ నేచురల్ హారర్ చిత్రం పేరు ‘అబ్సెంటియా’ (Absentia). 2011లో వచ్చిన ఈ సినిమా తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కినప్పటికీ, అద్భుతమైన కథనంతో విమర్శకుల ప్రశంసలు పొందింది. మైక్ ఫ్లానగన్ ఈ సినిమాను తన సొంత అపార్ట్‌మెంట్‌లో, కేవలం తన స్నేహితులనే నటులుగా పెట్టుకుని 15 రోజుల్లో చిత్రీకరించారు. ఈ సినిమా బడ్జెట్‌లో ఎక్కువ భాగాన్ని ‘కిక్‌స్టార్టర్’ అనే వెబ్‌సైట్ ద్వారా ప్రజల దగ్గర నుంచి విరాళాలుగా సేకరించారు. పెద్ద పెద్ద సెట్లు, గ్రాఫిక్స్ లేకపోయినా, కేవలం ఒక పాత సొరంగంతో భయంకరమైన వాతావరణాన్ని సృష్టించవచ్చని ఈ సినిమా నిరూపించింది. ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా వివిధ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో దాదాపు 14 అవార్డులు వచ్చాయి. అతి తక్కువ ఖర్చుతో అత్యంత ప్రభావవంతమైన హారర్ సినిమా ఎలా తీయవచ్చో చెప్పడానికి ‘అబ్సెంటియా’ ఒక గొప్ప ఉదాహరణ. ఇది ప్రస్తుతం netflix, prime Video ఓటీటీలో అందుబాటులో ఉంది.
త్రిష అనే మహిళ తన భర్త డానియల్ తో కలసి జీవిస్తుండేది. అయితే ఏడు ఏళ్ల క్రితం ఇంటి నుండి బయటకు వెళ్లి అతను కనిపించకుండా పోతాడు. అతను ఎక్కడున్నాడో, ఏమయ్యాడో ఎవరికీ తెలియదు. ఏళ్లు గడిచినా అతను తిరిగి రాకపోవడంతో, త్రిష ఇక ఆశ వదులుకుని అతను చనిపోయాడని ప్రభుత్వానికి రిపోర్ట్ ఇవ్వాలని నిర్ణయించుకుంటుంది. సరిగ్గా అదే సమయంలో ఆమె చెల్లెలు కాలీ, అక్కకు తోడుగా ఉండటానికి ఇంటికి వస్తుంది. ఆ ఇంటి దగ్గర రోడ్డు కింద ఒక పాత సొరంగం ఉంటుంది. అది చూడటానికి చాలా భయంకరంగా, వింతగా ఉంటుంది. ఒకరోజు కాలీ ఆ సొరంగం దగ్గర ఒక అపరిచిత వ్యక్తిని చూస్తుంది. అతను చాలా భయపడుతూ, అక్కడ ఏదో వింత శక్తి ఉందని, అది తనను తీసుకెళ్లిపోతుందని ఏడుస్తూ ఉంటాడు.
ఆ తర్వాత కొన్ని రోజులకు, ఏడేళ్ల క్రితం మాయమైన త్రిష భర్త డానియల్ ఒక్కసారిగా ప్రత్యక్షమవుతాడు. కానీ అతను మాట్లాడలేని స్థితిలో, విపరీతమైన భయంతో ఉంటాడు. ఆ సొరంగం గోడల మధ్య ఏదో భయంకరమైన వింత శక్తి ఉందని, అది తనను ఇన్నాళ్లూ బందీగా ఉంచిందని వాళ్లకు అర్థమవుతుంది. ఆ సొరంగంలో ఉండే శక్తికి మనుషులను వేటాడి, తన లోకానికి తీసుకెళ్లిపోవడం అలవాటు అని వాళ్లు తెలుసుకునే లోపే పరిస్థితి చేయి దాటిపోతుంది. డానియల్‌ను మళ్లీ ఆ శక్తి లాగేసుకుంటుంది. చివరికి త్రిష కూడా ఆ వింత శక్తికి చిక్కి అదృశ్యమవుతుంది. పోలీసులు ఇవన్నీ నమ్మకుండా, కాలీ మీద అనుమానం పెంచుకుంటారు. చివరికి ఆ వింత శక్తి నుంచి వీళ్ళు బయట పడ్డారా ? ఈ క్లైమాక్స్ ఏమిటి ? అనే విషయాలను ఈ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.
Read Also : ఫ్యామిలీ దాచిన సీక్రెట్స్.. గతం తవ్వితే బయటపడిన నమ్మలేని నిజాలు… ఇది మామూలు కథ కాదు