Romería Movie on OTT : ఎమోషన్ తో సాగే ఒక ఫ్యామిలీ డ్రామా, గత ఏడాది ఫ్యామిలీ ఆడియన్స్ చేత కన్నీళ్ళు పెట్టించింది. ఇది ఒక కల్తీ లేని ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా. కంటికి కట్టినట్టు నిజంగా జరిగినట్టే చూపించే పక్కా రియలిస్టిక్ సినిమా. చిన్నప్పుడే తల్లిదండ్రులను పోగొట్టుకున్న ఒక అమ్మాయి, తన మూలాలను వెతుక్కునే క్రమంలో ఈ కథ జరుగుతుంది. 1980ల కాలంలో డ్రగ్స్, ఏయిడ్స్ లాంటి జబ్బులు ఒక సంసారాన్ని ఎట్లా ఆగం చేశాయో, సమాజం వాళ్లను ఎట్లా తక్కువ చేసి చూసిందో కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది ఈ మూవీ. ఈ సినిమా మనసును బరువెక్కించే ఒక సీరియస్ జర్నీ లాంటిది.
2025లో వచ్చిన ఈ స్పానిష్-జర్మన్ డ్రామా మూవీ పేరు ‘రొమేరియా’ (Romería). దీనికి ప్రసిద్ధ దర్శకురాలు కార్లా సైమన్ దర్శకత్వం వహించారు. ఇందులో లూసియా గార్సియా (మెరీనా పాత్రలో) లీడ్ రోల్ లో నటించారు. దర్శకురాలు కార్లా సైమన్ తన సొంత జీవిత అనుభవాల ఆధారంగా రూపొందించిన మూడు సినిమాల సిరీస్‌లో (ట్రైలజీ) ఇది చివరి చిత్రం. సుమారు 30 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాను స్పెయిన్‌లోని అందమైన సముద్ర తీర ప్రాంతమైన ‘గలీసియా’లో చిత్రీకరించారు. ఈ చిత్రం 2025 కాన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో అత్యున్నత పురస్కారమైన ‘పామ్ డి ఓర్’ కోసం పోటీపడి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ముఖ్యంగా మెరీనా పాత్రలో నటించిన లూసియా గార్సియా నటనకు మంచి గుర్తింపు లభించింది. స్పెయిన్ ప్రతిష్టాత్మక ‘గోయా అవార్డ్స్’లో కూడా ఈ సినిమా పలు విభాగాల్లో నామినేషన్లు దక్కించుకుంది. 2025 సెప్టెంబర్ లో రిలీజ్ అయిన ఈ సినిమా Moviestar Plusలో అందుబాటులో ఉంది.
మెరీనా అనే పద్దెనిమిదేళ్ల అమ్మాయి చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోతుంది. ఆమె తల్లి రాసుకున్న పాత డైరీ ఒకటి మెరీనాకు దొరుకుతుంది. ఆ డైరీ చదివాక, తన తండ్రి తరపు కుటుంబం గురించి తెలుసుకోవాలనే కోరికతో ఆమె గలీసియా అనే ప్రాంతానికి ప్రయాణమవుతుంది. తన మూలాలను వెతుక్కుంటూ అస్సలు పరిచయం లేని బంధువుల దగ్గరికి వెళ్లడమే ఈ కథలో మొదటి అడుగు. అయితే అక్కడికి వెళ్ళాక ఆమెకు చేదు అనుభవాలే ఎదురవుతాయి. 1980ల కాలంలో తన తల్లిదండ్రులు డ్రగ్స్, హెచ్. ఐ. వి బారిన పడటంతో, సమాజం వాళ్ళని ఎలా చిన్నచూపు చూసిందో మెరీనాకు అర్థమవుతుంది. ఆ పాత విషయాలను చర్చించడం అక్కడి బంధువులకు ఇష్టం ఉండదు. కానీ మెరీనా మాత్రం వెనక్కి తగ్గకుండా తన తల్లిదండ్రుల అసలు జీవితం ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఇప్పుడు మెరీనా కేవలం వాళ్ళ ట్రాజీడీ మాత్రమే కాకుండా, తన తల్లిదండ్రుల మధ్య ఉన్న ప్రేమను కూడా గుర్తిస్తుంది. చివరకు తనకంటూ ఒక గుర్తింపును ఏర్పరచుకోవడంతో ఈ ఎమోషనల్ డ్రామా ముగుస్తుంది.
Read Also : 1 గంట 56 నిమిషాల ఈ థ్రిల్లర్ లో చివరి వరకు హంతకుడిని కనిపెట్టలేరు