Action Thriller: ప్రపంచంలోని పేద దేశాలకూ అందుబాటులో ఉండేలా తక్కువ ఖర్చుతో స్వచ్ఛమైన ఇంధనాన్ని తయారు చేయగలిగితే… కోట్లాది మంది జీవితాలు మారిపోతాయి. అలాంటి అద్భుతమైన సాంకేతికతను ఓ శాస్త్రవేత్త కనిపెడతాడు. కానీ ఆ ఆవిష్కరణతో ప్రపంచానికి మేలు చేయాల్సిన కంపెనీ, దాన్ని ఆయుధాల తయారీకి ఉపయోగించాలని చూస్తుంది. దీంతో ఆ శాస్త్రవేత్త తన పరిశోధనను కాపాడుకోవడానికి అన్నీ వదిలేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోతాడు. అయితే అతడిని వెతుక్కుంటూ ఓ ప్రమాదకరమైన బృందం రావడంతో పరిస్థితులు పూర్తిగా మారిపోతాయి. ఇదే 2025లో వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ ‘ఆఫ్ ద గ్రిడ్’ (Off the Grid) కథ. మరి ఈ సినిమాను ఏ ఓటీటీలో చూడొచ్చు ? అంటే…
జాక్ గై ఓ తెలివైన శాస్త్రవేత్త. ప్రపంచవ్యాప్తంగా ఇంధన సమస్యను తగ్గించాలనే లక్ష్యంతో తక్కువ ఖర్చుతో శక్తిని ఉత్పత్తి చేయగల సాంకేతికతను అభివృద్ధి చేస్తాడు. ఈ ఆవిష్కరణను వాణిజ్యపరంగా అందుబాటులోకి తీసుకురావడానికి బెల్కోర్ అనే వ్యాపారవేత్తకు చెందిన కంపెనీతో కలిసి పని చేస్తాడు. రానిష్ అనే మరో ఇంజినీర్ కూడా ఈ ప్రాజెక్టులో భాగంగా ఉంటాడు.
అయితే జాక్ ఊహించని విషయం ఒకటి బయట పడుతుంది. బెల్కోర్ ఈ సాంకేతికతను ప్రజలకు ఉపయోగపడేలా చేయాలనే ఉద్దేశంతో లేడు. దాన్ని ఆయుధాల తయారీకి ఉపయోగించి భారీగా డబ్బు సంపాదించాలని చూస్తాడు. తన ఆవిష్కరణ వల్ల ప్రాణనష్టం జరిగే ప్రమాదం ఉందని గ్రహించిన జాక్, కంపెనీతో సంబంధాలు తెంచుకుంటాడు. తన పరిశోధనను వారి చేతుల్లో పడకుండా కాపాడుకోవడానికి గుర్తింపును మార్చుకుని యూరప్ లోని ఓ చిన్న గ్రామం సమీపంలో ఉన్న అడవిలో ఓ క్యాబిన్ లో ఒంటరిగా జీవించడం మొదలు పెడతాడు.
అక్కడ జాక్ ప్రశాంతమైన జీవితం గడుపుతుంటాడు. స్థానికులకు అవసరమైనప్పుడు సాయం చేస్తూ, తెలివైన యువకుడు చేజ్ కు చదువులో మార్గనిర్దేశం చేస్తుంటాడు. జోసీ అనే స్థానిక మహిళతోనూ అతడికి పరిచయం ఏర్పడుతుంది. గత జీవితాన్ని మర్చిపోయి సాధారణ వ్యక్తిలా బతకాలని జాక్ ప్రయత్నిస్తుంటాడు. కానీ అతడి పాత కంపెనీ మాత్రం అతడిని వదిలిపెట్టదు.
బెల్కోర్ ఆదేశాలతో మార్కస్ నాయకత్వంలో ఓ బృందం ఆయుధాలతో జాక్ ను పట్టుకోవడానికి వస్తుంది. వాళ్లకు జాక్ ఎక్కడున్నాడో తెలిసిపోవడంతో అతడి ప్రశాంతమైన జీవితం ఒక్కసారిగా ప్రమాదంలో పడుతుంది. అయితే జాక్ కేవలం శాస్త్రవేత్త మాత్రమే కాదు. తెలివితేటలతో పాటు పోరాట నైపుణ్యాలు కూడా ఉన్న వ్యక్తి. తనను పట్టుకోవడానికి వచ్చిన వారిని ఎదుర్కొని అక్కడి నుంచి తప్పించుకుంటాడు. ఈ క్రమంలో చేజ్, జోసీ అతడికి అండగా నిలుస్తారు.
మొదటి ప్రయత్నం విఫలం కావడంతో కంపెనీ మరో బృందాన్ని పంపిస్తుంది. ఈసారి జాక్ ఆలోచనా విధానం బాగా తెలిసిన రానిష్ కూడా ఆ ఆపరేషన్ లో పాల్గొంటాడు. అడవిలో మొదలైన ఈ పోరాటం మరింత తీవ్రంగా మారుతుంది. జాక్ స్థానికుల సహాయంతో ప్రత్యర్థులను ఒక్కొక్కరినీ ఎదుర్కొంటాడు. చివరకు రానిష్ ను మినహాయించి మిగతా వారిని మట్టుబెట్టి, తాను చనిపోయినట్లు నమ్మించే పథకం అమలు చేస్తాడు. బెల్కోర్ మాత్రం రానిష్ ను అదుపులోకి తీసుకుని, ఆవిష్కరణను తన సొంతం చేసుకోవాలని చూస్తాడు. జాక్, జోసీ మరోసారి అజ్ఞాతంలోకి వెళ్ళిపోతారు. మరి ఆ తర్వాత ఏమైంది ? చివరికి జరిగింది ఏంటి ? అనేది తెలియాలంటే సినిమాను చూడాల్సిందే.
జానీ మార్టిన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో జోష్ డుహామెల్, గ్రెగ్ కిన్నియర్, పీటర్ స్టార్మేర్, మారియా ఎలిసా కాంపర్గో కీలక పాత్రల్లో నటించారు. శాస్త్రీయ ఆవిష్కరణను ఆయుధంగా మార్చాలనుకునే కార్పొరేట్ శక్తులకు ఎదురొడ్డి నిలిచే వ్యక్తి కథ ఇది. ఈ సినిమా జియో హాట్‌స్టార్ (Jio Hotstar)లో, అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లోనూ అందుబాటులో ఉంది. ఇంగ్లీష్‌తో పాటు హిందీ ఆడియో కూడా ఉంది. కార్పొరేట్ కుట్రలతో కూడిన యాక్షన్ థ్రిల్లర్లు ఇష్టపడే వారికి ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది.
Read Also: దొంగతనానికి వెళ్లి మనుషుల్ని కోసి అమ్ముకునే గ్యాంగ్ చేతిలో బుక్… IMDbలో 8.7 రేటింగ్