Crime Thriller Series OTT : ఓటీటీలో ఒక క్రైమ్ మిస్టరీ సిరీస్ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఇది ఇప్పటివరకు మొత్తం 19 సీజన్లు పూర్తి చేసుకుంది. ఈ కెనడియన్ టెలివిజన్ సిరీస్ చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలిచింది. 1890 కాలం నేపథ్యంలో ఈ స్టోరీ సాగుతుంటుంది. అప్పట్లో పోలీసులు దొంగలను పట్టుకోవడానికి కేవలం లాఠీ దెబ్బలనే నమ్ముకుంటే, హీరో మాత్రం చదువుకున్న తెలివితో.. వేలిముద్రలు చూడటం, రక్తపు చుక్కలను కనిపెట్టడం, వింత వింత మెషిన్లు తయారు చేయడం లాంటివి చేసి నేరగాళ్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తుంటాడు. ప్రతి ఎపిసోడ్‌లో ఒక కొత్త మర్డర్ మిస్టరీ, దాని వెనుక ఉన్న దొంగను హీరో తన సైన్స్ నాలెడ్జ్ తో ఎలా పట్టుకున్నాడనేదే ఈ సిరీస్ అసలు మజా. పాతకాలపు బిల్డింగులు, గుర్రాలు, ఆ కాలపు బట్టలు చూస్తుంటే మనం కూడా ఆ కాలంలోకి వెళ్ళిపోయినట్టే ఉంటుంది. దీనికి ఐయండిబిలో 8.2 రేటింగ్ ఉందంటే సిరీస్ లో ఎంత మ్యాటర్ ఉందో ఇట్టే తెలిసిపోతోంది.
ఈ కెనడియన్ క్రైమ్ మిస్టరీ డ్రామా సిరీస్ పేరు ‘మర్డోక్ మిస్టరీస్’ (Murdoch Mysteries). 2008 జనవరి 20న మొదటి సీజన్ 13 ఎపిసోడ్‌లతో రిలీజ్ అయింది. ఇది హిట్ కావడంతో ఇప్పటి దాకా ఏకంగా 19 సీజన్లను తీసుకొచ్చారు. చివరిది అంటే 19వ సీజన్, 2025 అక్టోబర్ 6న ప్రీమియర్ అయింది. ఈ సీజన్‌కు సంబంధించిన ఎపిసోడ్‌లు మార్చి 2026 వరకు ప్రసారమయ్యాయి. విశేషమేమిటంటే ఈ షో ప్రజాదరణను దృష్టిలో ఉంచుకుని 20వ సీజన్ కోసం కూడా సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ సిరీస్ ఎంతటి ప్రజాదరణ పొందిందంటే, ఇది కెనడియన్ టెలివిజన్ చరిత్రలోనే అత్యధిక కాలం నడుస్తున్న డ్రామాల్లో ఒకటిగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా వందకు పైగా దేశాల్లో ప్రసారమవుతూ, కోట్లాది మంది అభిమానులను సంపాదించుకుంది. 2008లో ఒక చిన్న నవల ఆధారంగా మొదలై, నేడు అనేక అవార్డులను గెలుచుకుంటూ.. సైన్స్ ఫిక్షన్, హిస్టారికల్ డ్రామా ఇష్టపడే వారికి ఒక మస్ట్ వాచ్ సిరీస్‌గా మారింది. భారతదేశంలో ఈ సిరీస్ సీజన్ 1 నుండి సీజన్ 19 వరకు Prime Video లో స్ట్రీమ్ అవుతున్నాయి.
ఈ కథ 1890వ దశకంలో కెనడాలోని టొరంటో నగర నేపథ్యంలో సాగుతుంది. ప్రధాన పాత్ర అయిన డిటెక్టివ్ విలియం మర్డోక్ తన కాలం కంటే చాలా ముందున్న తెలివితేటలు కలిగిన వ్యక్తి. అప్పట్లో పోలీసులు నేరస్తులను పట్టుకోవడానికి కేవలం పాత పద్ధతులనే వాడేవారు. కానీ మర్డోక్ మాత్రం సైన్స్‌ను నమ్ముతాడు. వేలిముద్రలు సేకరించడం, రక్త నమూనాలను పరీక్షించడం వంటి వినూత్న పద్ధతులను కనిపెట్టి, ఎవ్వరికీ అంతుచిక్కని క్లిష్టమైన కేసులను చాలా చాకచక్యంగా ఛేదిస్తుంటాడు.
ఇక మర్డోక్‌కు తన వృత్తిలో డాక్టర్ జూలియా ఓగ్డెన్, కానిస్టేబుల్ జార్జ్ క్రాబ్‌ట్రీ వెన్నుదన్నుగా ఉంటారు. డాక్టర్ జూలియా చనిపోయిన శవాలను పరీక్షించి ఫోరెన్సిక్ రిపోర్టులు ఇస్తే, క్రాబ్‌ట్రీ తన వింత వింత ఆలోచనలతో మర్డోక్‌కు కేసుల్లో సాయం చేస్తుంటాడు. వీరిద్దరితో పాటు మర్డోక్ బాస్ అయిన ఇన్‌స్పెక్టర్ బ్రాకెన్‌రీడ్ కూడా ఉంటాడు. మొదట్లో మర్డోక్ చేసే సైన్స్ ప్రయోగాలను ఇన్‌స్పెక్టర్ నమ్మకపోయినా, అవి ఇచ్చే ఫలితాలను చూసి చివరికి మర్డోక్ పద్ధతులనే గౌరవిస్తాడు. ఇలా ప్రతి ఎపిసోడ్‌లో ఒక కొత్త మిస్టరీ, ఆ కాలపు టెక్నాలజీతో మర్డోక్ చేసే ఇన్వెస్టిగేషన్ ప్రేక్షకులకు చాలా ఆసక్తిని కలిగిస్తాయి.
Read Also : రెండువందల ఏళ్ల రాక్షసుడితో కాంట్రాక్ట్ మ్యారేజ్… ప్రతి ఎపిసోడ్ పిచ్చెక్కించే రొమాంటిక్ సిరీస్