Our House Horror Movie OTT : విద్యుత్ లేకుండా ప్రపంచాన్ని ఊహించడం కష్టం. కానీ వైర్లు లేకుండానే అపరిమిత విద్యుత్‌ను అందించే ఒక యంత్రం ఉంటే ఎంత బాగుంటుందో కదా. అయితే అదే ప్రయోగం అనుకోకుండా చనిపోయిన ఆత్మలకు తలుపులు తెరిస్తే మరింత సూపర్ కదా.. ఇలా సైన్స్, హారర్, భావోద్వేగాలను కలిపి రూపొందించిన సూపర్ నేచురల్ థ్రిల్లరే అవర్ హౌస్ (Our house). 2018లో విడుదలైన ఈ కెనడియన్ సైన్స్ ఫిక్షన్ హారర్ చిత్రానికి ఆంథోనీ స్కాట్ బర్న్స్ దర్శకత్వం వహించాడు. థామస్ మాన్, నికోలా, పర్సీ హైన్స్ వైట్ ప్రధాన పాత్రల్లో నటించారు. ప్రస్తుతం ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. సాధారణ దెయ్యాల సినిమాలకు భిన్నంగా సైన్స్ కాన్సెప్టును హారర్‌తో మిక్స్ చేసిన విధానం ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా నిలబెట్టింది.
కథలో ఈథన్ అనే యువ శాస్త్రవేత్త తన తల్లిదండ్రులను ఒక ప్రమాదంలో కోల్పోతాడు. ఆ విషాదం నుంచి ఇంకా కోలుకోకముందే తన తమ్ముడు, చెల్లెలి బాధ్యత కూడా అతని భుజాలపై పడుతుంది. ఈ సమయంలో అతను ఒక అసాధారణమైన ప్రాజెక్టుపై పని చేస్తుంటాడు. వైర్లు అవసరం లేకుండా విద్యుత్ శక్తిని ప్రసారం చేసే ఒక యంత్రాన్ని రూపొందించడానికి ప్రయత్నిస్తాడు. చాలా కష్టాల తర్వాత ఆ ప్రయోగం విజయవంతమవుతుంది. మొదట్లో ఇది ఒక అద్భుత ఆవిష్కరణలా కనిపిస్తుంది. కానీ కొద్ది రోజులకే ఇంట్లో వింత సంఘటనలు ప్రారంభమవుతాయి. ఎవరూ లేని గదుల్లో శబ్దాలు వినిపించడం, వస్తువులు కదలడం, చనిపోయిన వ్యక్తులు కనిపించినట్టు అనిపించడం మొదలవుతుంది.
మొదట ఈథన్ కుటుంబ సభ్యులు వీటిని తమ ఊహలేనని భావిస్తారు. కానీ పరిస్థితులు క్రమంగా భయంకరంగా మారుతాయి. ఆ యంత్రం ద్వారా కేవలం విద్యుత్ మాత్రమే కాకుండా మరో ప్రపంచంతో సంబంధం ఏర్పడిందనే అనుమానం మొదలవుతుంది. ఆ తర్వాత బయటపడే నిజాలు కథను పూర్తిగా మరో స్థాయికి తీసుకెళ్తాయి. సినిమా బలం దాని వాతావరణం. భారీ జంప్ స్కేర్స్ కంటే నెమ్మదిగా పెరిగే భయం, ఇంటి చుట్టూ ఏర్పడే రహస్యమైన పరిస్థితులు ప్రేక్షకులను కథలోకి లాగేస్తాయి. అదే సమయంలో కుటుంబ బంధాలు, తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల భావోద్వేగాలను కూడా హృదయానికి హత్తుకునేలా చూపించారు.
అవర్ హౌస్ కేవలం దెయ్యాల సినిమానే కాకుండా.. ప్రేమించిన వారిని కోల్పోయిన బాధ, వారిని తిరిగి చూడాలనే తపన, సైన్స్ కు ఉన్న హద్దులు వంటి అంశాలను కూడా ప్రశ్నించే చిత్రం. అందుకే ఇది సాధారణ హారర్ మూవీ కంటే ఎక్కువగా కనెక్ట్ అవుతుంది. సైన్స్ ఫిక్షన్, సూపర్ నేచురల్ హారర్, మిస్టరీ థ్రిల్లర్లు ఇష్టపడేవారికి అవర్ హౌస్ ఒక మంచి ఎంపిక. కరెంట్ తో పాటు చీకటి ప్రపంచం కూడా ఇంట్లోకి వస్తే ఏమవుతుందో తెలుసుకోవాలంటే ఈ సినిమాను తప్పకుండా చూడాల్సిందే.