School Origin: ఈ రోజుల్లో పిల్లల్ని ఉదయాన్నే నిద్రలేపి స్కూల్‌కి పంపించడమంటే తల్లిదండ్రులకు ఒక పెద్ద యుద్ధమే. “అసలు ఈ స్కూల్ అనేదాన్ని ఎవడు కనిపెట్టాడ్రా బాబూ?” అని పిల్లలు తిట్టుకోవడం మనం రోజూ చూస్తూనే ఉంటాం. కానీ, ఈ రోజు మనం ‘స్కూల్’ అని పిలుస్తున్న ఈ పదానికి వందల ఏళ్ల చరిత్ర ఉందన్న విషయం మీకు తెలుసా? అసలు ఈ పదం ఎక్కడి నుంచి వచ్చింది? ఎలా పుట్టింది? దీని వెనుక ఉన్న అసలు కథేంటో తెలిస్తే మీరు ముక్కున వేలేసుకుంటారు.
ప్రస్తుతం ఇంగ్లీష్‌లో వాడుతున్న School అనే పదం కూడా సరిగ్గా అలాంటిదే. ఇది ప్రాచీన గ్రీకు పదమైన “స్కోలే” (Scholē) నుంచి పుట్టింది. అయితే ఇక్కడే ఒక మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ ఉంది! గ్రీకు భాషలో “స్కోలే” అంటే అర్థం ఏంటో తెలుసా? “విశ్రాంతి సమయం”లేదా “ఖాళీ సమయం” (Leisure Time). వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది అక్షరాలా నిజం! పూర్వకాలంలో గ్రీస్ దేశంలో ప్రజలు తమ రోజువారీ కష్టమైన పనులన్నీ ముగించుకున్నాక, దొరికిన ఖాళీ సమయంలో ఒకచోట ప్రశాంతంగా కూర్చునేవారు. అలా కూర్చుని లోకాభిరామాయణం మాట్లాడుకుంటూ, తత్వశాస్త్రం, విజ్ఞానం, సమాజం గురించి చర్చించుకుంటూ జ్ఞానాన్ని సంపాదించేవారట. అలా ఖాళీ సమయంలో జ్ఞానాన్ని పంచుకునే ఆ అలవాటే, కాలక్రమేణా “ఉపన్యాసాలు జరిగే స్థలం” గా, ఆ తర్వాత “విద్యాభ్యాసం” చేసే చోటుగా మారిపోయింది.
also read :ఒక్క రోజుకే 35 కోళ్లు, 90 కేజీల బియ్యం.. ఈ ఫ్యామిలీ రేషన్ లిస్ట్ చూస్తే షాక్ అవుతారు!
కాలం మారుతున్న కొద్దీ ఈ పదం కూడా రకరకాల భాషల్లో రూపం మార్చుకుంటూ ప్రయాణించింది. గ్రీకు భాషలో ‘స్కోలే’ గా ఉన్న ఈ పదం.. లాటిన్ భాషలోకి వచ్చేసరికి ‘స్కోలా’ (Schola) గా మారింది. ఆ తర్వాత పాత ఇంగ్లీష్ లో ‘స్కోల్’ (Scol) గా రూపాంతరం చెంది, చివరికి ఆధునిక ఇంగ్లీష్‌లో మనం నిత్యం పిలుచుకునే ‘స్కూల్’ (School) గా స్థిరపడిపోయింది. అంటే దీన్నిబట్టి చూస్తే, మనం అంత సీరియస్‌గా ఫీలయ్యే ‘స్కూల్’ అనే పదానికి అసలు సిసలైన అర్థం.. “ప్రశాంతమైన ఖాళీ సమయంలో జ్ఞానాన్ని సంపాదించే స్థలం”
ఇంగ్లీష్ పదం కథ ఇలా ఉంటే, మరి మన తెలుగు రాష్ట్రాల్లో వాడే పదాల ముచ్చట చాలా ప్రత్యేకం. మన దగ్గర స్కూల్‌ను సాధారణంగా ‘బడి’ అని, అధికారికంగా ‘పాఠశాల’ అని పిలుస్తుంటాం. చాలామంది ఇవి కూడా ఇంగ్లీష్ సంస్కృతి నుంచే వచ్చాయేమో అనుకుంటారు కానీ అది ముమ్మాటికీ తప్పు. ‘బడి’ అనేది ఇంగ్లీష్ స్కూల్ నుంచి వచ్చిన పదం అస్సలు కాదు. ఇది మన తెలుగు భాషలో చాలా కాలంగా వాడుకలో ఉన్న ఒక స్వదేశీ అచ్చ తెలుగు పదం అని భాషావేత్తలు స్పష్టం చేస్తున్నారు.
also read :ఒకప్పుడు ఓకే.. ఇప్పుడైతే తప్పా?…జాన్వీ ఇష్యూపై సీనియర్ నటి షాకింగ్ కామెంట్స్
పూర్వకాలంలో గురువులు తమ ఇంటి అరుగుల మీదో, చెట్ల కింద ఖాళీ స్థలాల్లోనో పిల్లలను కూర్చోబెట్టి అక్షరాలు, లెక్కలు నేర్పించేవారు. ఆ చదువు సాగే ప్రదేశాన్ని, చదువు చెప్పే స్థలాన్ని ప్రజలు సహజంగానే ‘బడి’ అని పిలవడం ప్రారంభించారు. తరాలు మారినా ఈ పదం ఇప్పటికీ మన నిత్య జీవితంలో అంతే సహజంగా వాడుకలో కొనసాగుతోంది.
అయితే మనం బోర్డుల మీద, ప్రభుత్వ ఉత్తర్వుల్లో చూసే ‘పాఠశాల’ అనేది సంస్కృత భాషా మూలాలు ఉన్న ఒక అధికారిక పదం. దీన్ని విడదీసి చూస్తే.. ‘పాఠం’ అంటే చదువు లేదా విద్య అని, ‘శాల’ అంటే ఇల్లు లేదా ఒక నిర్దేశిత స్థలం అని అర్థం వస్తుంది. అంటే ప్రజల నిత్య వాడుకలో ఉన్న స్వచ్ఛ తెలుగు పదం ‘బడి’ అయితే, సంస్కృత మూలం ఉన్న అధికారిక పదం ‘పాఠశాల’. మొత్తానికి ఇంగ్లీష్ వాళ్ల ‘స్కూల్’ కి విశ్రాంతి అనే అర్థం ఉంటే.. మన తెలుగు ‘బడి’ కి మాత్రం చదువు నేర్చుకునే పవిత్రమైన స్థలం అనే గౌరవం ఉంది. ఇదండీ మన స్కూల్ వెనుక ఉన్న క్రేజీ హిస్టరీ! ఈ ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేసి, వాళ్లకూ ఈ సీక్రెట్ చెప్పేయండి!