Malayalam OTT Movie : ఫ్రీగా ల్యాప్ టాప్ ఇస్తామని చెబితే ఎవరైనా సంతోషపడతారు. ఫోన్, ఇంటర్నెట్, టెక్నాలజీ ప్రజల జీవితాలను మరింత హ్యాపీ, ఈజీ చేస్తాయని చాలామంది నమ్ముతారు. కానీ అదే టెక్నాలజీ ఒకరోజు మీ ఫోన్ కెమెరా ద్వారా మిమ్మల్ని గమనిస్తే? మీ వ్యక్తిగత వీడియోలు, మెసేజ్‌లు, రహస్యాలు ఎవరో చూస్తూ ఉంటే? అంతకంటే భయంకరంగా వాటిని రాజకీయ ప్రయోజనాల కోసం, బ్లాక్ మెయిల్ కోసం ఉపయోగిస్తే? ఈ ఆలోచనే వెన్నులో వణుకు పుట్టించేలా చేసే స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘పేట్రియట్’.
ప్రముఖ దర్శకుడు మహేష్ నారాయణన్ తెరకెక్కించిన ఈ సినిమాలో భారతీయ సినిమా దిగ్గజాలు మమ్ముట్టి, మోహన్ లాల్, ఫహాద్ ఫాసిల్ ప్రధాన పాత్రల్లో నటించారు. నయనతార, రేవతి, కుంచాకో బోబన్, రాజీవ్ మీనన్ ఇతర కీలక పాత్రల్లో కనిపిస్తారు. 2026 మే 1న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ప్రస్తుతం జీ5లో తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ భాషల్లో అందుబాటులో ఉంది.
ఈ మూవీలో డాక్టర్ డేనియల్ జేమ్స్ పాత్రలో మమ్ముట్టి కనిపిస్తాడు. దేశ భద్రత కోసం పనిచేసే ఒక అత్యంత తెలివైన శాస్త్రవేత్త ఆయన. భారత రక్షణ వ్యవస్థ కోసం పెరిస్కోప్ అనే అత్యాధునిక స్పైవేర్ అభివృద్ధిలో జేమ్స్ కీ రోల్ ప్లే చేస్తాడు. ఈ సాఫ్ట్‌వేర్ సహాయంతో ఏ వ్యక్తి ఫోన్ అయినా రిమోట్‌గా యాక్సెస్ చేయవచ్చు. కెమెరా, మైక్రోఫోన్, వ్యక్తిగత డేటా లాంటివి క్షణాల్లో అందుబాటులోకి వస్తాయి. అయితే దేశ రక్షణ కోసం రూపొందించిన ఈ సాంకేతిక ఆయుధం క్రమంగా రాజకీయ ఆయుధంగా మారుతుంది. అధికారంలో ఉన్న కొందరు నేతలు, వారి అనుచరులు ఈ సాఫ్ట్‌వేర్‌ను మిస్‌యూజ్ చేస్తారు.
జర్నలిస్టులు, సోషల్‌యాక్టివిస్టులతో పాటు ఏకంగా సామాన్యులపై కూడా ప్రయోగిస్తారు. వారి వ్యక్తిగత జీవితాలను నియంత్రించే ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా యువతుల వ్యక్తిగత వీడియోలు, ప్రైవేట్ సమాచారాన్ని ఉపయోగించి వారిని బ్లాక్ మెయిల్ చేసే భయంకరమైన వ్యవస్థ వెనుక ఉన్న నిజం డేనియల్ జేమ్స్‌కు తెలుస్తుంది.
ఆ నిజాన్ని బయటపెట్టాలని నిర్ణయించుకున్న క్షణం నుంచి అతని జీవితం పూర్తిగా తలకిందులవుతుంది. దేశద్రోహిగా అతనిపై ముద్రవేస్తారు. తన ప్రాణాలను కాపాడుకుంటూనే ప్రజలకు నిజం చెప్పడానికి డేనియల్ జేమ్స్ చేసే పోరాటం ఈ కథలో కీలక అసెట్‌గా చెప్పవచ్చు. ఈ జర్నీలో కల్నల్ రహీమ్ నాయక్ పాత్రలో మోహన్‌లాల్ అతనికి అండగా నిలుస్తాడు. మరోవైపు శక్తి సుందరం పాత్రలో ఫహాద్ ఫాసిల్ తనదైన శైలిలో కథకు కొత్త ట్విస్టులు తీసుకొస్తాడు.
శ్రీలంక, లండన్, అజర్ బైజాన్ లాంటి అంతర్జాతీయ లొకేషన్లలో చిత్రీకరించిన యాక్షన్ సన్నివేశాలు, స్మార్ట్ ట్విస్టులు, డేటా ప్రైవసీపై ఆలోచింపజేసే కథనం ఈ చిత్రాన్ని సాధారణ స్పై థ్రిల్లర్ స్థాయిని దాటించాయి. మన ఫోన్లు మన చేతుల్లో ఉన్నా, మన జీవితాలు నిజంగా మన చేతుల్లోనే ఉన్నాయా అనే అనుమానం వచ్చేలా ఈ కథ చివరకు ముగుస్తుంది.
Read Also : బార్‌లో మద్యం తాగుతూ భార్యలు చేసే రచ్చ… ఏ ఓటీటీలో ఉందంటే ?