Psychological mystery thriller OTT : ఓటీటీలో ఎన్ని సినిమాలు స్ట్రీమింగ్ కి వస్తున్నాయి. ఇక మీదట కూడా వస్తూనే ఉంటాయి. అయితే కొన్ని సినిమాలు చరిత్రలో నిలిచిపోతాయి. అలాంటి సినిమాలు కొన్ని మాత్రమే ఉంటాయి. ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా అలాంటిదే. ఇది మెదడుకి పనిపెట్టే ఒక సైకలాజికల్ మైండ్ గేమ్ లాంటిది. ఈ సినిమా గొప్పతనం ఏంటంటే, ఒక్కొక్కరు ఒక్కోలా దీన్ని అర్థం చేసుకుంటారు. అందుకే ప్రపంచంలోని గొప్ప సినిమాల్లో ఇది ఎప్పుడూ టాప్‌లో ఉంటుంది. సినిమా అర్థం కాక జనం తలలు పట్టుకుంటుంటే, డైరెక్టర్ 10 క్లూస్ ఇచ్చి, వీటిని బట్టి సినిమా చూడండి, మీకే అర్థమవుద్దని సవాల్ కూడా విసిరాడు. హాలీవుడ్ రంగుల లోకంలో సెటిల్ అవ్వాలని వచ్చే వాళ్ల కలలు ఎలా కల్లలవుతాయో, ఆ ఫ్రస్ట్రేషన్‌లో మనిషి మనస్తత్వం ఎలా మారుతుందో ఇందులో చూడొచ్చు. ఇది ఒకసారి చూసి వదిలేసే సినిమా కాదు, పదే పదే చూసి అర్థం చేసుకోవాల్సిన ఒక మాస్టర్ పీస్ ఈ మూవీ. దీని పేరు ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే..
డేవిడ్ లించ్ దర్శకత్వం వహించిన ‘ముల్హోలాండ్ డ్రైవ్’ (Mulholland Drive) 2001లో వచ్చింది. ఇది ఒక అద్భుతమైన సైకలాజికల్ థ్రిల్లర్. హాలీవుడ్ నేపథ్యంలో సాగే ఈ సినిమా ప్రపంచ సినిమా చరిత్రలోనే అత్యుత్తమ చిత్రాలలో ఒకటిగా నిలిచింది. డేవిడ్ లించ్ ఈ సినిమాను ఒక పజిల్ లాగా రూపొందించారు. దీనికి ఆయనకు ఆస్కార్ నామినేషన్, కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ దర్శకుడి అవార్డు లభించింది. 21వ శతాబ్దపు అత్యుత్తమ చిత్రాల జాబితాలో బిబిసి (BBC) దీనికి మొదటి స్థానాన్ని ఇచ్చింది. ఈ సినిమా ప్రస్తుతం Amazon Prime Videoలో రెంటుకు అందుబాటులో ఉంది. మొదట ఈ సినిమాను ఒక టీవీ సీరియల్‌గా తీద్దామని అనుకున్నారు. దర్శకుడు డేవిడ్ లించ్ ఒక పైలట్ ఎపిసోడ్ తీసి చూపిస్తే, టీవీ ఛానల్ వాళ్లు ఇదేం పిచ్చి కథ, మాకు వద్దఅని మొహం మీదే చెప్పేశారు. దాంతో లించ్ గారు పట్టువదలని విక్రమార్కుడిలా దీనిని సినిమాగా మార్చేశాడు. ఈ సినిమాతోనే హీరోయిన్ నామి వాట్స్ జాతకం మారిపోయింది. అంతకుముందు ఛాన్సులు లేక యాక్టింగ్ వదిలేద్దాం అనుకున్న ఆమె, ఈ సినిమా రిలీజ్ అయ్యాక ఓవర్‌నైట్ గ్లోబల్ స్టార్ అయిపోయింది.
ఒక రాత్రి రోడ్డు మీద ఒక పెద్ద కారు యాక్సిడెంట్ అవుతుంది. ఆ ప్రమాదంలో రీటా అనే ఒక అమ్మాయి, ఎలాగోలా బతికి బయటపడుతుంది. కానీ తలకి దెబ్బ తగలడంతో గతం మొత్తం మర్చిపోతుంది. మైకంలో నడుచుకుంటూ వెళ్ళి సిటీలోని ఒక ఖాళీ ఇంట్లో దూరి పడుకుంటుంది. సరిగ్గా అదే టైమ్‌కి సినిమా ఛాన్సుల కోసం బెట్టీ అనే పల్లెటూరి పిల్ల సిటీకి వచ్చి ఉంటుంది. ఆ ఇంట్లో రీటాను చూసి భయపడకుండా, ఆమెకు గతం గుర్తు చేయడానికి హెల్ప్ చేస్తానని మాట ఇస్తుంది. ఆమె బ్యాగులో ఉన్న లక్షల రూపాయల డబ్బు, ఒక నీలం రంగు తాళం చెవి ఉంటుంది. ఇద్దరూ కలిసి రీటా గతం వెతకడం మొదలుపెడతారు.
కథ ఇలా సాగుతుండగానే మధ్యలో ఒక సినిమా డైరెక్టర్ గోల మొదలవుతుంది. ఎవరో రౌడీలు వచ్చి మేం చెప్పిన అమ్మాయినే నీ సినిమాలో హీరోయిన్‌గా పెట్టుకోవాలని అతన్ని బెదిరిస్తారు. ఒకపక్క బెట్టీ, రీటాలు కలిసి క్లూస్ వెతుకుతూ ఒక శవాన్ని చూస్తారు. అక్కడి నుండి కథ పిచ్చెక్కిపోతుంది. వీళ్ళిద్దరూ ఒక వింత క్లబ్‌కి వెళ్తారు, అక్కడ మ్యూజిక్ వినిపిస్తుంది కానీ మనుషులు ఉండరు. అక్కడ ఒక నీలం రంగు బాక్స్ దొరుకుతుంది. ఆ బాక్స్‌ని ఆ నీలం తాళంతో తీయగానే.. అంతవరకు మనం చూసిన ప్రపంచం మొత్తం తలకిందులైపోతుంది.
చివరికి తెలిసేది ఏంటంటే.. ఇప్పటిదాకా మనం చూసింది అంతా డయాన్ (బెట్టీ) కన్న ఒక అందమైన కల. నిజ జీవితంలో డయాన్ ఒక ఫెయిల్యూర్ యాక్ట్రెస్. తను ప్రేమించిన అమ్మాయి (రీటా) వేరే డైరెక్టర్‌ని పెళ్లి చేసుకుంటుందని కుళ్లుకుని, తట్టుకోలేక సుపారీ ఇచ్చి ఆమెను చంపించేస్తుంది. ఆ గిల్టీతో తను ఒక కలను కంటుంది. అందులో తను గొప్ప నటిగా, చనిపోయిన తన ప్రియురాలు మళ్ళీ బతికి వచ్చినట్టు ఊహించుకుంటుంది. కానీ ఆ కల చెదిరిపోయి నిజం తెలిసేసరికి, తట్టుకోలేక డయాన్ కూడా పిచ్చెక్కిపోయి ప్రాణాలు తీసుకుంటుంది. ఇదంతా ఒక మాయాజాలంలా సాగుతుంది.
Read Also : న్యూయార్క్ వీధుల్లో వణికించే గ్యాంగ్ వార్… టైటానిక్ హీరో నటించిన మరో ఆణిముత్యం