Psychological Thriller OTT : సైకలాజికల్ థ్రిల్లర్ జానర్ లో వచ్చిన ‘ది హౌస్‌మెయిడ్’ (The Housemaid) రికార్డులు సృష్టించింది. తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధించింది. ఈ సినిమాను సుమారు దాదాపు ₹290 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించారు. అయితే పెట్టుబడికి 11 రెట్లకు పైగా వసూళ్లను రాబట్టి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. అంటే 3000 కోట్లకు పైగా ఈ సినిమా వసూళ్లు సాధించి సత్తా చాటింది. ఇప్పుడు ఓటీటీలో కూడా టాప్ ట్రెండింగ్ లో నిలిచింది ఈ మూవీ. అంతే కాకుండా ఈ సినిమాలో పనిమనిషి పాత్రలో నటించిన సిడ్నీ స్వీనీ పేరు మాత్రం మారు మ్రోగుతోంది. ఆమె నటనకు భారీ ప్రశంసలు కూడా వచ్చాయి.
‘ది హౌస్ మెయిడ్’ (The Housemaid) అమెరికన్ సైకలాజికల్ థ్రిల్లర్ పాల్ ఫీగ్ దర్శకత్వంలో రూపొందింది. ఇది ఫ్రీడా మెక్‌ఫాడెన్ రాసిన నవల ఆధారంగా రూపొందింది. ఇందులో సిడ్నీ స్వీనీ (Sydney Sweeney) మిల్లీగా, అమెండా సెయ్‌ఫ్రైడ్ (Amanda Seyfried) నినాగా, బ్రాండన్ స్క్లెనార్ (Brandon Sklenar) ఆండ్రూ పాత్రల్లో నటించారు. ఇది అమెరికాలో 2025 డిసెంబర్ , భారతదేశంలో 2026 జనవరి 1న థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా మార్చి 19 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో తెలుగు, హిందీ, తమిళం భాషల్లో ఫ్రీగానే చూసేందుకు అందుబాటులో ఉంది.
సిడ్నీ స్వీనీ (Sydney Sweeney) పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో, సినీ వర్గాల్లో బాగా మార్మోగిపోతోంది. సిడ్నీ స్వీనీ నటించిన సినిమాల్లో ఇప్పటివరకు ఇదే అతిపెద్ద బాక్సాఫీస్ విజయం. అంతకుముందు ఆమె నటించిన ‘మేడమ్ వెబ్’ వంటి కొన్ని సినిమాలు సరిగ్గా ఆడకపోవడంతో, ఆమెను ఐరన్ లెగ్ గా ప్రచారం చేశారు. కానీ ‘ది హౌస్‌మెయిడ్’ ఘనవిజయంతో ఆమె ఆ ముద్రను చెరిపేసి, తాను ఒక పవర్‌ఫుల్ బాక్సాఫీస్ స్టార్ అని నిరూపించుకుంది. ఈ సినిమా సక్సెస్‌తో ఆమె తన రెమ్యునరేషన్‌ను కూడా భారీగా పెంచేసింది. ఈ సినిమాకు గాను ఆమె దాదాపు $7.5 మిలియన్ల (సుమారు ₹63 కోట్లు) పారితోషికం అందుకున్నట్లు సమాచారం. ఈ సినిమా ఘనవిజయంతో, దీని సీక్వెల్ ‘ది హౌస్‌మెయిడ్స్ సీక్రెట్’ (The Housemaid’s Secret) కూడా రాబోతున్నట్లు మేకర్స్ ఒక ప్రకటన కూడా ఇచ్చారు. ఇందులో కూడా సిడ్నీ స్వీనీయే ప్రధాన పాత్రలో నటిస్తోంది.
మిల్లీ అనే అమ్మాయి గతం అంతా గందరగోళం. ఆమె చిన్న పాటి నేరాలు చేసి జైలుకు వెళ్తుంది. ఇక అక్కడి నుంచి బయటకొచ్చాక, ఎవరూ పని ఇవ్వకపోయేసరికి, ఎలాగోలా ఒక పెద్ద ధనవంతుల ఇంట్లో పనిమనిషి గా చేరుతుంది. అయితే ఆ ఇంటి యజమాని నినా పక్కా శాడిస్ట్‌లా ప్రవర్తిస్తుంటుంది. మిల్లీని చిన్నచూపు చూస్తూ, గదిలో పెట్టి బంధించడం, పిచ్చిపిచ్చి పనులు చెప్పి ఏడిపిస్తుంటుంది. మరో వైపు ఆ ఇంటి యజమాని ఆండ్రూ మాత్రం చాలా మంచోడిలా కనిపిస్తాడు. పెళ్ళాం పెట్టే కష్టాలు భరించలేక నలిగిపోతున్నాడని మిల్లీ అతన్ని చూసి జాలిపడుతుంది.
కట్ చేస్తే, కథలో అసలు ట్విస్ట్ అప్పుడే మొదలవుతుంది. మిల్లీకి ఆండ్రూ మీద ఇష్టం పెరిగి, వాళ్లిద్దరూ సీక్రెట్‌గా దగ్గరవుతారు. కానీ నినా చేసే పనుల వెనుక ఒక పెద్ద కారణం ఉందని మిల్లీకి మెల్లగా అర్థమవుతుంది. ఆ ఇంట్లో అంతకుముందు పని చేసిన వాళ్లంతా ఎందుకు మాయమైపోయారో తెలిశాక మిల్లీకి ఫ్యూజులు ఎగిరిపోతాయి. బయటికి అమాయక చక్రవర్తిలా కనిపించే ఆండ్రూనే అసలైన విలన్ అని, వాడు ఒక పెద్ద సైకో అని తెలుస్తుంది. అతను తన భార్యను గదిలో బంధించి చిత్రహింసలు పెడుతుంటాడు. చివరికి ఆ సైకో గాడి ఆట కట్టించడానికి నినా, మిల్లీ ఒకటవుతారు. వీళ్ళిద్దరూ ఆండ్రూ మీద రివేంజ్ తీర్చుకునే సీన్స్ చాలా ఉత్కంఠంగా ఉంటాయి. మరి ఈ ఉత్కంఠభరితమైన ముగింపును చూడాలనుకుంటే, ఈ సైకలాజికల్ థ్రిల్లర్ పై ఓ లుక్ వేయండి.
Read Also : రెండు కుటుంబాల మధ్య దద్దరిల్లే గ్యాంగ్ వార్… ఓటీటీలో టాప్ రేటింగ్ తో ట్రెండింగ్