Romantic Comedy OTT : మనిషికి పుట్టుక మరణం సాధారణమే. అయితే పుట్టినప్పుడు ఒకరు, చచ్చేటప్పుడు ఒకరు తోడు ఎంతో అవసరం. పుట్టాక తల్లి చూసుకున్నా, ముసలి వయసులో మాత్రం తోడు దొరకటం ఒక అదృష్టం అనే చెప్పాలి. ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా వృద్ధాప్యంలో కూడా సంతోషంగా ఉండే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుందని, సమాజం కోసం తమ ఇష్టాలను చంపుకోవాల్సిన అవసరం లేదని చక్కగా చూపిస్తుంది. ఇందులో చిన్ననాటి స్నేహితులైన ఒక జంట 50 ఏళ్ల తర్వాత కలుస్తారు. ఆ తరువాత కథ హార్ట్ టచింగ్ గా ఉంటుంది.
2023 లో వచ్చిన ఈ రొమాంటిక్ కామిడీ మూవీ పేరు ‘రొకో & స్జూల్’ (Rocco & Sjuul). అన్నా వాన్ డెర్ హైడ్ ఈ సినిమాను చాలా ఎమోషనల్‌గా తెరకెక్కించారు. పెద్ద వయసు వాళ్ళ ఫీలింగ్స్‌ని, ఒంటరితనాన్ని కళ్ళకు కట్టినట్లు చూపించారు ఇందులో. సినిమాలో ప్రధాన పాత్రలైన రొకో, స్జూల్‌గా నటించిన బెప్పీ మెలిస్సెన్, సబ్రీ సాద్ ఎల్-హమస్ నెదర్లాండ్స్‌లో చాలా పేరున్న నటులు. 70 ఏళ్ల వయసులో వాళ్ళ మధ్య కెమిస్ట్రీ చూడముచ్చటగా ఉంటాయి. స్జూల్ కూతురిగా నటించిన అన్నీక్ ఫైఫర్ తన తల్లి రెండో పెళ్లిని అడ్డుకునే మొండి కూతురి పాత్రలో జీవించేసింది. ఈ సినిమా 1 గంట 32 నిమిషాలు మాత్రమే ఉండటం వల్ల ఎక్కడా బోర్ కొట్టకుండా సాగిపోతుంది. ప్రస్తుతం ఈ సినిమా Netflix లో స్ట్రీమ్ అవుతోంది. అయితే ఇది డచ్ భాషా చిత్రం కాబట్టి, మీకు ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్ తో చూడాల్సి ఉంటుంది. తెలుగు ఆడియో ప్రస్తుతానికి అందుబాటులో లేదు. నెదర్లాండ్స్‌లో జరిగిన ఫిల్మ్ బై ది సీ ఫెస్టివల్ 2023లో ఈ చిత్రం ‘ఆడియన్స్ అవార్డు’ను గెలుచుకుంది.
స్జూల్ అనే వృద్ధురాలికి డెబ్భై ఏళ్లు దాటి ఉంటాయి. ఆమె తన భర్తకి జబ్బు చేస్తే ఇన్నేళ్లు సేవలు చేస్తూ, పిల్లల్ని పెంచుతూ తన జీవితాన్నే త్యాగం చేసేసింది. తీరా మొగుడు పోయాక, ఇక తన బతుకు ఇంతే అనుకుంటున్న టైంలో.. తన చిన్ననాటి లవర్ రొకో సడన్‌గా ఎంట్రీ ఇస్తాడు. వీళ్ళిద్దరూ యాభై ఏళ్ల కిందట అదిరిపోయే డ్యాన్స్ పార్ట్‌నర్స్. ముసలోళ్లయ్యాక మళ్ళీ ఒకరినొకరు చూసుకునేసరికి, ఆ పాత జ్ఞాపకాలు గుర్తొచ్చి ఇద్దరి మధ్య మళ్ళీ ప్రేమ పుడుతుంది. వయసు అయిపోతే ఏంటి? మనసుకి ముసలితనం రాదు కదా అన్నట్టుగా వాళ్లిద్దరూ కలిసి మళ్ళీ డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేయడం మొదలుపెడతారు.
వీళ్లిద్దరూ అలా చెట్టాపట్టాలేసుకుని తిరగడం చూసి వాళ్ల కన్నపిల్లలకి అస్సలు నచ్చదు. ఈ వయసులో నీకు ఈ వేషాలు ఏంటి అమ్మా లోకం ఏమనుకుంటుందంటూ స్జూల్ కూతురు నానా రచ్చ చేస్తుంది. అటు పక్క రొకో కొడుకు కూడా అంతే.. ఆస్తిపాస్తుల విషయంలోనో, పరువు పోతుందనో గొడవలు మొదలుపెడతాడు. పాతికేళ్ల వయసులో ఉన్నవాళ్లకి ప్రేమ ఎంత కష్టమో, ఈ డెబ్బై ఏళ్ల ముసలోళ్లకి తమ పిల్లల్ని ఒప్పించడం అంతకంటే పెద్ద తలనొప్పిగా మారుతుంది.
చివరికి స్జూల్ ఒక నిర్ణయానికి వస్తుంది. ఇన్నేళ్లు అందరి కోసం బతికాను, కనీసం మిగిలిన ఈ కొద్ది కాలమైనా నాకిష్టమైనట్టు, నా రొకోతో కలిసి బతకాలని ఫిక్స్ అవుతుంది. పిల్లలు ఏమనుకున్నా, లోకం కాకిలా కూసినా సరే.. తన సంతోషమే ముఖ్యమని ధైర్యంగా అడుగు ముందుకు వేస్తుంది. ఆ డ్యాన్స్ ఫ్లోర్ మీద వాళ్లిద్దరూ కలిసి చేసే స్టెప్పులు చూస్తుంటే.. ప్రేమకి వయసుతో సంబంధం లేదని, మనసు ఉంటే చాలని అర్థమవుతుంది. మొత్తనకి ముసలితనంలో కూడా కొత్తగా బతకొచ్చని చెప్పే సినిమా ఇది.
Read Also : మామూలు సినిమా కాదిది… అమ్మాయిపై ఒళ్ళు గగుర్పొడిచే దారుణాలు… రక్తం మరిగించే క్లైమాక్స్