Romantic Comedy OTT : ఎన్నో రకాల సినిమాలు ఓటీటీలో స్ట్రీమింగ్ కి వస్తున్నాయి. అయితే వీటిలో కొన్ని సినిమాలు మాత్రమే మంచి మెమొరీస్ ని ఇస్తాయి. ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా అలాంటిదే. ఇందులో తల్లి కూతురి మధ్య ఉండే అనుబంధాన్ని కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది. అలాగే ఒక అందమైన ప్రేమ కథ కూడా ఉంటుంది. ఇది నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన మొదటి వారంలోనే వరల్డ్ వైడ్‌గా టాప్-1 స్థానంలో నిలిచి రికార్డు సృష్టించింది. ఒక మంచి ఫీల్ గుడ్ సినిమా చూడాలనుకుంటే, ఈ సినిమాను చూసేయచ్చు. చాలా చక్కగా ఉంటుంది ఈ హాలీవుడ్ సినిమా. దీని పేరు ఏమిటి ? కథ ఎలా ఉంటుంది ? అనే వివరాల్లోకి వెళ్తే…
ఈ రొమాంటిక్ కామెడీ సినిమా పేరు ‘ది లైఫ్ లిస్ట్’ (The Life List). ఈ సినిమా లోరీ నెల్సన్ స్పీల్‌మాన్ రాసిన అదే పేరుతో ఉన్న పాపులర్ నవల ఆధారంగా తెరకెక్కింది. ఇందులో హీరోయిన్‌గా నటించిన సోఫియా కార్సన్ కేవలం నటి మాత్రమే కాదు, ఆమె ఒక మంచి సింగర్ కూడా. అందుకే ఈ మూవీలోని సాంగ్స్ చాలా ఫీల్ గుడ్‌గా, యూత్‌కు నచ్చేలా ఉంటాయి. ఈ చిత్రాన్ని ఆడమ్ బ్రూక్స్ డైరెక్ట్ చేశారు, ఈయన గతంలో ‘డెఫినెట్లీ, మేబీ’ వంటి సూపర్ హిట్ రొమాంటిక్ సినిమాలను తీసిన అనుభవం ఉన్న దర్శకుడు. ముఖ్యంగా ఈ సినిమా షూటింగ్ అంతా న్యూయార్క్ సిటీలోని అందమైన లోకేషన్లలో జరిగింది. సినిమా థియేటర్లలో విడుదల కాలేదు. ఇది నేరుగా నెట్‌ఫ్లిక్స్ (Netflix) ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లోనే 2025 మార్చి 28న రిలీజ్ అయ్యింది. ఈ సినిమా ప్రస్తుతానికి తెలుగు డబ్బింగ్‌లో కూడా అందుబాటులో ఉంది, కాబట్టి మీరు మన భాషలోనే హాయిగా ఎంజాయ్ చేయొచ్చు.
అలెక్స్ రోజ్ అనే అమ్మాయికి వాళ్ళ అమ్మ అంటే ప్రాణం. కానీ సడన్‌గా వాళ్ళ అమ్మ చనిపోతుంది. అమ్మ రాసిచ్చిన ఆస్తి అంతా తనకే వస్తుందని అలెక్స్ ఆశపడుతుంది. కానీ అక్కడే అసలు ట్విస్ట్ ఉంటుంది. ఆ ఆస్తి దక్కాలంటే అలెక్స్ చిన్నప్పుడు సరదాగా రాసుకున్న ఒక ‘గోల్స్ లిస్ట్’ లో ఉన్న పనులన్నీ పూర్తి చేయాలని వాళ్ళ అమ్మ వీలునామాలో రాస్తుంది. లేదంటే పైసా కూడా రాదని కండిషన్ పెడుతుంది. అలెక్స్ ఆ లిస్ట్ గురించి ఎప్పుడో పూర్తిగా మర్చిపోతుంది. కానీ ఆమె తల్లి ఆ కాగితాన్ని ఇన్నేళ్లుగా దాచి పెడుతుంది. తన కూతురు పెద్దయ్యాక తన కలలను మర్చిపోయి, కేవలం డబ్బు వెనకాలే పరిగెడుతుందని గ్రహించిన తల్లి చనిపోయే ముందు ఆ లిస్ట్‌ను ఒక కండిషన్‌లా పెడుతుంది.
అలెక్స్ ఆ లిస్ట్ తీసి చూస్తే అందులో అన్నీ వింత పనులు ఉంటాయి. స్టేజ్ మీద నిలబడి జోకులు చెప్పడం, ఒంటి మీద టాటూ వేయించుకోవడం, గుర్రపు స్వారీ చేయడం, ఆఖరికి నిజమైన ప్రేమను వెతకడం వంటివి ఉంటాయి. ఈ పనులు చేయడానికి అలెక్స్ పడరాని పాట్లు పడుతుంది. ప్రతి పని పూర్తి చేసేటప్పుడు, వాళ్ళ అమ్మ ముందే రికార్డ్ చేసి పెట్టిన వీడియో మెసేజ్‌లు చూస్తూ, తన పాత జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకుంటూ ముందుకు సాగుతుంది. న్యాయవాది బ్రాడ్ అనే వ్యక్తి సాయంతో ఈ పనులు పూర్తి చేస్తుంది.
ఈ గోల్స్ పూర్తి చేసే క్రమంలో అలెక్స్‌కు తన గురించి తనకు కొత్త విషయాలు తెలుస్తాయి. తన పాత బాయ్‌ఫ్రెండ్‌తో విడిపోయి, బ్రాడ్ తో ప్రేమలో పడుతుంది. ఆస్తి కోసం మొదలుపెట్టిన ఈ ప్రయాణం, చివరకు ఆమె జీవితాన్ని మార్చేస్తుంది. డబ్బు కంటే కూడా మనకు నచ్చిన పనులు చేయడం, మనల్ని మనం ఇష్టపడడమే అసలైన ఆస్తి అని ఆమె తెలుసుకోవడంతో కథ హ్యాపీగా ముగుస్తుంది.
Read Also : డెబ్బై ఏళ్ల తర్వాత కూడా డెడ్లీ రొమాన్స్ తో ఇరక్కొట్టిన జోడి… లవ్ స్టోరీస్ లో మాస్టర్ పీస్ మావా