Emotional Drama OTT : భారీ యాక్షన్ సీన్లు, గ్రాఫిక్స్ లేకపోయినా కేవలం మనుషుల ఎమోషన్స్‌తోనే ప్రేక్షకులను కట్టిపడేస్తోంది ఒక సినిమా. ఒక చిన్న నాటకం మనిషిని ఎలా మార్చగలదు అనే పాయింట్‌తో ఈ సినిమాను అద్భుతంగా తీశారు. 2024లో వచ్చిన అత్యంత ప్రభావవంతమైన చిత్రాలలో ఇది ఒకటిగా నిలిచింది. ఈ కథనం ప్రేక్షకులను కంటతడి కూడా పెట్టిస్తుంది. ఇందులో ఎమోషన్స్ అంతగా హత్తుకుంటాయి గుండెకు. ఫ్యామిలీతో కలసి చూడాల్సిన చక్కనైన సినిమా ఇది.
2024లో వచ్చిన ఈ అమెరికన్ ఎమోషనల్ డ్రామా పేరు ‘ఘోస్ట్‌లైట్’ (Ghostlight). కెల్లీ ఓ’సుల్లివన్ మరియు అలెక్స్ థాంప్సన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాలో తండ్రి, తల్లి, కూతురు పాత్రలు పోషించిన కీత్ కుప్ఫరర్, తారా మాలెన్, క్యాథరిన్ మాలెన్ కుప్ఫరర్ నిజ జీవితంలో కూడా ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు. నిజమైన భార్యాభర్తలు, సొంత కూతురు కావడంతో, సినిమాలో వాళ్ళ మధ్య వచ్చే గొడవలు, ప్రేమ, ఎమోషన్స్ చాలా సహజంగా, మన పక్కింటి కథలా అనిపిస్తాయి. ముఖ్యంగా తండ్రి పాత్రలో కీత్ నటనకు అంతర్జాతీయ స్థాయిలో భారీ ప్రశంసలు దక్కాయి. ఆయనకు ఉత్తమ నటుడిగా పలు అవార్డు నామినేషన్లు కూడా వచ్చాయి. రోటెన్ టొమాటోస్‌లో ఈ సినిమాకు 99% రేటింగ్ లభించడం విశేషం. అంటే చూసిన ప్రతి ఒక్కరికీ ఇది నచ్చిందన్నమాట. ప్రస్తుతం ఈ సినిమా Apple TV, Amazon Prime Videoలో అద్దె ప్రాతిపదికన అందుబాటులో ఉంది.
డాన్ ఒక కన్స్ట్రక్షన్ కంపెనీలో పనిచేస్తుంటాడు. బయట గంభీరంగా కనిపిస్తాడు కానీ, లోపల ఏదో పెద్ద బాధ ఆయన్ని తొలిచేస్తుంటుంది. దీనికి తోడు ఆయన కూతురు డైసీ స్కూల్లో గొడవలు చేస్తూ సస్పెండ్ అవుతుంది. అసలు విషయం ఏంటంటే, వీళ్ళ ఇంట్లో ఒక పెద్ద ట్రాజెడీ జరిగింది. డాన్ కొడుకు చనిపోవడంతో ఆ బాధను ఎలా వెళ్లగక్కాలో తెలియక డాన్ పిచ్చోడిలా లోలోపలే కుమిలిపోతుంటాడు. భార్యతో సరిగ్గా మాట్లాడడు, కూతురు అల్లరిని భరించలేడు. ఇలా ఆ ఇల్లంతా ఒక నరకంలా తయారవుతుంది.
ఒకరోజు డాన్ రోడ్డు మీద పని చేస్తుంటే, పక్కనే ఉన్న ఒక చిన్న థియేటర్ గ్రూపులో ఒక ముసలావిడ ఆయన్ని చూస్తుంది. వాళ్ళు రోమియో అండ్ జూలియట్ నాటకం వేయడానికి రెడీ అవుతుంటారు. కానీ రోమియో పాత్ర చేయడానికి సరైన వ్యక్తి దొరకడు. రీటా బలవంతం మీద డాన్ ఆ గ్రూపులో చేరతాడు. మొదట్లో ఆయనకు అస్సలు ఇష్టం ఉండదు, అసలు ఆ డైలాగులు ఏంటో, ఆ సీన్లు ఏంటో ఆయనకు అర్థం కావు. కానీ మెల్లగా ఆ నాటకంలోని డైలాగులు చదువుతుంటే, అవి తన జీవితానికే దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుంది.
ఆ నాటకంలో రోమియో పాత్ర చేస్తున్నప్పుడు, డాన్‌కు తన కొడుకు గుర్తుకొస్తాడు. నిజానికి తన కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడని, ఆ బాధతోనే అతను ఇలా అయ్యడని సినిమా మధ్యలో అర్థమవుతుంది. అయితే ఇప్పుడు ఆ నాటకం ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ, స్టేజ్ మీద గట్టిగా అరుస్తూ, ఏడుస్తూ తన మనసులోని భారమంతా బయటపెడతాడు. డాన్ ఈ నాటకంలో నటిస్తున్నాడని తెలిసి మొదట భార్య, కూతురు షాక్ అవుతారు, కానీ తర్వాత వాళ్ళు కూడా ఆ నాటకంలో చిన్న పాత్రలు వేయడానికి ఒప్పుకుంటారు. చివరికి స్టేజ్ మీద నాటకం ప్రదర్శించే రోజు వస్తుంది. ఆ నాటకంలో తన కొడుకును కోల్పోయిన బాధను అద్భుతంగా ప్రపంచానికి చూపిస్తాడు. ఆ స్టేజ్ మీదే కూతురితో, భార్యతో ఉన్న గొడవలు పోయి అందరూ కలిసిపోతారు. సినిమా చివర్లో ఆ కుటుంబం మళ్ళీ కలిసి సంతోషంగా ఉండటం చూసి మన మనసు కూడా బరువెక్కుతుంది.
Read Also : రాత్రంతా నిద్రపోకుండా వీళ్లు చేసిన రచ్చ… లవర్స్ చూడాల్సిన అసలు సిసలు మూవీ