Romantic Drama OTT : రొమాంటిక్ జోనర్ లో సినిమాలు బోలెడు వస్తున్నాయి. ఎప్పటి నుంచో ఈ కంటెంట్ కు వీరాభిమానులు కూడా ఉన్నారు. అయితే అలాంటి వాళ్ళ కోసమే ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా. అయితే ఇది ఇద్దరు స్వలింగ సంపర్కుల చుట్టూ తిరుగుతుంది. అయినా కూడా ఎమోషన్స్ తో కట్టి పడేస్తుంది ఈ సినిమా. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది లోకానికి భయపడి మనసులోనే చంపుకున్న ఒక మొరటు ప్రేమ కథ. పెళ్లాం బిడ్డలు ఉన్నా కూడా, ఈ గే జంట ఒకరిని ఒకరు కలుసుకోవాలని పడే తాపత్రయం మామూలుగా ఉండదు. ఇక క్లైమాక్స్ గుండెను పిండేస్తుంది. అందుకే ఈ సినిమాకు ఆస్కార్ అవార్డుల పంట కూడా పండిది.
2005లో వచ్చిన ఈ రొమాంటిక్ డ్రామా పేరు ‘బ్రోక్‌బ్యాక్ మౌంటైన్’ (Brokeback Mountain). యాంగ్ లీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విమర్శకుల ప్రశంసలు పొందిన ఒక అద్భుతమైన ప్రేమ కావ్యం. ఇందులో హీత్ లెడ్జర్ (ఎన్నిస్ డెల్ మార్), జేక్ గిలెన్‌హాల్ (జాక్ ట్విస్ట్), మిషెల్ విలియమ్స్, అన్నే హాత్వే లీడ్ రోల్స్ లో నటించారు. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే హీత్ లెడ్జర్, మిషెల్ విలియమ్స్ నిజంగా ప్రేమలో పడ్డారు. వీరిద్దరూ సినిమాలో భార్యాభర్తలుగా నటించారు. అలాగే ఈ సినిమాలో క్లైమాక్స్‌లో కనిపించే రెండు షర్టులను 2006లో జరిగిన ఒక వేలంలో ఏకంగా 1,01,100 డాలర్లకు విక్రయించడం విశేషం. అవార్డుల పరంగా చూస్తే, ఈ సినిమా ఆస్కార్ చరిత్రలో ఒక పెద్ద చర్చకు దారితీసింది. ఆ ఏడాది 8 విభాగాల్లో నామినేట్ అయి ఉత్తమ దర్శకుడు సహా మూడు అవార్డులు గెలుచుకున్నప్పటికీ, ‘ఉత్తమ చిత్రం’ అవార్డును ‘క్రాష్’ సినిమాకు ఇవ్వడం అప్పట్లో చాలా మందిని ఆశ్చర్యపరిచింది. ఈ సినిమా ప్రస్తుతం ప్రైమ్ వీడియో, ఆపిల్ టివిలలో అందుబాటులో ఉంది.
ఎన్నీస్, జాక్ అనే ఇద్దరు కుర్రాళ్ళు గొర్రెలు కాయడానికి కొండల మీదకు వెళ్తారు. ఒకరు అచ్చం పల్లెటూరి మొరటు మనిషి, ఇంకొకడు కొంచెం చలాకీగా ఉండే రకం. కొండ మీద మనుషులు ఎవరూ లేని చోట, ఆ గొర్రెల కాపలాలో వాళ్ళిద్దరి మధ్య ఒక కొత్త రకమైన స్నేహం మొదలై, అది కాస్తా ప్రేమగా మారుతుంది. ఆ చలి రాత్రుల్లో వాళ్ళ మధ్య జరిగిన విషయం ఎవరికీ తెలియకుండా ఒక రహస్యంగా ఉండిపోతుంది. అసలు పని అయిపోయాక ఇద్దరూ విడిపోయి వేరే ఊర్లకు వెళ్ళిపోతారు. ఎన్నీస్ ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని పిల్లలతో సంసారంలో పడతాడు. జాక్ కూడా ఒక డబ్బున్న పిల్లని పెళ్లి చేసుకుంటాడు. కానీ ఒకరిని ఒకరు మర్చిపోలేక నాలుగేళ్ల తర్వాత మళ్ళీ కలుస్తారు. అప్పటి నుండి పెళ్ళాం బిడ్డలను వదిలేసి, ఏవో కుంటి సాకులు చెప్పి మరీ ఆ కొండల మీదకు చేపల వేట పేరుతో వెళ్లి మళ్ళీ కలుస్తుంటారు.
సమాజం ఏమనుకుంటుందో అన్న భయం ఎన్నీస్‌ని పీడిస్తుంటే, ఇద్దరం కలిసి బతుకుదామని జాక్ అడుగుతుంటాడు. ఇలా ఇరవై ఏళ్లు దొంగచాటుగా గడిచిపోతాయి. చివరికి ఒక గొడవ తర్వాత జాక్ చనిపోయాడని ఎన్నీస్‌కు తెలుస్తుంది. అతని ఇంటికి వెళ్ళినప్పుడు, వాళ్లిద్దరూ మొదటిసారి కలిసినప్పుడు వేసుకున్న చొక్కాలు ఒకదానిలో ఒకటి పెట్టి ఉండటం చూసి ఎన్నీస్ కన్నీళ్లు పెట్టుకుంటాడు. ఆ చొక్కాలను గుండెకు హత్తుకుని అలాగే ఉండిపోతాడు. ఇది మన సమాజం ఒప్పుకోని ప్రేమ కథే అయినా, చూస్తే మాత్రం కన్నీళ్ళు ఆగవు.
Read Also : మైండ్ గేమ్ తో మతిపోగొట్టే అంతుచిక్కని మిస్టరీ… అసలు పిచ్చి ఎవరికో అర్థం కాక బుర్ర తిరిగిపోయే థ్రిల్లర్