Neil Armstrong Biopic: మనం ప్రతిరోజూ రాత్రి పూట ఆకాశంలో చూసే అందమైన చంద్రుడిపైకి మనిషి వెళ్లడం అనే విషయాన్ని వినడం ఇప్పుడు కామన్ అయిపోయింది. కానీ దీని వెనుక ఎంతటి ప్రాణత్యాగం, ఎంతటి టెక్నికల్ స్ట్రగుల్ దాగి ఉందో కళ్లకు కట్టినట్లు చూపించిన ఒక మాస్టర్‌పీస్ మూవీనే ‘ఫస్ట్ మ్యాన్’ (First Man). ప్రపంచ చరిత్రలోనే ఎవరికీ సాధ్యం కాని రీతిలో అపోలో 11 మిషన్ ను సక్సెస్ చేయడానికి నాసా సైంటిస్టులు, ప్రాణాలను పణంగా పెట్టిన వ్యోమగాములు పడిన అంతులేని కష్టాన్ని ఈ సినిమాలో ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు. మరి మనం లైఫ్ లో ఒక్కసారైనా చూడాల్సిన ఈ సినిమా ఏ ఓటీటీలో ఉందంటే…
చంద్రుడిపై కాలుమోపిన మొట్టమొదటి మానవుడిగా చరిత్ర సృష్టించిన నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ (Neil Armstrong) జీవిత ప్రయాణమే ఈ సినిమా కథ. 1960లలో నాసాలో చేరిన నీల్, చంద్రుడిపైకి మనిషిని పంపాలనే లక్ష్యంతో చేపట్టిన అంతరిక్ష ప్రయోగాల్లో భాగమవుతాడు. ఈ ప్రయాణం కేవలం టెక్నాలజీకి సంబంధించినది మాత్రమే కాదు. ప్రతి ప్రయోగంలోనూ ప్రాణాపాయం ఎదురవుతుంది. చిన్న పొరపాటు జరిగినా ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు ఉంటాయి. అయినప్పటికీ, తన లక్ష్యాన్ని చేరుకోవాలనే పట్టుదలతో నీల్ ముందుకు సాగుతాడు.
అంతరిక్ష ప్రయోగాల్లో వరుసగా ఎదురయ్యే సాంకేతిక సమస్యలు, ప్రమాదాలు వ్యోమగాముల జీవితాలను ఎంతలా ప్రభావితం చేస్తాయో సినిమాలో ఎంతో సహజంగా చూపించారు. అదే సమయంలో నీల్ వ్యక్తిగత జీవితంలో ఎదురయ్యే విషాదాలు కూడా అతడిపై తీవ్ర ప్రభావం చూపుతాయి. కుటుంబంలో చోటుచేసుకున్న నష్టాలు, తన పిల్లల భవిష్యత్తుపై ఆందోళన, మరోవైపు ప్రమాదకరమైన మిషన్లలో పాల్గొనాల్సిన బాధ్యత… ఈ పరిస్థితుల మధ్య నీల్ మానసికంగా ఎలాంటి సంఘర్షణను ఎదుర్కొంటాడనేది కథలో కీలకమైన భాగం. అతడి భార్య జానెట్ కూడా ప్రతిసారీ తన భర్త ప్రాణాలతో తిరిగి వస్తాడో లేదో తెలియని భయంతో జీవిస్తుంది.
ఇక చంద్రుడిపైకి మనిషిని పంపేందుకు నాసా చేపట్టిన అపోలో మిషన్ కథను మరో స్థాయికి తీసుకెళ్తుంది. నీల్ తో పాటు బజ్ ఆల్డ్రిన్ (Buzz Aldrin), మైఖేల్ కాలిన్స్ (Michael Collins) కూడా ఈ చారిత్రాత్మక ప్రయాణంలో భాగమవుతారు. ఎన్నో పరీక్షలు, శిక్షణలు, ప్రయోగాలు దాటిన తర్వాత 1969 జూలై 16న అపోలో 11 అంతరిక్ష యాత్ర ప్రారంభమవుతుంది. భూమిని విడిచి చంద్రుడి వైపు ప్రయాణించే సమయంలో వ్యోమగాములు ఎదుర్కొనే ఒత్తిడి, అంతరిక్ష నౌకలోని పరిమిత పరిస్థితులు, ప్రతి నిర్ణయం వెనుక ఉన్న ప్రమాదం ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేస్తాయి.
ముఖ్యంగా చంద్రుడిపై దిగే ఘట్టం సినిమాలో అత్యంత కీలకమైనది. ల్యాండింగ్ సమయంలో ఎదురయ్యే సమస్యలు, ఇంధనం తగ్గిపోతున్న పరిస్థితుల్లో సరైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం, క్షణాల్లో మారిపోయే పరిస్థితులు ఆ సన్నివేశాన్ని ఎంతో ఉత్కంఠభరితంగా మారుస్తాయి. నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ చంద్రుడి ఉపరితలంపై అడుగు పెట్టినప్పుడు అది ఒక్క వ్యక్తి విజయం మాత్రమే కాదు. ఎన్నో ఏళ్ల కష్టం, శాస్త్రవేత్తల పరిశోధనలు, వ్యోమగాముల త్యాగాలకు దక్కిన ఫలితం. ఆ క్షణం వెనుక ఉన్న ఒత్తిడి, బాధ్యతను సినిమాలో అద్భుతంగా ఆవిష్కరించారు. చంద్రుడిపై మనిషి అడుగు పెట్టాడనే విషయం మనకు తెలుసు. కానీ ఆ చారిత్రాత్మక ఘనత సాధించడానికి ముందు ఎన్ని ప్రయోగాలు జరిగాయి ? ఎన్ని ప్రమాదాలు ఎదురయ్యాయి ? వ్యోమగాములు తమ ప్రాణాలను పణంగా పెట్టి ఎలా ముందుకు సాగారో ఈ సినిమాలో చూడవచ్చు.
‘ఫస్ట్ మ్యాన్’ జియో హాట్‌స్టార్ (Jio Hotstar)లో అందుబాటులో ఉంది. ప్రస్తుతం ఇంగ్లీష్ ఆడియోలోనే సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. ర్యాన్ గోస్లింగ్ (Ryan Gosling) నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ పాత్రలో నటించగా, క్లైర్ ఫోయ్ (Claire Foy) ఆయన భార్య జానెట్ ఆర్మ్‌స్ట్రాంగ్ పాత్రలో కనిపించారు. దర్శకుడు డామియన్ షాజెల్ (Damien Chazelle) ఈ బయోగ్రాఫికల్ డ్రామాను ఎంతో రియలిస్టిక్‌గా తెరకెక్కించారు. అంతరిక్ష ప్రయాణాన్ని కేవలం విజువల్ వండర్‌గా చూపించకుండా, దాని వెనుక ఉన్న మనుషుల భావోద్వేగాలు, కుటుంబాల ఆందోళన, శాస్త్రీయ ప్రయోగాల్లోని ప్రమాదాలను కూడా కథలో భాగం చేశారు. సినిమా చూస్తున్నంతసేపు మనం కూడా ఆ అపోలో స్పేస్ మిషన్‌లో వారితో పాటు ప్రయాణిస్తున్నామనే ఫీలింగ్ కలుగుతుంది.