Anbil Mahesh Arrest: తమిళనాడు రాజకీయాల్లో సంచలన పరిణామం చోటుచేసుకుంది. ప్రైవేట్ పాఠశాలలకు అనుమతులు, లైసెన్సుల మంజూరులో భారీ అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై మాజీ విద్యాశాఖ మంత్రి, డీఎంకే నేత అన్బిల్ మహేష్ పొయ్యామొళిని (Anbil Mahesh Poyyamozhi ) చెన్నై సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. సుమారు రూ. 100 కోట్ల మేర అవినీతి జరిగినట్లు అధికారులు అనుమానిస్తున్నారు.
తమిళనాడు ప్రైవేట్ పాఠశాలల సంఘాల సమాఖ్య కార్యదర్శి ఇలాంగోవన్ ఇచ్చిన ఫిర్యాదుతో ఈ దర్యాప్తు ప్రారంభమైంది. ప్రైవేట్ విద్యాసంస్థలకు కావలసిన శాశ్వత గుర్తింపు, అప్‌గ్రేడేషన్, ప్లానింగ్ అప్రూవల్స్, ఇతర ప్రభుత్వ అనుమతులు ఇప్పిస్తామని చెప్పి తమ నుంచి భారీగా డబ్బులు వసూలు చేశారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కేసులో తొలుత తమిళనాడు ప్రైవేట్ పాఠశాలల సంఘం అధ్యక్షుడు బి.టి. అరసుకుమార్, ఇతర నిర్వాహకులపై ఆరోపణలు వెల్లువెత్తాయి. లైసెన్సులు, నో-అబ్జెక్షన్ సర్టిఫికేట్లు (NOC), గుర్తింపు పునరుద్ధరణలు ఇప్పిస్తామని నమ్మబలికి అనేక పాఠశాలల నుంచి వారు మెంబర్‌షిప్ ఫీజులు, చందాల పేరిట డబ్బులు వసూలు చేసి.. చివరికి మోసం చేశారని తేలింది.
ఈ ఆరోపణలపై కేసు నమోదు చేసుకున్న దర్యాప్తు అధికారులు.. విచారణ చేపట్టారు. ఈ అక్రమ వ్యవహారంలో ఇప్పటివరకు దాదాపు 177 ప్రైవేట్ పాఠశాలలు బాధితులుగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. సోదాలు, విచారణ సమయంలో లభ్యమైన డిజిటల్ పరికరాల డేటా, సాక్షుల వాంగ్మూలాల ఆధారంగా మాజీ మంత్రి అన్బిల్ మహేష్‌కు ఈ అవినీతితో ప్రత్యక్ష సంబంధం ఉన్నట్లు తేలిందని పోలీసులు తెలిపారు. దీంతో ఆయనపై ‘అవినీతి నిరోధక చట్టం’తో పాటు నమ్మకద్రోహం కింద కేసులు నమోదు చేశారు.
అంతకుముందు మద్రాస్ హైకోర్టులో అన్బిల్ మహేష్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను జస్టిస్ వి. లక్ష్మీనారాయణన్ ధర్మాసనం తిరస్కరించింది. ఇది జరిగిన కొద్దిసేపటికే ఆయన అరెస్టు చోటుచేసుకోవడం గమనార్హం. మరోవైపు తనపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలని కోరుతూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. తనపై వచ్చిన ఆరోపణలన్నీ అసత్యాలని ఈ కేసును చట్టపరంగా ఎదుర్కొంటానని మహేష్ స్పష్టం చేశారు.
Also Read: క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తున్నారా? ఈ 5 తప్పులు చేస్తే.. ఆర్థికంగా సర్వనాశనమే!
డీఎంకే నేత అన్బిల్ మహేష్ అరెస్ట్‌తో తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న తమిళగ వెట్రి కజగం (TVK) ప్రభుత్వం, తమ రాజకీయ ప్రత్యర్థులను అణచివేయడానికే విచారణ సంస్థలను దుర్వినియోగం చేస్తోందని డీఎంకే (DMK) తీవ్రస్థాయిలో మండిపడింది.
Also Read: సరదాగా వదిలిన కుందేళ్లు.. ఒక దేశాన్నే ఎలా ముంచేశాయో తెలుసా?