Sachin A Billion Dreams on OTT : క్రికెట్ అంటే చెవికోసుకునే స్పోర్ట్స్ లవర్స్ కూడా గుడ్ న్యూస్. క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ బయోపిక్ తెలుగులో స్ట్రీమింగ్ కాబోతోంది. అయితే ఈ బయోపిక్ ఇప్పుడు కొత్తగా రిలీజ్ అవుతున్నది మాత్రం కాదు. పదేళ్ళ క్రితమే విడుదలైంది. కాకపోతే ఇన్నేళ్ల తరువాత తెలుగులో స్ట్రీమింగ్ అవుతుండడం గమనార్హం. మరి ఇంతకీ సచిన్ జీవిత చరిత్రను ఏ ఓటీటీలో చూడవచ్చు ? తెలుగులో ఎప్పుడు స్ట్రీమింగ్ కానుంది ? అనే విషయంలోకి వెళ్తే…
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ జీవితం ఆధారంగా రూపొందిన అద్భుతమైన బయోపిక్ డాక్యు-డ్రామా Sachin: A Billion Dreams (2017). జేమ్స్ ఎర్స్కిన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా దిగ్గజ 2017లో విడుదలై ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానుల ఆదరణను దక్కించుకుంది. ఈ డాక్యుమెంటరీలో సచిన్ స్ఫూర్తిదాయక ప్రయాణం, ఆయన మోసిన ఒత్తిడి, భారతదేశం సాధించిన చిరస్మరణీయ 2011 ప్రపంచ కప్ విజయాన్ని, అరుదైన కొన్ని వీడియోలు, ఆర్కైవల్ మ్యాచ్ ఫుటేజ్, భారత క్రికెట్ చరిత్రలోని కీలక ఘట్టాలను మిళితం చేసి అద్భుతంగా చూపించారు.
తాజాగా తెలుగు ప్రేక్షకులను ఉత్సాహపరిచే వార్త ఏమిటంటే… ‘సచిన్: ఎ బిలియన్ డ్రీమ్స్’ చిత్రం 2026 మే 29న ఆహాలో ప్రీమియర్ కానుంది. అది కూడా తెలుగులో. అలాగే ఈ సినిమా తమిళంలో కూడా ప్రీమియర్ కానున్నట్లు మేకర్స్ కన్ఫామ్ చేశారు. ఈ డాక్యుమెంటరీలో సచిన్ భార్య అంజలి టెండూల్కర్, సోదరుడు అజిత్ టెండూల్కర్‌లకు సంబంధించిన ఎమోషనల్ వీడియోలు కూడా ఉన్నాయి. అంతేనా ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లీ, వీరేంద్ర సెహ్వాగ్‌లు కూడా కన్పించి క్రికెట్ లవర్స్ ను సర్ప్రైజ్ చేయనున్నారు. 200 నాట్అవుట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రవి భగచంద్కా, శ్రీకాంత్ భాసి నిర్మించిన ఈ చిత్రానికి, అకాడమీ అవార్డు విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందించడం మరో విశేషం.
Also Read : జంప్ అయ్యి ప్రేమ పెళ్లి… మిస్ అవ్వకుండా చూడాల్సిన బెస్ట్ మలయాళం లవ్ స్టోరీ
ఒక సాధారణ ముంబై కుర్రాడు దేశం గర్వించే ‘గాడ్ ఆఫ్ క్రికెట్’గా ఎలా ఎదిగాడో ఇందులో చూడవచ్చు. సచిన్ చిన్నప్పటి నుంచే షురూ అవుతుంది. అతని అన్నయ్య అజిత్ టెండూల్కర్ తమ్ముడిలోని ప్రతిభను గుర్తించి, కోచ్ రమాకాంత్ అచ్రేకర్ దగ్గరకు తీసుకెళ్ళి ట్రైనింగ్ ఇప్పిస్తాడు. కేవలం 16 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ క్రికెట్ లో అడుగుపెట్టిన సచిన్, పాకిస్తాన్ బౌలర్లను ఎదుర్కొని ఎలా నిలదొక్కుకున్నాడు అనేది ఆసక్తికరంగా తెరకెక్కించారు. సచిన్ ఎదుగుదల, వ్యక్తిగత జీవితం, సచిన్ తన భార్య అంజలిని మొదటిసారి కలవడం, పెళ్లి, పిల్లలు అర్జున్, సారాల పుట్టుక వంటి విశేషాలను సచిన్ స్వయంగా వివరించారు. కెరీర్‌లో ఆయన ఫేస్ చేసిన టెన్నిస్ ఎల్బో వంటి భయంకరమైన గాయాలు, కెప్టెన్సీ ఒత్తిళ్లు, కపిల్ దేవ్, మొహమ్మద్ అజహరుద్దీన్ వంటి సీనియర్లతో సాగిన ప్రయాణాన్ని నిజాయితీగా చూపించారు ఈ సినిమాలో. 2007 వరల్డ్ కప్ ఓటమి తర్వాత సచిన్ మానసికంగా ఎంత కుంగిపోయాడు, సచిన్ లైఫ్ గోల్ 2011 ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ విజయం వంటి అంశాలు ఈ సినిమాలో అత్యంత ఎమోషనల్ అని చెప్పవచ్చు. ఇక చివరగా 2013లో ముంబైలోని వాంఖడే స్టేడియంలో చివరి మ్యాచ్ ముగిసిన అనంతరం సచిన్ ఇచ్చిన ఆ ఐకానిక్ వీడ్కోలు చూస్తే కన్నీళ్ళు ఆగవు.