Telugu Action Drama: కుటుంబంలో ఎవరికైనా ఆపద వస్తే, ముఖ్యంగా బిడ్డ ప్రాణాల మీదకు వస్తే తల్లిదండ్రులు ఏం చేయడానికైనా సిద్ధపడతారు. తమ సంతోషాన్ని పక్కనపెట్టి, ఆస్తులు అమ్ముకుని, అప్పులు చేసి అయినా పిల్లలను కాపాడాలని చూస్తారు. కానీ ఒక దశలో మనం చేయగలిగిన ప్రయత్నాలన్నీ సరిపోకపోతే ? బిడ్డను రక్షించుకోవడానికి మన ఊహకు అందని షరతును అంగీకరించాల్సి వస్తే ? ఇలా తండ్రి ప్రేమను, కుటుంబం కోసం చేసే త్యాగాన్ని పరీక్షించే కథే ‘సుగ్రీవ’ (Sugriva). మరి ఈ తెలుగు యాక్షన్ డ్రామాను ఎక్కడ చూడవచ్చు ? స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి ? అనే వివరాల్లోకి వెళ్తే…
బాలు సాధారణ మధ్యతరగతి వ్యక్తి. భార్య ప్రశాంతి, కూతురు అక్షరతో కలిసి సంతోషంగా జీవిస్తుంటాడు. పెద్ద పెద్ద ఆశలు లేకపోయినా, తన కుటుంబంతో ప్రశాంతంగా జీవితాన్ని గడపాలనుకుంటాడు. కానీ అనుకోకుండా జరిగిన ప్రమాదం వారి జీవితాలను తలకిందులు చేస్తుంది. అక్షర తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చేరుతుంది. ఆమెకు అత్యవసరంగా శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ఏకంగా 50 లక్షలు అవసరమవుతాయి. అంత పెద్ద మొత్తాన్ని వెంటనే సమకూర్చడం బాలు లాంటి సాధారణ వ్యక్తికి అసాధ్యంగా మారుతుంది.
కూతురి ప్రాణాలను కాపాడుకోవడానికి బాలు తెలిసిన మార్గాలన్నీ ప్రయత్నిస్తాడు. కానీ డబ్బు సమకూరే దారి కనిపించదు. ఒకవైపు ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతున్న అక్షర, మరోవైపు ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్న ప్రశాంతి… వీళ్లిద్దరినీ చూసి బాలు పడే బాధ అంతా ఇంతా కాదు. చివరకు సహాయం కోసం వంశీ అనే మాఫియా నాయకుడిని ఆశ్రయిస్తాడు. అయితే వంశీతో బాలు కుటుంబానికి గతంలోనే సంబంధం ఉంటుంది. అతను కేవలం డబ్బు ఇచ్చి పంపించే వ్యక్తి కాదు.
అక్షర చికిత్సకు అవసరమైన డబ్బు ఇస్తానని వంశీ ముందుకొస్తాడు. కానీ అందుకు ప్రతిగా పెట్టే షరతు బాలు జీవితాన్ని మరో ప్రమాదంలోకి నెడుతుంది. ప్రశాంతి తన భర్తను, కూతురిని వదిలి వంశీ దగ్గరకు తిరిగి రావాలని అతను కోరుతాడు. కూతురి ప్రాణాలను కాపాడుకోవాలంటే తన భార్యను వదులుకోవాల్సిన పరిస్థితి బాలు ముందు నిలుస్తుంది. బిడ్డను కాపాడుకోవాలనే తపన ఒకవైపు, కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసే షరతు మరోవైపు… ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియని స్థితిలో బాలు చిక్కుకుంటాడు. వంశీ వేసిన ఉచ్చులో నుంచి బాలు ఎలా బయట పడతాడు ? అక్షరను కాపాడుకోవడానికి అతను ఏం చేస్తాడు ? తన కుటుంబాన్ని తిరిగి కలిపేందుకు ఎంతటి ప్రమాదానికైనా ఎదురెళ్తాడా ? అన్నదే మిగతా కథ.
‘సుగ్రీవ’ తెలుగు యాక్షన్ డ్రామా. తాజాగా ఈ సినిమా ఆహా (Aha)లో అందుబాటులోకి వచ్చింది. నర్తు చిరంజీవి (Nartu Chiranjeevi) దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బాలు చరణ్, కాజల్ తివారి, సాయి కృప, సుమన్ శెట్టి, కరణ్ విజయ్, గగన గీతిక తదితరులు నటించారు. తండ్రీ – కూతురు సెంటిమెంట్, ప్రాణాలను కాపాడుకోవడానికి ఎదురయ్యే కఠిన నిర్ణయాల నేపథ్యంలో సాగే కథలు ఇష్టపడేవారు ట్రై చేయవచ్చు.
Read Also: అడవిలో ఆపద తెచ్చిన ప్రయాణం… ఆ దారిలో వెళ్తే ప్రాణాలే గాల్లో… టెర్రిఫిక్ తెలుగు థ్రిల్లర్