Supernatural Horror Thriller: ఓటీటీలో లెక్కలేనన్ని హర్రర్ సినిమాలు ఉన్నాయి. అయితే ప్రతి సినిమాలోనూ దెయ్యాలు దేవుడు అంటే భయపడతాయి. కానీ ఏకంగా దేవుడే దెయ్యానికి భయపడితే ? ఏకంగా చర్చ్ లోనే ఓ డెమాన్ అరాచకం సృష్టిస్తే… బాబోయ్ వినడానికే భయనకరంగా ఉంది కదా. ఇక మూవీని చూస్తే వణుకే. ఈ క్రేజీ హర్రర్ మూవీ పేరు ‘ది డెవిల్స్ డోర్‌వే’ (The Devil’s Doorway). మరి ఈ హర్రర్ థ్రిల్లర్ ను ఏ ఓటీటీలో చూడవచ్చు ? తెలుగులో ఉందా లేదా ? అనే విషయాలపై ఒక లుక్కేద్దాం పదండి.
1960వ సంవత్సరంలో కథ మొదలవుతుంది. ఐర్లాండ్‌లోని ఒక మారుమూల ప్రాంతంలో ఉన్న కాథలిక్ కాన్వెంట్ మదర్ అండ్ బేబీ హోమ్. ఈ హోమ్ నేపథ్యంలోనే సినిమా కథ సాగుతుంది. అక్కడ ఉన్న వర్జిన్ మేరీ విగ్రహం కళ్ల నుండి రక్తం కారుతోందని, అది ఒక దైవిక అద్భుతమని వాటికన్ చర్చికి లేఖ అందుతుంది. దీని వెనుక ఉన్న నిజాన్ని పరిశోధించడానికి వాటికన్ నుండి ఇద్దరు పాస్టర్లు బయల్దేరతారు.
ఆ ఇద్దరు పాస్టర్లలో సీనియర్ ఫాదర్ థామస్, యంగ్ ఫాదర్ జాన్ ఉంటారు. ఇద్దరూ కలిసి ఆ కాన్వెంటుకు వెళ్తారు. ఫాదర్ జాన్ అక్కడ జరిగే ప్రతి విషయాన్ని తన ఫిల్మ్ కెమెరాలో రికార్డ్ చేస్తుంటాడు. అక్కడికి వెళ్లిన పాస్టర్లకు ఆ విగ్రహం కళ్ల నుంచి కారుతున్న రక్తం వెనుక ఎలాంటి అద్భుతం లేదని, అది కేవలం మోసమని అర్థమవుతుంది. కానీ అదే సమయంలో ఆ హోమ్‌ను నడిపించే మదర్ సుపీరియర్ అక్కడ ఉన్న అనాథలు, గర్భవతులైన యువతులను ఎంత క్రూరంగా హింసిస్తుందో గమనిస్తారు.
ఒకరోజు రాత్రి ఆ కాన్వెంట్ బేస్‌మెంట్‌లో గొలుసులతో బంధించిన క్యాథ్లిన్ అనే గర్భవతిని వాళ్ళు కనిపెడతారు. ఆమెకు భయంకరమైన దెయ్యం పట్టిందని, ఆమె ద్వారా ఆ కాన్వెంట్‌లో కొన్ని క్షుద్ర పూజలు జరుగుతున్నాయని ఆ పాస్టర్లకు తెలుస్తుంది. ఆ బేస్‌మెంట్‌లో గతంలో చనిపోయిన వందలాది మంది అక్రమ సంతానం పిల్లల ఆత్మలు సంచరిస్తుంటాయి. ఆ దుష్టశక్తుల దాడి నుండి ఆ ఇద్దరు పాస్టర్లు ప్రాణాలతో బయటపడ్డారా లేదా ? ఫాదర్ జాన్ రికార్డ్ చేసిన ఫుటేజ్ ద్వారా ఆ కాన్వెంట్ లో ఏం జరుగుతుందన్నది తెలుసుకున్నారా ? అసలు అక్కడేం జరుగుతోంది ? అన్నది తెలియాలంటే ఈ సినిమాను వీక్షించాల్సిందే.
‘ది డెవిల్స్ డోర్‌వే’ కాన్వెంట్ బేస్‌మెంట్‌లో దాగి ఉన్న భయంకరమైన సీక్రెట్ స్టోరీ. 1960ల కాలం నాటి ఐర్లాండ్ చర్చి కథతో సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్‌గా తెరకెక్కింది. 2018లో విడుదలైన ఈ సినిమాకు ఐస్లిన్ క్లార్క్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఐర్లాండ్‌లో జరిగిన మాగ్డలీన్ లాండ్రీస్ వంటి యథార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఇంగ్లీష్ ఆడియోతో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు ఆడియో ఇంకా రాలేదు కాబట్టి ఇంగ్లీష్ లోనే చూడాలి. మామూలుగా హర్రర్ సినిమాలకు భాష అడ్డుకాదు. మీరు కూడా ఇలాగే అనుకుంటే ఈ మూవీని మిస్ కాకుండా చూడండి.
Read Also: పాత వీడియో టేపులను బాగు చేయడానికెళ్తే బయటపడే పాతిపెట్టిన నిజం… క్లైమాక్స్ కెవ్వు కేక