Thriller Series OTT :ఒక మైండ్ గేమ్ లాంటి థ్రిల్లర్ స్టోరీని చూడాలని ఉందా ? అయితే ఇప్పుడు చెప్పుకోబోయే సిరీస్ మీకు కావాల్సినంత థ్రిల్ ఇస్తుంది. ఇందులో ఫైటింగ్‌లు, ఛేజింగ్‌లు ఉండవు కానీ, చూస్తున్నంత సేపు లోపల ఏదో తెలియని భయం, గుబులు పుట్టిస్తుంది. పైకి సైలెంట్‌గా కనిపిస్తూనే లోపల చాపకింద నీరులా భయంకరమైన విషయాలు జరుగుతుంటాయి. ఇది మెయిన్‌గా ఫ్యామిలీ సీక్రెట్స్ గురించి. ఒకే ఇంట్లో ఉంటూనే ఒకరినొకరు ఎలా నాశనం చేసుకుంటారు, కన్నతల్లే కూతుళ్లకు శత్రువులా ఎలా మారుతుందనేది ఇందులో మెయిన్ పాయింట్. చివరికి వచ్చే ట్విస్ట్ మాత్రం మైండ్ బ్లాక్ చేస్తుంది. దీనికి ఐయండిబిలో 8/10 రేటింగ్ కూడా ఉంది. అంటే సిరీస్ ఏపాటిగా ఉంటుందో తెలుస్తోంది కదూ.
ఈ అమెరికన్ సైకలాజికల్ థ్రిల్లర్ మిని సిరీస్ పేరు ‘షార్ప్ ఆబ్జెక్ట్స్’ (Sharp Objects). 2018లో వచ్చిన ఈ సిరీస్ గిలియన్ ఫ్లిన్ రాసిన నవల ఆధారంగా రూపొందింది. ఈ ఎనిమిది ఎపిసోడ్ల సిరీస్‌కు జీన్-మార్క్ వల్లీ దర్శకత్వం వహించారు. ఇందులో అమీ ఆడమ్స్ ప్రధాన పాత్రలో నటించగా, ప్యాట్రిసియా క్లార్క్సన్, ఎలిజా స్కాన్లెన్, ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. అవార్డుల పరంగా, తల్లి పాత్ర పోషించిన ప్యాట్రిసియా క్లార్క్సన్ తన నటనకు గోల్డెన్ గ్లోబ్ అవార్డును గెలుచుకోగా, అమీ ఆడమ్స్ నటనకు విమర్శకుల నుండి భారీ ప్రశంసలు దక్కాయి. ఇది కేవలం ఒక క్రైమ్ థ్రిల్లర్ మాత్రమే కాదు, ఒక కుటుంబంలోని అంతుచిక్కని రహస్యాలను బయట పెట్టే ఒక గొప్ప సైకలాజికల్ డ్రామా. ఇది ప్రస్తుతం JioHotstar, Google Play ప్లాట్ ఫామ్‌లలో అందుబాటులో ఉంది.
కామిల్లె ప్రీకర్ అనే యువతి సెయింట్ లూయిస్‌లో ఒక క్రైమ్ రిపోర్టర్‌గా పనిచేస్తుంటుంది. ఆమె చిన్నతనంలో తన చెల్లెలు మారియన్ చనిపోవడంతో తీవ్రమైన మానసిక వేదనకు గురవుతుంది. ఆ బాధను తట్టుకోలేక తన శరీరంపై బ్లేడ్లతో కోసుకుంటూ తనని తాను బాధపెట్టుకుంటూ ఉంటుంది. అయితే ఆమె సొంత ఊరులో ఇద్దరు చిన్న పిల్లలు హత్యకు గురవడంతో, ఆమె ఎడిటర్ ఆమెను ఆ ఊరికి పంపిస్తాడు. అక్కడికి వెళ్ళిన కామిల్లెకు తన పాత ఇల్లు, తన తల్లి అడోరాతో ఉన్న గత చేదు అనుభవాలు మళ్ళీ గుర్తొచ్చి మరింత కుంగిపోతుంది.
కామిల్లె తల్లి అడోరా ఆ ఊరిలోనే పెద్ద ధనవంతురాలు. ఆమెకు పరువు, ప్రతిష్టలు ముఖ్యం. కామిల్లె తిరిగి రావడం ఆమెకు అస్సలు ఇష్టం ఉండదు. అడోరా తన రెండో కూతురు ఎమి ని చాలా గారాబంగా, ఒక చిన్న పాపలా చూసుకుంటుంది. కానీ ఎమి బయటకి మాత్రం చాలా మొండిగా, కుర్రాళ్లతో తిరుగుతూ వింతగా ప్రవర్తిస్తుంటుంది. మరోవైపు ఊరిలో జరిగిన హత్యల్లో చనిపోయిన పిల్లల పళ్ళు ఎవరో పీకేయడం అందరినీ భయపెడుతుంటుంది. కామిల్లె ఆ హత్యల మిస్టరీని ఛేదించే క్రమంలో డిటెక్టివ్ రిచర్డ్‌తో కలిసి పని చేస్తుంది. అసలు విచారణలో కామిల్లెకు ఒక భయంకరమైన నిజం తెలుస్తుంది. తన తల్లి అడోరాకు ఒక మానసిక జబ్బు ఉందని అర్థమవుతుంది.
ఈ జబ్బు ఉన్నవాళ్లు తమ పిల్లలకు రకరకాల మందులు, విషం కలిపి ఇచ్చి జబ్బు పడేలా చేస్తారు. ఆ తర్వాత వాళ్ళకు సేవలు చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తారు. కామిల్లె చిన్న చెల్లెలు మారియన్ చనిపోయింది కూడా తల్లి ఇచ్చిన విషం వల్లేనని తెలుస్తుంది. దీంతో పోలీసులు అడోరాను అరెస్ట్ చేస్తారు. కానీ అసలు క్లైమాక్స్ ట్విస్ట్ ఏంటంటే.. అడోరా జైలుకు వెళ్ళాక ఎమి, కామిల్లెతో కలిసి ఉండటానికి వస్తుంది. ఒకరోజు ఎమి గదిని క్లీన్ చేస్తుంటే, అందులో అసలైన మనుషుల పళ్ళు కామిల్లె గుర్తిస్తుంది. అప్పుడే ఆమెకు అర్థమవుతుంది. ఆ ఇద్దరు పిల్లలను చంపింది తన తల్లి కాదు, తన చెల్లెలు ఎమి అని. చివరికి ఈ క్లైమాక్స్ ఎలాంటి మలుపులు తిరుగుతుంది ? నిజం తెలుసుకున్న కామిల్లె ఈ పరిస్థితిని ఎలా హ్యాండిల్ చేస్తుంది ? అనే విషయాలను, ఈ సిరీస్ ఈ థ్రిల్లర్ సిరీస్ ను చూసి తెలుసుకోవాల్సిందే.
Read Also : బ్లాక్ మెయిల్ ఉచ్చులో వయ్యారి భామ… ఆటాడేసుకునే అపరిచితుడు… మైండ్ గల్లంతయ్యే క్లైమాక్స్