Dark Comedy OTT: లైఫ్ లో సెటిల్ అవ్వాలనే యాంబిషన్ ప్రతీ ఒక్కరికీ ఉంటుంది. కానీ కొంతమంది మాత్రం అల్లరి చిల్లరగా తిరుగుతూ, లైఫ్ ను ఎంజాయ్ చేద్దాం అనుకుంటారు. అలాంటి ఏడుగురు ఆవారాగాళ్ల కథనే ఈరోజు మన మూవీ సజెషన్. ఈ డార్క్ కామెడీ క్రైమ్ ఫిల్మ్ పేరు ‘సాత్ ఉచక్కే’ (Saat Uchakkey). 2016లో విడుదలైన ఈ మూవీ ఏ ఓటీటీలో ఉంది ? స్టోరీ ఏంటి ? అన్న విషయాలపై ఒక లుక్కేద్దాం పదండి.
పప్పి అనే వ్యక్తి మన హీరో. చిన్న చిన్న దొంగతనాలు, మోసాలు చేసే చిన్న దొంగ. సోనా అనే అమ్మాయిని పప్పి ప్రాణంగా ప్రేమిస్తాడు. సోనా కూడా అతన్ని ఇష్టపడుతుంది. కానీ సోనా తల్లిదండ్రులు ఆమెకు పెళ్లి చేయాలని చూస్తుంటారు. పప్పి దగ్గర సరైన ఇల్లు, డబ్బు లేకపోవడంతో సోనాను పెళ్లి చేసుకోవడం అతనికి పెద్ద సమస్యగా మారుతుంది. ఎలాగైనా త్వరగా పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించి, సోనాను పెళ్లి చేసుకోవాలని పప్పి డిసైడ్ అవుతాడు. అదే సమయంలో ఢిల్లీలోని ఒక పురాతనమైన, శిథిలావస్థకు చేరిన పెద్ద హవేలీ గురించి పప్పికి ఎవ్వరికీ తెలియని సీక్రెట్ తెలుస్తుంది.
ఆ హవేలీ యజమాని దివాన్ అనే వృద్ధుడు. పైగా అతనికి మెంటల్ హెల్త్ ఏమాత్రం బాగుండదు. ఆ హవేలీ నేలమాళిగలో పూర్వీకులు దాచిపెట్టిన కోట్ల విలువైన బంగారం, పురాతన వస్తువులు ఉన్నాయని పప్పికి గట్టి నమ్మకం కలుగుతుంది. ఆ నిధిని ఎలాగైనా దొంగిలిస్తే తన జీవితం సెటిల్ అయిపోతుందని పప్పి ప్లాన్ వేస్తాడు. ఒంటరిగా అంత పెద్ద హవేలీలో దొంగతనం చేయడం సాధ్యం కాదు. అందుకే పప్పి తనలాగే డబ్బు అవసరం ఉన్న, మరో ఆరుగురు చిల్లర దొంగలు, కేటుగాళ్లను ఒకచోటకు చేరుస్తాడు.
వీరిలో తాళాలు తీయడంలో ఎక్స్‌పర్ట్ జగీ, పప్పి స్నేహితులు హగ్గు, అల్తూ, బాబే, సుందర్ ఉంటారు. ఈ ఏడుగురు కలిసి ఆ హవేలీలో దొంగతనం చేయడానికి మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తారు. ఈ గ్రూప్‌నే ‘సాత్ ఉచక్కే’ అంటారు. ఈ దొంగల గ్యాంగ్‌కు పెద్ద శత్రువు లోకల్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ తేజ్‌పాల్. తేజ్‌పాల్‌కు పప్పి అంటే అస్సలు పడదు. పైగా తేజ్‌పాల్ కూడా సోనాను ఇష్టపడుతుంటాడు. ఆమెను పెళ్లి చేసుకోవాలని చూస్తుంటాడు. పప్పి గ్యాంగ్ కదలికలపై తేజ్‌పాల్ ఎప్పుడూ కన్నేసి ఉంచుతాడు.
చివరికి ఓరోజు రాత్రి, పప్పి గ్యాంగ్ ఎలాగోలా కష్టపడి ఆ హవేలీలోకి అడుగు పెడుతుంది. కానీ అక్కడ వారికి ఊహించని షాక్ తగులుతుంది. ఆ షాక్ ఏంటి ? అక్కడున్న సాధువు ఎవరు ? నేలమాళిగలో నిజంగానే నిధి దొరుకుతుందా ? ఈ గందరగోళంలో సోనాను పప్పి ఎలా దక్కించుకున్నాడు ? ఇన్‌స్పెక్టర్ తేజ్‌పాల్ నుండి ఈ ఏడుగురు ఎలా తప్పించుకున్నారు ? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా.
మనోజ్ బాజ్‌పాయ్, అనుపమ్ ఖేర్, కేకే మీనన్ తదితరులు నటించిన ఈ సినిమా అనూహ్య ట్విస్టులతో ప్రేక్షకులను అలరిస్తుంది. ప్రస్తుతం Amazon Prime Video, JioHotstarలలో హిందీ ఆడియోతో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు డబ్బింగ్ అందుబాటులో లేదు. డార్క్ కామెడీ మూవీ లవర్స్ ఖచ్చితంగా వర్త్ వాచింగ్ అంటారు.
Read Also: శబరిమల కొండల్లో కొడుకు మిస్సింగ్… ఎమోషనల్ తమిళ ఫ్యామిలీ డ్రామా