Airtel Plans: టెలికాం నియంత్రణ సంస్థ (ట్రాయ్) కొత్త నిబంధనల ప్రకారం భారతీ ఎయిర్టెల్ ప్రత్యేకంగా వాయిస్ కాల్స్, ఎస్ఎంఎస్ల కోసం ప్రత్యేక ప్రీపెయిడ్ ప్లాన్లను మార్కెట్లోకి తీసుకువచ్చింది. కేవలం కాల్స్, మెసేజ్‌లు మాత్రమే ఉపయోగించుకునే వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని ఈ ప్లాన్లను రూపొందించినట్లు కంపెనీ తెలిపింది.
వినియోగదారుల అవసరాలకు తగినట్లుగా ఎయిర్టెల్ మూడు భిన్నమైన ప్లాన్లను ప్రకటించింది. ఇవి ఎయిర్టెల్ అధికారిక వెబ్సైట్, యాప్‌లో అందుబాటులో ఉన్నాయి. రూ. 185, రూ. 203, రూ. 206 ధరలతో లభించే ఈ ప్లాన్ల ద్వారా వినియోగదారులకు అపరిమిత లోకల్, ఎస్టీడీ, రోమింగ్ కాల్స్‌తో పాటు ప్రతి ప్లాన్‌లో 300 ఎస్ఎంఎస్లు ఉచితంగా లభించనున్నాయి. ఇవి కాకుండా మూడు ప్లాన్లలోనూ ఉచితంగా హలోట్యూన్స్ (కాలర్ ట్యూన్) సౌకర్యం కూడా కల్పించారు.
రూ. 185 ప్లాన్ విషయానికి వస్తే ఇది 28 రోజుల వ్యాలిడిటీని కలిగి ఉంది. ప్రతీ రోజూ అపరిమిత కాల్స్, మెసేజ్ లు చేసుకోవచ్చు. అటు రూ. 203 ప్లాన్ ను సరిగ్గా 30 రోజుల వ్యాలిడిటీతో ఎయిర్ టెల్ తీసుకొచ్చింది. మరోవైపు రూ. 206 ప్లాన్ ను సైతం 30 రోజుల వ్యాలిడిటీతో లాంచ్ చేసింది. అయితే దీనికి నిర్ణీత రోజుల కాలపరిమితి కాకుండా ‘క్యాలెండర్ మంత్’ (నెలవారీ) ప్రాతిపదికన వాలిడిటీ వర్తించనుండటం గమనార్హం.
మొబైల్ డేటా అవసరం లేని వినియోగదారులు అనవసరంగా ఇంటర్నెట్ కు కలిపి డబ్బులు చెల్లించాల్సి వస్తోందన్న ఫిర్యాదులను దృష్టిలో ఉంచుకుని ట్రాయ్ ఈ కొత్త విధానాన్ని తీసుకువచ్చింది. గత నెలలో ప్రకటించిన నూతన మార్గదర్శకాల ప్రకారం అక్టోబర్ 21 లోపు టెలికాం ఆపరేటర్లందరూ ఎలాంటి మొబైల్ డేటా లేని ప్రత్యేక వాయిస్, ఎస్ఎంఎస్ ప్లాన్లను ప్రవేశపెట్టాలని ఆదేశించింది. అంతేకాకుండా వినియోగదారులకు తక్కువ కాల వ్యవధి ప్లాన్లు, నెలవారీ రెన్యూవల్ ఉన్న ఆప్షన్లను అందుబాటులో ఉంచాలని స్పష్టం చేసింది.
Also Read: ఎల్ నినో ఎఫెక్ట్‌ను తట్టుకునేలా తెలంగాణ మాస్టర్ ప్లాన్.. డ్రోన్లతో సర్వే!
ఇదిలా ఉంటే ఎయిర్ టెల్ తీసుకొచ్చిన కొత్త ప్లాన్లతో ఫీచర్ ఫోన్ యూజర్లకు ఎక్కువ ప్రయోజనం కలగనుంది. అలాగే వై-ఫై (Wi-Fi) ద్వారా నెట్‌ను వినియోగించుకునేవారు, రెండో సిమ్‌ను కేవలం కాల్స్ కోసమే ఉపయోగించేవారికి ఈ కొత్త ప్లాన్లు ఎంతో ప్రయోజనకరంగా ఉండనున్నాయి. వినియోగదారుల అవసరాన్ని బట్టి 28 రోజులు, 30 రోజులు, క్యాలెండర్ నెలవారీ ప్లాన్లలో దేనినైనా ఎంచుకునే వెసులుబాటును ఎయిర్టెల్ కల్పించింది.