Water Conservation: రాష్ట్రంలోని నీటి కొరత కు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రిపేర్ అవుతున్నది. భవిష్యత్తు రోజుల్లో రాష్ట్రంలో చుక్క నీటి కొరత కూడా తలెత్తకుండా ఉండేందుకు, భూగర్భ జలమట్టాలను శాశ్వతంగా పరిరక్షించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఓ ప్రణాళికకు శ్రీకారం చుట్టింది.రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జల వనరుల స్థితిగతులపై సమగ్ర సర్వే నిర్వహించేందుకు యంత్రాంగం సన్నద్ధమైంది. రాష్ట్రంలోని అన్ని గ్రామాలు, పట్టణాలు, నగరాల పరిధిలో ఉన్న చెరువులు, కుంటలు, కాలువలు ,జలాశయాల స్థితిగతులపై ప్రభుత్వం ఇప్పటికే ఒక ప్రాథమిక నివేదికను సిద్ధం చేసింది. ఏయే చెరువుల్లో ఎంత నీటి నిల్వ సామర్థ్యం ఉంది? ప్రస్తుతం వాటిలో ఉన్న నీరును ఏ మేరకు వినియోగించవచ్చు? సాగు, తాగుకు ఎంత శాతం వాడవచ్చు? అనే వివరాలను రిపోర్టు రూపంలో తయారు చేశారు.
అయితే కేవలం ప్రాథమిక అంచనాలతోసరిపెట్టకుండా, మైక్రో లెవెల్లో ప్రతీ జలవనరు పూర్తి సమాచారాన్ని రికార్డు చేసేందుకు ప్రత్యేక స్క్రీనింగ్ ప్రోగ్రామ్ చేపట్టనున్నారు. శాటిలైట్ మ్యాపింగ్, డ్రోన్ సర్వేలు, క్షేత్రస్థాయి పరిశీలన ద్వారా నీటి వనరుల విస్తీర్ణం, వాటి క్యాచ్మెంట్ ఏరియా, కాలుష్య ప్రభావాలను ఈ స్క్రీనింగ్ ద్వారా రికార్డు చేయనున్నారు. అంతేగాక ప్రాంతాల వారీగా భూగర్భ జలమట్టాల ను తనిఖీ చేయనున్నారు. రాష్ట్రాన్ని వివిధ మండలాలు, రీజియన్లుగా విభజించి, ప్రాంతాల వారీగా గ్రౌండ్ వాటర్ లెవల్స్ తనిఖీ చేయనున్నారు.
Also read: నీళ్లు, నిధులు, నియామకాలు కేసీఆర్ ఇంట్లోనే : ఎంపీ చామల
ప్రపంచ వ్యాప్తంగా ఇతర దేశాల్లో నీటి కరవు వచ్చిన పరిస్థితుల్లో ఆయా దేశాలు అనుసరించిన విధానాలను సీఎంవో కార్యాలయం అధ్యయనం చేస్తున్నది. ముఖ్యంగా ఇజ్రాయెల్, సింగపూర్ , ఆస్ట్రేలియా దేశాల్లో నీటి వినియోగంలో పాటిస్తున్న విధానాలు, మైక్రో ఇరిగేషన్ పద్ధతులు వంటి వాటిని పరిశీలిస్తున్నారు. ఆయా దేశాల్లో తీవ్ర కరవు సమయాల్లో అమలు చేసే వాటర్ గ్రిడ్ యాజమాన్య పద్ధతులపై సీఎంవో అధికారులు క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్నారు. ప్రస్తుతం ఎన్ నినో నేపథ్యంలో రాబోయే రోజుల్లో మరింత ప్రతికూల వాతావరణ పరిస్థితులు, తీవ్ర కరవు వస్తే ఎదుర్కొనేందుకు వీలుగా ముందస్తుగా హెచ్చరించే వ్యవస్థలతో పాటు, అత్యవసర యాక్షన్ ప్లాన్లను రూపొందిస్తున్నారు. వ్యవసాయ రంగానికి నష్టం వాటిల్లకుండా ప్రత్యామ్నాయ పంటలు, బిందు- తేలిక పాటి సేద్యం,రిజర్వాయర్ల మధ్య వాటర్ గ్రూపింగ్ పద్ధతులపై స్పష్టమైన మార్గదర్శకాలు సిద్ధం చేస్తున్నారు.
భూగర్భ జలాల లభ్యత ,లోతు అనేది ప్రతి జిల్లా,మండలానికి విభిన్నంగా ఉంటుంది. అర్భన్ ప్రాంతాలతో పోల్చితే రూరల్ లో భూ గర్భ జలాలు కాస్త పైకి ఉంటాయి. ఈ నేపథ్యంలో అర్భన్, సెమీ అర్భన్ జిల్లా నీటి వినియోగం తగ్గించేలా యాక్షన్ ప్లాన్ ను అమలు చేయనున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని జిల్లాలు, యాదాద్రిభువనగిరి, నల్లగొండ, మెదక్, మహబూబ్ నగర్ వంటి జిల్లాలపై ప్రభుత్వం అత్యధికంగా ఫోకస్ పెట్టనున్నది. ఆయా ప్రాంతాల్లో కమ్యూనిటీ ఇంకుడు గుంతలు, చెక్ డ్యామ్ ల పునరుద్దరణ పనులను చేపట్టనున్నారు. రిజర్వాయర్లు, మున్సిపల్ పంపింగ్ కేంద్రాలు, గ్రామీణ తాగునీటి ప్రాజెక్టులలో వాటర్ నిల్వలు ,సరఫరాను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేలా సెంట్రలైజ్డ్ మానిటరింగ్ సిస్టమ్ ను ఏర్పాటు చేస్తున్నారు. అంతేగాక నీటి సరఫరా పైపులైన్లలో లీకేజీలను అరికట్టడం, శుద్ధి చేసిన వ్యర్థ నీటిని ఇండస్ట్రీలు, నిర్మాణ రంగానికి మళ్లించి మంచి తాగునీటి ఒత్తిడిని తగ్గించేందుకు ప్రయత్నించనున్నారు.
Also read: ఆకాశంలో ఓ అరుదైన నక్షత్రాన్ని కనిపెట్టిన సైంటిస్టులు.. ఇది ఎరంగులో ఉందంటే..?