iPhone Duo: యాపిల్ ఫోల్డబుల్ ఐఫోన్ వాడటం మొదలుపెట్టిన కొద్ది గంటల్లోనే స్క్రీన్ పగిలిందంటే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. లక్షల రూపాయలు పెట్టి కొనుగోలు చేసిన ఫోన్ ఇలా దెబ్బతింటే నిరాశ కలగడం సహజం. ఇప్పుడు కొందరు ఐఫోన్ డ్యూయో యూజర్లు తమ ఫోన్లలోని లోపలి స్క్రీన్‌పై పగుళ్లు కనిపిస్తున్నాయని చెబుతున్నారు. ముఖ్యంగా ఫోన్ మడిచే మధ్య భాగంలోనే ఈ సమస్య కనిపిస్తుండటంతో హింజ్ పనితీరుపై అనుమానాలు మొదలయ్యాయి. అయితే, అసలు కారణం ఏంటి? యాపిల్ ఫోన్‌లో నిజంగానే సమస్య ఉందా? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..
ఆస్ట్రేలియాకు చెందిన ఓ ఐఫోన్ డ్యూయో యూజర్ రెడిట్‌లో తన అనుభవాన్ని పంచుకున్నారు. ఫోన్ కొనుగోలు చేసిన 6 గంటల్లోపే లోపలి స్క్రీన్ పగిలిందని తెలిపారు. అప్పటికి ఫోన్‌ను 20 సార్లు కూడా తెరిచి మడవలేదని చెప్పారు. ఫోన్ తెరిచే సమయంలో హింజ్ దగ్గర ఏదో తగిలినట్టు అనిపించిందని, ఆ తర్వాత పగిలిన శబ్దం వినిపించిందని వివరించారు. స్క్రీన్‌పై లేదా బయట హింజ్‌పై ఎలాంటి స్పష్టమైన గుర్తులు కనిపించలేదని పేర్కొన్నారు. వెంటనే యాపిల్ స్టోర్‌కు వెళ్లగా, కొత్త ఫోన్‌ను ఇచ్చారని తెలిపారు. అయితే, కొనుగోలు చేసిన రోజే మళ్లీ స్టోర్‌కు వెళ్లాల్సి రావడం నిరాశ కలిగించిందని చెప్పారు.
Also Read: వాట్సప్, టెలిగ్రామ్ యూజర్లకు బిగ్ అలర్ట్.. జనవరి 1 నుంచి ఆ రూల్స్ నిజమేనా? కేంద్రం క్లారిటీ!
ఈ ఘటన ఒక్కటే కాదు. చైనాకు చెందిన ఆన్‌లైన్ కమ్యూనిటీల్లో కూడా దెబ్బతిన్న ఐఫోన్ డ్యూయో స్క్రీన్ల ఫొటోలు కనిపించాయని ఆండ్రాయిడ్ అథారిటీ తెలిపింది. కొన్ని ఫొటోల్లో ఫోన్ మధ్య మడత దగ్గర పగుళ్లు కనిపిస్తున్నాయి. అయితే, ఆ ఫోన్లు ఎలా దెబ్బతిన్నాయో స్పష్టమైన సమాచారం లేదు. ప్రమాదవశాత్తూ దెబ్బ తగిలిందా, లేక ఫోన్‌లోనే సమస్య ఉందా అనేది ఇంకా తెలియాల్సి ఉంది.
వరుసగా ఒకే ప్రాంతంలో పగుళ్లు కనిపిస్తుండటంతో హింజ్ డిజైన్‌పై ప్రశ్నలు వస్తున్నాయి. అయినా.. ఇప్పుడే ఫోన్ తయారీలో లోపం ఉందని చెప్పలేం. ఈ ఘటనలు ఎంతమంది యూజర్లకు ఎదురయ్యాయో కూడా స్పష్టత లేదు.
యూట్యూబర్లు టిమ్ పాన్, జొవాన్నా స్టెర్న్ ఫోన్‌ను పలుమార్లు మడిచి పరీక్షించినట్లు ఆండ్రాయిడ్ అథారిటీ పేర్కొంది. వేలసార్లు మడిచిన తర్వాత కొంత అరుగుదల కనిపించినా, ఆ పరీక్షల్లో స్క్రీన్ పగలలేదు. అయితే, కొద్ది ఫోన్లపై చేసిన పరీక్షలతో అన్ని ఫోన్లూ సురక్షితమని చెప్పలేం. ఈ ఘటనలపై యాపిల్ నుంచి ఇప్పటివరకు విస్తృత సమస్యను నిర్ధారించే అధికారిక ప్రకటన లేదు. అసలు కారణం తెలుసుకోవాలంటే దెబ్బతిన్న ఫోన్లను పరిశీలించాల్సి ఉంటుంది. అప్పటివరకు హింజే కారణమని తేల్చడం తొందరపాటే.
Also Read: ఇండియాలోనే డిజైన్, ఇండియాలోనే తయారీ.. 2028 నాటికి రాబోతున్న మన సొంత ఫోన్లు!